యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మరోసారి పేట్రేగిపోయాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా మహారాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు.
ఈ టోర్నీ తొలి 3 మ్యాచ్‌ల్లో విఫలమైన వైభవ్ ఎట్టకేలకు మహారాష్ట్ర బౌలర్లపై జూలు విదిల్చాడు.
58 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన అతడు.. ఓవరాల్‌గా 61 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 108 పరుగులు చేశాడు. వైభవ్ ధాటికి ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అతని జట్టు బిహార్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
మరో చరిత్ర
ఈ ఇన్నింగ్స్‌తో వైభవ్ మరో విభాగంలో చరిత్ర సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా (14 ఏళ్ల 250 రోజులు) రికార్డు నెలకొల్పాడు.
వైభవ్‌కు ముందు ఈ రికార్డు మహారాష్ట్ర ఆటగాడు విజయ్ జోల్ పేరిట ఉండేది. జోల్ 18 ఏళ్ల, 118 రోజుల వయసులో ముంబైపై 63 బంతుల్లో 109 పరుగులు చేశాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో వైభవ్‌కు ఇదే తొలి శతకం. ఓవరాల్‌గా 16 మ్యాచ్‌ల టీ20 కెరీర్‌లో మూడవది.































