చివరకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినందుకు హ్యాపీ: కమల్ హాసన్

”నేను కనీసం పదో తరగతి (ఎస్.ఎస్.ఎల్‌.సి) పాసై ఉంటే నాకు రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చి ఉండేదని నా తల్లి చెబుతుండేది.. నేను స్కూల్ డ్రాపౌట్..


అయినా 70వయసులో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఆ సమయంలో అమ్మా నాన్న నాకు ముందుగా గుర్తొచ్చారు” అని అన్నారు కమల్ హాసన్.

ఇటీవల కేరళలో జరిగిన హోర్టస్ ఆర్ట్ అండ్ లిటరేచర్ ఫెస్టివల్ లో విశ్వనటుడు కమల్ హాసన్ ప్రసంగిస్తూ తన గురించి తన తల్లిదండ్రులు ఎలాంటి కలలు కనేవారో వెల్లడించారు. సీనియర్ నటి మంజు వారియర్‌తో జరిగిన ఒక సెషన్‌లో సినిమాలు, రాజకీయాల గురించి చర్చిస్తూ కమల్ పై విధంగా వ్యాఖ్యానించారు. ఇటీవల రాజ్యసభ ఎంపీ అయినప్పుడు మీకు ఎలా అనిపించిందో చెప్పాలని యాంకర్ ప్రశ్నించగా.. చివరకు తనకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినందున చాలా సంతోషించానని అన్నారు.

తన తల్లి కలలు కన్న ఉద్యోగమిదని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో మా అమ్మా నాన్న శ్రీనివాసన్ అయ్యంగార్- రాజ్యలక్ష్మిని గుర్తు చేసుకున్నానని కమల్ అన్నారు. “నేను సభకు వెళ్లి సంతకం చేసాను… అక్కడ వారు నా రోజువారీ ఖర్చులకు ఇచ్చారు. నేను నా తల్లికి లేదా ఎవరికైనా ఫోన్ చేసి, నేను ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నానని చెప్పాలనుకున్నాను. నాకు గర్వంగా అనిపిస్తుంది“ అని కమల్ వ్యాఖ్యానించారు. ప్రజా సేవ చేయాలని ఎప్పుడూ అనిపించేది.. నేను కోరుకున్న అవకాశం లభించినందుకు గర్వంగా ఉందని కూడా అన్నారు.

తనకు ఉన్న రాజకీయ భావజాలం గురించి ప్రస్థావిస్తూ.. తనను తాను కేంద్రవాదిగా చెప్పుకుంటానని అన్నారు. తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ తాను సైద్ధాంతికంగా నమ్మే అంశాలను బలపరుస్తుందని ఆయన పేర్కొన్నారు.

కెరీర్ మ్యాటర్ కి వస్తే,..కమల్ చివరిసారిగా నటించిన థగ్ లైఫ్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ చిత్రంలో శింబు, త్రిష కీలక పాత్రలు పోషించారు. సినిమా ఫెయిలైనా కానీ, నటుడిగా కమల్ హాసన్ మరోసారి విశ్వరూపం చూపించారు. రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించే ఓ చిత్రాన్ని నిర్మించేందుకు కమల్ సన్నాహకాలలో ఉన్నాడు. ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహించాల్సిందిగా ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత ధనుష్ సహా పలువురి పేర్లు రేసులో వినిపించాయి. కానీ దర్శకుడు ఎవరు? అన్నది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.