ట్రాఫిక్ చలాన్లపై భారీ డిస్కౌంట్స్ వచ్చేశాయ్.. 100 శాతం వరకు ఛాన్స్..

మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయా..? ఆ మొత్తాన్ని చెల్లించడానికి రాయితీ కోసం ఎదురు చూస్తున్నారా..? అయితే.. ఇది మీకు నిజంగా శుభవార్త.


డిసెంబర్ రెండో వారంలో.. సరిగ్గా డిసెంబర్ 13న జరగబోయే దేశవ్యాప్త లోక్ అదాలత్‌లో మీ పాత ట్రాఫిక్ చలాన్లను 50 శాతం నుంచి 100 శాతం వరకు రాయితీతో (డిస్కౌంట్‌తో) క్లియర్ చేసుకునే అద్భుత అవకాశం లభించింది. ఈ లోక్ అదాలత్ ద్వారా చలాన్‌లను సెటిల్ చేసుకోవడం వలన.. మీపై ఉన్న కేసు పూర్తిగా క్లోజ్ అవుతుంది. భవిష్యత్తులో మళ్లీ ఆ చలాన్లకు సంబంధించి కోర్టు విచారణ ఉండదు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA) పర్యవేక్షణలో ఈ లోక్ అదాలత్‌లను నిర్వహిస్తారు. చిన్నపాటి ట్రాఫిక్ ఉల్లంఘనలను ఇక్కడ పరిష్కరిస్తారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో 11 రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కూడా భాగమవుతోంది.

రాయితీకి అర్హత ఉన్న ట్రాఫిక్ ఉల్లంఘనలు..

చిన్నపాటి ఉల్లంఘనలు, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పాత ఈ-చలాన్లను ఈ లోక్ అదాలత్‌లో సెటిల్ చేసుకోవచ్చు. వాటిలో ముఖ్యంగా.. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, సీట్‌బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేయడం,
రెడ్ సిగ్నల్ జంప్ చేయడం, సాధారణ ఓవర్ స్పీడింగ్ కేసులు, రాంగ్ పార్కింగ్ ఉల్లంఘనలు, పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల విధించిన చలాన్లు, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల విధించిన చలాన్లు,
నంబర్ ప్లేట్ లేకపోవడం, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లోపాలు, ఇతర పొరపాట్లతో తప్పుగా నమోదైన చలాన్లు.. ఇన్నీ ఈ లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చు.

అధికారులు స్పష్టం చేసిన దాని ప్రకారం.. ప్రాణాలకు ముప్పు కలిగించే లేదా తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులకు ఈ రాయితీ వర్తించదన్నారు. దీనిలో.. మద్యం సేవించి వాహనం నడపడం (డ్రంక్ అండ్ డ్రైవ్), హిట్ అండ్ రన్ కేసులు, ప్రమాదకర డ్రైవింగ్, గాయాలు లేదా మరణాలకు దారితీసిన రోడ్డు ప్రమాదాలు వంటి కేసులు ఉన్నాయి.చలాన్లు సెటిల్ చేసుకునే విధానం ఇలా..

ఈ లోక్ అదాలత్ అవకాశాన్ని వినియోగించుకోవడానికి.. ప్రజలు ఈ క్రమానుక్రమ పద్ధతిని పాటించాల్సి ఉంటుంది. ముందుగా మీ వాహనంపై ఎన్ని చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయో ఆన్‌లైన్‌లో తనిఖీ చేసుకోవాలి. దీని కోసం https://echallan.tspolice.gov.in/publicview/ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. దీని ప్రకారం మీకు పైన చెప్పిన విధంగా చలాన్లు పెండింగ్ లో ఉంటే.. ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. లోక్ అదాలత్‌కు వెళ్లే ముందు.. వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు (RC), డ్రైవింగ్ లైసెన్స్, పాత చలాన్ కాపీలు వంటి అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలి. లోక్ అదాలత్ నిర్వహించే నిర్దేశిత ప్రదేశానికి నేరుగా వెళ్లాల్సి ఉంటుంది.

అక్కడ సంబంధిత ట్రాఫిక్ లేదా న్యాయ అధికారులను కలిసి, మీ చలాన్ కేసును సమర్పించాలి. అధికారులు మీ కేసును పరిశీలించి.. రాయితీ శాతం (50 శాతం నుంచి 100 శాతం) నిర్ణయిస్తారు. రాయితీ తర్వాత మిగిలిన మొత్తాన్ని అక్కడే చెల్లించి.. చలాన్‌ను క్లియర్ చేసుకోవచ్చు. చలాన్ సెటిల్ చేసిన తర్వాత.. మీ కేసు శాశ్వతంగా ముగుస్తుంది. మరిన్ని వివరాల కోసం మీరు https://nalsa.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.