హైదరాబాద్ టూ బెంగళూరు.. ఇకపై 8 గంటల ప్రయాణం కాదు.. కేవలం రెండున్నర గంటలే.

హైదరాబాద్, బెంగళూరు మధ్య ప్రయాణం సమయం తగ్గనుంది. సాధారణంగా ఈ రెండు ఐటీ నగరాల మధ్య ఇప్పటివరకు ఎక్స్‌ప్రెస్ సర్వీసులు, తాజాగా వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి.


ఇప్పుడు కొత్తగా బుల్లెట్ ట్రైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న పలు ఎకనామిక్ కారిడార్ల మధ్య బుల్లెట్ ట్రైన్ నడపాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగానే హైదరాబాద్-బెంగళూరు మార్గాన్ని ఎంచుకుంది. ఇక ఈ బుల్లెట్ ట్రైన్ కర్నూలు జిల్లా మీదుగా వెళ్లేందుకు మార్గం సుగమం అవుతోంది. అందుకు అనువైన ట్రాక్ నిర్మించేందుకు మట్టి నమూనాలను సేకరిస్తున్నారు అధికారులు.

కర్నూలు నుంచి బెంగళూరు వందేభారత్ ప్రయాణం సుమారు 5.30 గంటలు పడుతోంది. అది కూడా గరిష్ట వేగం 130 కిలోమీటర్లతో నడుపుతున్నారు. అదే బుల్లెట్ ట్రైన్ ట్రాక్ ఎక్కితే ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం సమయం 1.20 గంటల్లోనే చేరుకోవచ్చు. బుల్లెట్ ట్రైన్ గరిష్ఠ వేగం గంటకు 320 కి.మీ.గా ఉండనుంది. అటు గుంటూరు-గుంతకల్లు మార్గంలో చేపట్టిన డబ్లింగ్‌ పనులు తుది దశకు చేరుకున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి ఇవి పూర్తయ్యే అవకాశం ఉంది. ఒకవేళ పూర్తైతే నంద్యాల నుంచి గుంటూరు, విజయవాడ, గుంతకల్లు వైపు పలు కొత్త సర్వీసులు నడిపే అవకాశం ఉంది. కాగా, గతంలో ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిని అనుసంధానం చేస్తూ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు నడిపేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.