ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. సూపర్ సిక్స్ అమలు సాధ్యం కాదన్నారని..
సూపర్ హిట్ చేసి చూపించామని వ్యాఖ్యానించారు. రైతుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని.. రైతుకు పూర్తిగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. నదుల అనుసంధానం చేసి చూపిస్తామని సీఎం స్పష్టం చెప్పారు. అదే సమయంలో విద్యుత్ ఛార్జీల పైన సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేసారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు రైతన్న మీ కోసం కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ సమస్యల పైన స్పందించారు. రైతాంగానికి ప్రభుత్వం పూర్తిగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. గోపాలపురం నియోజకవర్గ పరిధిలో నల్లజర్లలో రైతులతో ముఖా ముఖి నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో కీలక ప్రకటన చేసారు. విద్యుత్ ఛార్జీలను పెంచేది లేదని చంద్రబాబు ప్రకటించారు. నాణ్యమైన విద్యుత్ అందిస్తామని స్పష్టం చేసారు. కాగా, నదుల అనుసంధానం కోసం ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని వివరించారు. వైసీపీ హయాంలో భూ రికార్డులు తారుమారు చేశారని ఆరోపించారు. ఇష్టం ఉంటే భూరికార్డులు అలాగే ఉంచారని.. భూములు కబ్జా చేయాలనుకుంటే 22ఏ విధానం అనుసరించారని ఆరోపించారు. వైసీపీ నేతలు ప్రభుత్వ భూములను ఆక్రమించారని విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన తరువాత మొదటగా రైతుల సమస్యలు పరిష్కరించాలని అనుకున్నామని దాని తర్వాత మిగతా సమస్యలపై దృష్టి సారించామని తెలిపారు. వ్యవసాయంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రైతుల్లో కూడా మార్పు రావాలి. మేము రూపాయి ఇస్తే, మీరు రుపాయి ఖర్చుపెట్టాలి. చదువుకునే పిల్లలు కూడా వ్యవసాయం అంటే పొలాల నుంచే నేర్చుకోవాలి. ప్రస్తుతం వ్యవసాయ పనులు చేయడానికి ప్రజలు ముందుకు రావడం లేదు.. అందుకే యాంత్రికరణ జరగాలని సూచించారు.
మీరు పండించే పంట విలువ ఇక్కడ పరిస్థితిపై ఆధారపడి ఉండదు. ఇతర దేశాలు, ఇతర ప్రాంతాల్లో జరిగే పరిణామాలపై ఆధారపడి ఉంటాయి. రైతులకు గిట్టుబాటు ధర రావాలి.. ఆదాయం పెరగాలి. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల వాసులతో పాటు రాయలసీమ వాసులకు డయాబెటిస్ వస్తోంది.రాష్ట్రాన్ని ఒక మోడల్ స్టేట్‌గా మారుస్తానని చంద్రబాబు వెల్లడించారు. గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు ఎట్టి పరిస్థితుల్లోనైనా తరలిస్తామని చెప్పారు. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేస్తున్నామని.. పెన్నా నది వరకు తీసుకువెళ్తాం. ప్రతీ ఎకరానికి నీరు అందేలా చేస్తామని చంద్రబాబు స్పష్టం చేసారు.































