తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మూడు రోజుల కిందట అమిత్ షా, జేపీ నడ్డాలతో ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఈ భేటీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరిక అంశంపై మాత్రమేనని ప్రత్యేకంగా చెప్పాల్సినపని లేదు.
ఆయన ఢిల్లీలో ఉండగానే జగన్ పరుగున ఢిల్లీకి వెళ్లి ప్రధానితో భేటీ అయ్యారు. వెంటనే .. వైసీపీ అధినేత జగన్ ఎన్డీఏలో చేరుతారన్న అంశంపై కొంత కాలంగా ఢిల్లీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం లో ఉంది. అయితే రాజకీయ సిద్ధాంతాలు, ఓటు బ్యాంకుల పరంగా చూస్తే.. బీజేపీ, జగన్ పొత్తులు అనేవి సరిపడవు. అదే చేస్తే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లేనని ఎక్కువ మంది విశ్లేషిస్తున్నారు.
జగన్ మోహన్ రెడ్డి ప్రదాన ఓటు బ్యాంక్ ముస్లింలు, దళితులు. వీరిలో బీజేపీపై వ్యతేరికత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు బీజేపీతో జగన్మోహన్ రెడ్డి కలిస్తే వారిలో ఓ పది శాతం కాంగ్రెస్ వైపు మళ్లినా జగన్ కు జరిగే నష్టాన్ని అంచనా వేయడం కష్టం. కానీ రాజకీయాల సమీకరణాలు కేవలం ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల మీదనే ఆధారపడి ఉండవు. అంతకు మించిన ఎక్స్ ట్రా అంశాలు కూడా ఉంటాయి అందుకే జగన్మోహన్ రెడ్డి ఎన్డీలో చేరేందుకు తన ఆసక్తిని బీజేపీ హైకమాండ్ ముందు పెట్టారని చెబుతున్నారు.
టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ ఎన్నికలకు వెళ్తే ఆ తర్వాత తాను ఎదుర్కొబోయే రాజకీయ పరిణామాలను ఊహించడం కష్టమని.. అలాంటి కష్టం రాకుండా ఉండాలంటే.. ఖచ్చితంగా మూడో సారి కేంద్రంలో అధికారంలోకి వస్తున్న బీజేపీ అండ ఉండాలని జగన్ గట్టిగా భావిస్తున్నారు. అందుకే.. రాజకీయంగా ఏపీలో తనకు నష్టం జరిగినా సరే.. బీజేపీ అండ ఉండేందుకు ఎన్డీఏలో చేరేందుకు సిద్ధమయ్యారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి ముందు ప్రతిపాదించారని.. ఇక బీజేపీ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెబుతున్నారు.
బీజేపీతో శత్రుత్వం తెచ్చుకునే పరిస్థితి లేకుండా రాజకీయంగా నష్టం లేకుండా ఎన్డీఏ కూటమిలో చేరేందుకు జగన్ సిద్ధమయి ఉంటే.. బీజేపీ చేర్చుకుంటుందా లేదా అన్నది కీలక అంశం. చేర్చుకునేందుకు సిద్ధమైతే ఏపీలో రాజకీయాలు భిన్నంగా మారతాయి. అప్పుడు బీజేపీ, వైసీపీ వర్సెస్ టీడీపీ, జనేసన అన్నట్లుగా మారుతాయి.