ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వరుసగా 21 ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నియామక రాత పరీక్ష(ఓఎంఆర్)ల షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసింది.
ఈ మేరకు 2025 ఏడాదిలో విడుదల చేసిన 21 నోటిఫికేషన్‌ల పరీక్షల తేదీలను కమిషన్ ప్రకటించింది. ఈ పరీక్షలను రెండు విడుతలుగా నిర్వహించనున్నారు. 2026 జనవరి 27 నుంచి 31 వరకు తొలి విడత, ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు రెండో విడత ఈ పరీక్షలు జరగనున్నాయి. అగ్రికల్చర్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ లెక్చరర్ (లైబ్రేరియన్ సైన్స్), హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ (సివిల్), హార్టికల్చర్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ (గ్రూప్-4), అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్, వార్డెన్ పరీక్షలు జనవరి 27, 28, 30 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. ఇక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, తానేదార్ పరీక్షలు ఫిబ్రవరి 9, 10వ తేదీల్లో, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 పరీక్షలు ఫిబ్రవరి 11న, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పరీక్షలు ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఏపీపీఎస్సీ నిర్వహించనుంది. ఈ మేరకు షెడ్యూల్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి ఉమ్మడిగా పేపర్ 1 పరీక్ష విధానం ఉంటుంది. ఏపీపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్లలో (ఒకటి నుంచి 14 వరకు నోటిఫికేషన్లకు) ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు, జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ పేపర్ ఉమ్మడిగా ఉంటుంది. ఆ పేపర్ మార్కులను సంబంధిత నోటిఫికేషన్ల కోసం పరిగణనలోకి తీసుకుంటారు. ఇక 15 & 16 నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా జీఎస్ అండ్ ఎంఏ పేపర్ ఉమ్మడిగా ఉంటుంది. సీరియల్ నంబర్ 18, 19 నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జీఎస్ & ఎంఏ పేపర్, క్వాలిఫైయింగ్ టెస్ట్ పేపర్ ఉమ్మడిగా ఉంటాయి. ఈ మేరకు ఉమ్మడి పరీక్షలను ఖరారు చేసింది.
18 నోటిఫికేషన్ల (సీరియల్ నంబర్లు 1 నుంచి 17, 21) పరీక్షల నిర్వహణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలోని ఐదు జిల్లా కేంద్రాలలో నిర్వహిస్తారు. అంటే విశాఖపట్నం, తూర్పు గోదావరి, ఎన్టీఆర్, తిరుపతి, అనంతపురంలో మాత్రమే ఈ పరీక్షలు జరుగుతాయి. సీరియల్ నంబర్లు 18 నుంచి 20 వరకు పరీక్షల నిర్వహణ గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని 13 పాత జిల్లాల్లో పలు పరీక్ష కేంద్రాల్లో జరుగుతాయి.
































