ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని దాదాపు 2 లక్షల మంది దివ్యాంగులు లబ్ధిపొందనున్నారు.
ప్రస్తుతం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్ ధరలో 50 శాతం రాయితీ ఇస్తున్నారు. సీఎం ప్రకటించిన ఈ హామీని అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటివరకు దివ్యాంగులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడానికి టిక్కెట్ ధరలో సగం చెల్లించేవారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఈ విధానం మారనుంది. త్వరలోనే వీరంతా ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండానే బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేయడానికి అవసరమైన లెక్కలు ఆర్టీసీ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఎంతమంది దివ్యాంగులు పాస్‌లు కలిగి ఉన్నారు, రాయితీ రూపంలో ఆర్టీసీకి ఎంత డబ్బు చెల్లించాల్సి వస్తుంది వంటి వివరాలను ప్రభుత్వం కోరింది. ఈ సమాచారం ఆధారంగానే ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేస్తారు. ప్రభుత్వం, ఆర్టీసీ అధికారుల నుంచి వివరాలు సేకరించే పనిలో ఉంది. దివ్యాంగుల పాస్‌లు పొందిన వారి సంఖ్య, రాయితీ రూపంలో ఆర్టీసీకి చెల్లించాల్సిన మొత్తం వంటి వివరాలను సేకరిస్తున్నారు.
ఏపీఎస్ఆర్టీసీ దివ్యాంగులకు మొత్తం నాలుగు రకాల పాస్‌లు జారీ చేస్తోంది. వీరిలో 100% వినిపించకపోవడం, 100% అంధత్వం, 69% కంటే తక్కువ ఐక్యూతో మానసిక వైకల్యం, 40% శారీరక వైకల్యం ఉన్నవారికి పాస్‌లు ఇస్తోంది ఆర్టీసీ. దివ్యాంగులకు 50 శాతం ఛార్జీ వసూలు చేస్తున్నారు.. అది కూడా ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు సర్వీసుల్లో వర్తిస్తుంది.. మిగిలిన 50శాతం డబ్బులు రాయితీ. విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఛార్జీలేమీ లేకుండా ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు.
దివ్యాంగులైన మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు దివ్యాంగులైన పురుషులకు కూడా ఈ ఉచిత ప్రయాణ పథకం త్వరలో అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో మొత్తం 7.68 లక్షల మంది వికలాంగులు పింఛన్లు అందుకుంటున్నారు. వీరిలో 30-40% మహిళలు ఉన్నారు. అలాగే, మంచానికి లేదా వీల్‌ఛైర్‌కు పరిమితమైన 24 వేల మంది కూడా పింఛన్లు పొందుతున్నారు. అయితే ఏటా రాష్ట్రంలో సగటున 2 లక్షల మంది దివ్యాంగులు మాత్రమే ఆర్టీసీలో ఈ బస్ పాస్‌లను వినియోగించుకుంటున్నారు. ఈ ఉచిత ప్రయాణ పథకం అమలులోకి వస్తే, ఈ పాస్‌ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం, ఆర్టీసీ దివ్యాంగుల పాస్‌లపై రాయితీ రూపంలో ఏటా రూ.188 కోట్ల భారాన్ని భరిస్తోంది.

































