ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ఎక్స్కి చెందిన అనుబంధ సంస్థ స్టార్‌లింక్.. భారతదేశంలో తన నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధరలను వెల్లడించింది.
దేశంలోని మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్.. నివాస వినియోగదారుల కోసం తమ ప్లాన్‌లో ఉన్న కీలక విషయాలను కూడా ప్రకటించింది.
భారతదేశంలో కార్యకలాపాలను విస్తరించడానికి ఈ కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు నివేదికలు వెలువడిన కొద్దిరోజలకు, స్టార్‌లింక్ బెంగళూరు కార్యాలయం కోసం లింక్డిన్లో ఇటీవలే నాలుగు ఉద్యోగాల కోసం ప్రకటనలు ఇచ్చింది.
స్టార్‌లింక్ ఇండియా- నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ధర, ముఖ్య ఫీచర్లు..
శాట్‌కామ్ కంపెనీ స్టార్‌లింక్ తమ భారతీయ వెబ్‌సైట్‌ను అప్‌డేట్ చేసింది. నివాస వినియోగదారుల కోసం సబ్‌స్క్రిప్షన్ ధరలను ఇందులో పేర్కొంది:
నెలవారీ ధర: స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ కోసం స్పేస్‌ఎక్స్ నెలకు రూ. 8,600 వసూలు చేస్తుంది.
హార్డ్‌వేర్ ఖర్చు: ఈ ధరలో రూ. 34,000 విలువైన హార్డ్‌వేర్ ఖర్చు కూడా కలిసి ఉంటుంది.
కీలక ఫీచర్లు: ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఈ టెక్ సంస్థ అపరిమిత డేటాతో పాటు 30 రోజుల ట్రయల్‌ను అందిస్తుంది.
స్టార్‌లింక్ వెబ్‌సైట్ ప్రకారం.. ఈ సర్వీస్ “అన్ని వాతావరణాల్లోనూ పనిచేస్తాయి”, 99.9 శాతం కంటే ఎక్కువ అప్‌టైమ్ లేదా అంతరాయం లేని ఇంటర్నెట్ కనెక్షన్‌ను వినియోగదారులు పొందొచ్చు. అంతేకాకుండా, యూజర్లు “ప్లగ్- ఇన్ చేసి వెంటనే ఉపయోగించడం” ప్రారంభించవచ్చు.
భారతదేశంలో నివాస సబ్‌స్క్రిప్షన్ ధరలను స్టార్‌లింక్ వెల్లడించినప్పటికీ, బిజినెస్ సబ్‌స్క్రిప్షన్ ధరలను ఇంకా ప్రకటించలేదు. రాబోయే రోజుల్లో వాటి వివరాలను కూడా వెల్లడించే అవకాశం ఉంది.
బెంగళూరులో ఉద్యోగాల నియామకం..
గత అక్టోబర్ చివరిలో, స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ బెంగళూరు కార్యాలయం కోసం లింక్‌డిన్ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్‌లో నాలుగు ఉద్యోగాల కోసం ప్రకటనలు ఇచ్చింది. ఆ సమయంలో, పేమెంట్స్ మేనేజర్, అకౌంటింగ్ మేనేజర్, సీనియర్ ట్రెజరీ అనలిస్ట్, ట్యాక్స్ మేనేజర్ వంటి పోస్టుల కోసం కంపెనీ నియామకాలు చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా తమ సేవలను అందించడానికి స్టార్‌లింక్ చేస్తున్న “అంతర్జాతీయ విస్తరణ ప్రయత్నాల్లో” ఈ నియామకాలు భాగమని ఉద్యోగ ప్రకటనల్లో పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా గ్రౌండ్ స్టేషన్ల ఏర్పాటు..
స్పేస్‌ఎక్స్ అనుబంధ సంస్థ అయిన స్టార్‌లింక్ భారతదేశంలో బహుళ ప్రాంతాల్లో తమ గేట్‌వే ఎర్త్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు ఇటీవలి నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ప్రదేశాల్లో చండీగఢ్, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ముంబై, నోయిడా వంటి నగరాలు ఉన్నాయి.

































