తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా జలాల వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పటికే దీనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా.. సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఈ అంశంపై స్పందించారు. ”తెలంగాణ నుంచి కిందకు వదిలితే తప్ప ఏపీకి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక అడుగు ముందుకు వేసి ఆంధ్రాకు నీళ్లు వదిలారు. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలు రాయలసీమలోని నాలుగు జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో మనం వెళ్లి అడిగిన వెంటనే కేసీఆర్ పెద్ద మనసులో నీళ్లు వదలిలారు” అని జగన్ స్వయంగా చెప్పారు.
ప్రస్తుతం జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు అటు ఆంధ్రప్రదేశ్‌లో, ఇటు తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల ఆంధ్రా పోలీసులు తుపాకులతో నాగార్జున సాగర్‌పైకి వచ్చారని సీరియస్ కామెంట్స్ చేస్తున్న కాంగ్రెస్ నేతలు.. జగన్ కామెంట్స్‌పై ఏ విధంగా రియాక్ట్ అవుతారో అని రెండు రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం తెలంగాణలోని నీటిపారుదల ప్రాజెక్టులకు కేఆర్ఎంబీకి అప్పగించడంపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. బీఆర్ఎస్ ఆరోపణలకు కాంగ్రెస్ పెద్దలు సైతం ఘాటుగానే స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ చేసిన కామెంట్స్ కాంగ్రెస్, బీఆర్ఎస్ యుద్ధానికి మరింత ఆజ్యం పోశాయి.