స్టాక్ మార్కెట్లలో ఐపీఓ మాదిరిగానే.. మ్యూచువల్ ఫండ్లలో ఎన్ఎఫ్ఓ ఉంటుంది. అక్కడ కంపెనీలు తొలిసారిగా షేర్ల విక్రయం ద్వారా పబ్లిక్‌లోకి వస్తే.. ఇక్కడ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు మూలధనాన్ని సేకరించేందుకు కొత్త మ్యూచువల్ ఫండ్ పథకాల్ని ప్రకటిస్తుంటాయి.
ఎన్ఎఫ్ఓ సమయంలో మ్యూచువల్ ఫండ్ యూనిట్స్.. సాధారణంగా స్థిరమైన, నామమాత్రపు ధరకు అందిస్తాయి. ముందుగా ఎన్ఎఫ్ఓ పీరియడ్ సమయంలోనే తక్కువ ధరకు యూనిట్లు అందుబాటులో ఉంటాయి. ఈ పీరియడ్ అయిపోయాక.. మళ్లీ రెగ్యులర్‌గా కొనుగోళ్ల కోసం అందుబాటులో ఉంటాయని చెప్పొచ్చు. ఇప్పుడు దేశంలోనే దిగ్గజ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థల్లో ఒకటిగా ఉన్నటువంటి టాటా మ్యూచువల్ ఫండ్ నుంచి కీలక ప్రకటన వచ్చింది.
>> వినూత్న ముందడుగు వేస్తూ.. టాటా మ్యూచువల్ ఫండ్ భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా ఫస్ట్ మల్టీ- క్యాప్ కన్పంప్షన్ (వినియోగ) ఇండెక్స్ ఫండ్ ప్రారంభించింది. దీనిని టాటా బీఎస్ఈ మల్టీక్యాప్ కన్సంప్షన్ 50:30:20 ఇండెక్స్ ఫండ్ పేరుతో లాంఛ్ చేసింది. ఇది ఓపెన్ ఎండెడ్ స్కీమ్. ఒకే ఉత్పత్తి ద్వారా పెట్టుబడిదారులకు.. వినియోగరంగంలోని స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో వైవిధ్యభరితమైన పెట్టుబడి అవకాశాల్ని కల్పిస్తుంది. ఈ ఎన్ఎఫ్ఓ సబ్‌స్క్రిప్షన్ కోసం తెరిచారు. డిసెంబర్ 23 లాస్ట్ డేట్‌గా ఉంది.
సాధారణంగా కన్సంప్షన్ ఇండెక్స్‌లు లార్జ్ క్యాప్స్, FMCG లేదా ఆటో స్టాక్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. దీన్ని సరిదిద్దుకునేందుకే టాటా మ్యూచువల్ ఫండ్.. ప్రత్యేక మోడల్‌లో 50:30:20 మోడల్‌ను తీసుకొచ్చింది. ఇక్కడ స్థిరత్వం కోసం 50 శాతం లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో.. మెరుగైన వృద్ధి సామర్థ్యం కోసం 30 శాతం మిడ్ క్యాప్ స్టాక్స్‌లో.. అధిక వృద్ధి అవకాశాల కోసం 20 శాతం స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడులకు కేటాయిస్తుంది.
ప్రధానంగా వినియోగ రంగం స్టాక్స్‌పై దృష్టి సారిస్తుంది. భారతదేశ జీడీపీలో దాదాపు 60 శాతం కంటే ఎక్కువ వాటాను ఇదే అందిస్తుంది. అందుకే ప్రధానంగా దీనిపై దృష్టి సారిస్తూ కొత్త మోడల్‌లో ఈ స్కీమ్ తెచ్చినట్లు టాటా అసెట్ మేనేజ్మెంట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఆనంద్ వరదరాజన్ చెప్పారు. ఈ ఫండ్ ద్వారా.. క్విక్ కామర్స్, డిజిటల్ ఎంటర్‌టైన్మెంట్, ట్రావెల్ ఇలా న్యూ ఏజ్ వినియోగ రంగాల్లో పెట్టుబడి పెట్టొచ్చు.
ఈ పథకం పనితీరుకు బీఎస్ఈ మల్టీక్యాప్ కన్సంప్షన్ 50:30:20 ఇండెక్స్ కొలమానంగా ఉంది. ఫండ్ మేనేజర్లుగా నితిన్ భారత్ శర్మ, రాకేష్ ప్రజాపతి వ్యవహరిస్తారు. ఇందులో కనీసం రూ. 5 వేలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆపై ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.


































