కొత్త లేబర్ కోడ్స్‌తో టేక్ హోమ్ శాలరీ తగ్గుతుందా? పీఎఫ్ డిడక్షన్ ఎలా ఉంటుంది? క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.

కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి 29 పాత కార్మిక చట్టాలను కలిపి మొత్తం నాలుగు చట్టాలుగా మార్చింది. ఈ మేరకు నూతన లేబర్ కోడ్స్ అమల్లోకి తెచ్చింది.


వేతనాల కోడ్- 2019, సామాజిక భద్రత కోడ్- 2020, పారిశ్రామిక సంబంధాల కోడ్- 2020, వృత్తి భద్రత,ఆరోగ్య, పని పరిస్థితుల కోడ్- 2020 అనే నాలుగు కొత్త లేబర్ కోడ్‌లను అమల్లోకి తెచ్చింది.

కొత్త లేబర్‌ కోడ్స్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో టేక్ హోమ్ శాలరీ తగ్గుతుందా? అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

” PF డిడక్షన్ చట్టబద్ధమైన వేతన పరిమితిలో ఉంటే కొత్త లేబర్ కోడ్‌లు టేక్ హోమ్ శాలరీని తగ్గించవు. PF డిడక్షన్‌లు రూ.15,000 వేతన పరిమితిపై ఆధారపడి ఉంటాయి , ఈ పరిమితికి మించి చేసిన కాంట్రిబ్యూషన్స్ స్వచ్ఛందంగా ఉంటాయి, తప్పనిసరి కాదు ” అని పోస్టులో పేర్కొంది. దీనితో పాటు కొత్త లేబర్ కోడ్స్ ద్వారా మరికొన్ని ప్రయోజనాలు ఉద్యోగులకు లభించనున్నాయి.

ఒకే సంవత్సరానికి గ్రాట్యుటీ
కొత్త లేబర్ కోడ్స్ ప్రకారం, గ్రాట్యుటీ విషయంలో కూడా కీలక మార్పులు ఉంటాయి.పాత నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగి కనీసం 5 సంవత్సరాలు పనిచేసినప్పుడే గ్రాట్యుటీ పొందేందుకు అర్హత పొందుతాడు.అయితే కొత్త లేబర్ కోడ్ ప్రకారం, ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయిస్(FTE) ఒక సంవత్సరం పనిచేసినా సరే గ్రాట్యుటీ పొందే అవకాశం ఉంది. అంతే కాదు సెలవులు, మెడికల్,సోషల్ సెక్యూరిటీ వంటి పర్మనెంట్ వర్కర్స్ పొందే అన్ని రకాల ప్రయోజనాలు వీరు కూడా పొందవచ్చు.

కొత్త లేబర్ కోడ్‌ల ప్రకారం, దేశవ్యాప్తంగా ఉన్న 40 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు ఉచితంగా హెల్త్ చెకప్‌లు పొందవచ్చు. కొత్త లేబర్ కోడ్‌ల ప్రకారం, ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం వార్షిక ఆరోగ్య పరీక్షలకు సంబంధించిన నియమాలలో పెద్ద మార్పులను చేసింది. గతంలో, ఉద్యోగులకు సంవత్సరానికి ఒకసారి ఉచిత హెల్త్ చెకప్ అనేది చట్టపరంగా తప్పనిసరి కాదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం 40 ఏళ్లు పైబడిన ఉద్యోగులందరికీ సంవత్సరానికి ఒకసారి ఉచిత హెల్త్ చెకప్‌లను తప్పనిసరి చేసింది. దీని ద్వారా ఉద్యోగులకు సంబంధించిన వ్యాధులు లేదా ఏవైనా ఆరోగ్య సంబంధిత సమస్యలను సకాలంలో గుర్తించవచ్చు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకుంది.

ఇది ఎవరికి వర్తిస్తుంది?
కాంట్రాక్ట్ వర్కర్క్, మైనింగ్ విభాగంలో పనిచేసే ఉద్యోగులకు, ప్రమాదకరమైన పరిశ్రమ కార్మికులు, డాక్ వర్కర్స్ వంటి ఉద్యోగులకు ఈ హెల్త్ చెకప్ సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.