సంక్షోభంలో ఉపాధ్యాయ వృత్తి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు క్షీణిస్తున్నాయని నేషనల్‌ అచీవ్‌మెంట్‌, పాఠశాలల పనితీరు గ్రేడింగ్‌ ఇండెక్స్‌ (పీజీఐ), ఎస్‌సీఈఆర్‌టీ సర్వేలు తెలుపుతున్నాయి.


పీజీఐ ప్రకారం రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 36 ఉండగా, వాటిలో మన రాష్ట్రం 21వ స్థానంలో నిలిచింది. అభ్యసనా ప్రమాణాల్లో 35వ స్థానంలో ఉన్నది. నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే ప్రకారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సామర్థ్యం 50 శాతం కంటే తక్కువ ఉన్నది. అదేవిధంగా ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థుల విద్యాసామర్థ్యాలూ కొంచెం అటు ఇటుగా ఉన్నాయని సర్వేల నివేదికలు చెప్తున్నాయి.

విద్యార్థులకు సరైన సామర్థ్యాలు లేకపోవడానికి గల కారణాలు ఏమిటనే అభిప్రాయంతో ఇటీవల పాఠశాల విద్యాశాఖ, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, యూనిసెఫ్‌ అధ్యయనం చేశాయి. ఉపాధ్యాయులకు బోధనేతర పనులను అప్పగిస్తుండటంతో కీలకమైన బోధన సమయాన్ని కోల్పోతున్నారు. దానివల్ల విద్యార్థులకు నష్టం జరుగుతున్నది. పాఠాలు బోధించాల్సిన సమయంలో ఉపాధ్యాయులకు ఫోన్లు వస్తుంటాయి. మధ్యాహ్న భోజనం, విద్యార్థుల హాజరు.. ఇలా ఏదో ఒక డేటా అడుగుతారు. దానివల్ల ఉపాధ్యాయులు బోధన పట్ల ఏకాగ్రతను కోల్పోతున్నారు. అందుకు ప్రభుత్వమే కారణం. ఉపాధ్యాయులు తరగతి గదికే పరిమితమయ్యే పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానిదే. పాఠశాల పనిదినాల్లో తరగతి గదిలో బోధించే పనిలో ఉపాధ్యాయుడు, వారి బోధనను పర్యవేక్షించే విధుల్లో పర్యవేక్షణాధికారి ఉండాలి. కానీ, అలా జరగకపోవడంతో విద్యాపాలన చిన్నాభిన్నమైంది.

‘ఉపాధ్యాయులు ఉద్యోగాలు వదిలి వెళ్లిపోతున్నారు- కొందరు మౌనంగా, మరికొందరు ఉద్యోగంలో ఉన్నప్పటికీ మానసికంగా వైదొలుగుతున్నారు. యువతరం అసలు ఉపాధ్యాయులుగా రావాలనే కోరుకోవడం లేదు’- అని విద్యావేత్త, జాతీయ విద్యాపరిశోధన శిక్షణా సంస్థ (ఎన్‌సీఈఆర్‌టీ) పూర్వ సంచాలకులు ఎన్‌.కృష్ణకుమార్‌ అన్నారు. ఇట్లా ఎందుకు జరుగుతున్నది? సిలబస్‌ పూర్తి చేయాలనే తీవ్ర ఒత్తిడి ఉపాధ్యాయులపై ఉన్నది. తల్లిదండ్రుల అవాస్తవ అంచనాలు ఒత్తిడిని పెంచుతున్నాయి. సబ్జెక్టులు, పనిభారం పెరిగిపోయాయి. గురుశిష్యుల మధ్య బంధం ఒకప్పుడు విద్యకు గుండెకాయ లాంటిది. కానీ, ఇప్పుడు డేటా, గడువుల కింద అది సమాధి అయిపోయింది. బోధన కంటే డేటా సేకరించి పంపడమే కీలకమైపోయింది. విద్యార్థులు ఇప్పుడు ఉపాధ్యాయులను సేవలందించేవారిగా మాత్రమే చూస్తున్నారు. వారిపై గౌరవమూ తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా పాఠశాలల్లో ఒక నిశ్శబ్ద విప్లవం జరుగుతున్నది. అది ఉపాధ్యాయుల మనసుల్లో నెలకొన్న అలసట, నిస్సహాయత, నిరాశలతో కూడినది.

ఉపాధ్యాయులు బోధనకు దూరంగా వలసపోవడాన్ని రెండు దశాబ్దాల కిందటే యునెస్కో గుర్తించింది. అందుకే ఉపాధ్యాయులు ఎటు పోతున్నారంటూ తన అధికార పత్రిక ప్రాస్పెక్ట్స్‌లో విద్యపై జరిగే తైమాసిక సమీక్షలో ప్రశ్నించింది. పాఠశాల తరగతి గది పరిస్థితులకు సంబంధించిన అంశాలను, విద్యార్థి ప్రవర్తనను ప్రభావితం చేసే గృహ వాతావరణం వంటివి ఇందుకు కొన్ని కారణాలైనప్పటికీ, మన దేశంలో ఈ దిశగా అధ్యయనమే జరగలేదు. ఆ క్రమంలోనే యునెస్కో, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, పాఠశాల విద్యాశాఖ మన రాష్ట్రంలో జరిపిన అధ్యయన నివేదికను బయటపెట్టింది.

‘తరగతి గదిలో దేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది’ అన్న విద్యావేత్త కొఠారి ఉపాధ్యాయుల వేతనాలు, పని పరిస్థితులు, పదోన్నతులపై కూడా తన అభిప్రాయాలను సిఫారసుల రూపంలో చెప్పారు. దేశంలోని మిగతా వృత్తుల కన్నా ఉపాధ్యాయ వృత్తికి అధిక వేతనాలుండాలని, మెరుగైన పదోన్నతి విధానాలుండాలని ఆయన సిఫారసు చేశారు. కానీ, ఆరు దశాబ్దాలైనా ఆ దిశగా విద్యావ్యవస్థ రూపుదిద్దుకోలేదు. ఉపాధ్యాయుల వేతన వ్యవస్థ మెరుగుపడలేదు సరికదా.. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, అవర్‌ లీ బేస్డ్‌ పద్ధతిలో అతి తక్కువ జీతాలకు ఉపాధ్యాయుల నియామకాలు జరుగుతున్నాయి. ఇన్ని అవలక్షణాలతో ఉన్న ఉపాధ్యాయ వృత్తిని యువకులు ఎందుకు ఆదరించాలి?

ప్రస్తుత డీఈవోలలో బోధనేతర సిబ్బందే ఎక్కువగా ఉన్నారు. పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతను ఉపాధ్యాయులకే అప్పగించాలని, విద్యార్థులతో నేరుగా సంబంధం ఉండే మండల విద్యాధికారి, డిప్యూటీ విద్యాధికారి పోస్టులనూ ఉపాధ్యాయులతో భర్తీ చేయాలని 1992లో సుందరేశన్‌ ఏకసభ్య కమిటీ సిఫారసు చేసింది. ఈ సిఫారసులను గమనంలోకి తీసుకోవాలి. డీఈవో, జాయింట్‌ డైరెక్టర్‌ లాంటి పోస్టుల్లోనూ ఉపాధ్యాయులకు భాగస్వామ్యం లభిస్తే వారు తమకున్న బోధనానుభవం, విద్యాతత్వశాస్త్ర, విద్యామనస్తత్వశాస్త్ర అవగాహనతో పాలనా చర్యలు తీసుకోగలుగుతారు.

విద్యా విధానంలో పరివర్తన తీసుకురావడం అర్హులైన ఉపాధ్యాయులతోనే సాధ్యమవుతుంది. అయితే వారికి సమాజం నుంచి తగిన గౌరవం, సంతృప్తికరమైన వేతనం అందితేనే వారిలో ప్రేరణ సజీవంగా ఉంటుంది. ప్రభుత్వ విద్యాసంస్థలను అన్నిరకాల వసతులతో అభివృద్ధి చేసి, పటిష్ఠ పర్యవేక్షణతో, జవాబుదారీతనంతో కూడిన ఉన్నత ప్రమాణాల విద్యను అందిస్తామని తల్లిదండ్రులకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలి. అప్పుడే అందరికీ విద్యాప్రమాణాలతో కూడిన విద్య అందుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.