ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున మార్పులు చేస్తోంది. సిబ్బంది మార్పులు, బాధ్యతల పునర్విభజన తర్వాత ఇప్పుడు మరో కీలక నిర్ణయంతో రెవెన్యూ శాఖకు భారీ షాక్ ఇచ్చింది.
ఇకపై సచివాలయాల్లో రెవెన్యూ సేవలకు వచ్చే దరఖాస్తులకు మధ్యవర్తులు అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రభుత్వం జారీ చేసిన తాజా సర్క్యులర్ ప్రకారం, డిజిటల్ అసిస్టెంట్లు, వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు ఏ అధికారి సూచన లేకుండానే దరఖాస్తులను నేరుగా స్వీకరించి ప్రాసెస్ చేయాలి. కొన్ని సచివాలయాల్లో VRO/WRS/సర్వేయర్ల అనుమతి లేకుండా దరఖాస్తులను తీసుకోవడం లేదన్న ఫిర్యాదులు రావడంతో ఈ చర్య తీసుకున్నట్టు పేర్కొంది.
సర్కులర్‌లో ప్రభుత్వం స్పష్టం చేస్తూ
‘పౌరులకు తక్షణ సేవలు అందించాలనే సచివాలయ పద్ధతి ప్రధాన ఉద్దేశం. కావున దరఖాస్తులను తిరస్కరించడం, ఆలస్యం చేయడం, షరతులతో స్వీకరించడం పూర్తిగా నిషేధం’ అని పేర్కొంది. ఇకపై సచివాలయానికి వచ్చే ప్రతి పౌరుడి రెవెన్యూ సేవ దరఖాస్తును డిజిటల్ అసిస్టెంట్లు/WEDPSలు వెంటనే నమోదు చేసి ప్రాసెస్ చేయాల్సిందే. ఈ ఆదేశాలు ఉల్లంఘించిన సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టంచేసింది.
జిల్లా కలెక్టర్లు, GSWS అధికారులు, DDOలు, MGO/UGOలు తమ పరిధిలోని సచివాలయాల్లో ఈ ఆదేశాల అమలు ఖచ్చితంగా జరుగుతున్నట్టు పర్యవేక్షించాలని ప్రభుత్వ ఆదేశాలు తెలియజేశాయి.



































