ఒక కంపెనీ తమ మహిళా ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించింది. దీనికి కారణం వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. సాధారణంగా ఉద్యోగులు ఆలస్యంగా ఆఫీస్‌కి వెళ్తే, అది అధికారుల కోపానికి గురవుతారు.
ప్రత్యేకించి, ప్రతిరోజూ ఆలస్యంగా వచ్చే ఉద్యోగులకు కొన్ని శిక్షలు కూడా విధిస్తారు.
ఎంత చెప్పినా తమ తప్పును సరిదిద్దుకోని వారిని ఉద్యోగం నుంచి తీసివేయడం జరుగుతుంది. అయితే, ఈ మహిళా ఉద్యోగిని ఉద్యోగం నుంచి తీసివేయడానికి కారణం చాలా విచిత్రంగా ఉంది. మరొకటి కాదు, ఈ మహిళ గత రెండు సంవత్సరాలుగా ప్రతిరోజూ ఆఫీస్‌కి 40 నిమిషాలు ముందుగానే వచ్చేదట. ఇదే కారణంతో ఆమె ఉద్యోగం పోయింది. కంపెనీపై ఆమె కోర్టును ఆశ్రయించగా, ఆ న్యాయస్థానం కూడా ఆ మహిళకే షాక్ ఇచ్చింది.
అసలేం జరిగింది?
ఈ సంఘటన జరిగింది భారతదేశంలో కాదు. ఇది స్పెయిన్‌లో జరిగింది. 22 ఏళ్ల మహిళా ఉద్యోగి గత రెండు సంవత్సరాలుగా ఆఫీస్‌కి ముందుగానే వస్తోంది. ఆమె ఆఫీస్ ఉదయం 7:30 గంటలకు మొదలవుతుంది. కానీ, ఈ మహిళ ఉదయం 6:45 లేదా 7:00 గంటలకే ఆఫీస్‌కు చేరుకునేది. ఈ కారణాన్ని చూపి, ఆమెను ఉద్యోగం నుంచి తీసివేసిన కంపెనీ, ‘ఆమె ప్రతిరోజూ త్వరగా ఆఫీస్‌కి వచ్చినా, ఆ సమయంలో చేయడానికి ఎలాంటి పని ఉండేది కాదు’ అని చెప్పుకొచ్చింది.
కంపెనీకి అంత త్వరగా రావడం అవసరం లేదని మహిళకు ఆమె బాస్ పదే పదే చెప్పారు. కానీ, ఆమె వినలేదు. ఇది సరైన ప్రవర్తన కాదు, కంపెనీ నియమాలను ఉల్లంఘించినట్లే అని చెప్పిన బాస్, చివరకు ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. ఆమె కంపెనీకి త్వరగా వచ్చినా, వెంటనే పనిని ప్రారంభించేది కాదు. పని చేయకుండా ఊరికే వచ్చి ఎందుకు కూర్చోవాలి అనేది బాస్ వాదన.
కోర్టును ఆశ్రయించిన మహిళ..
తనను ఉద్యోగం నుంచి తీసివేసిన కంపెనీపై ఆ మహిళ కోర్టును ఆశ్రయించింది. తనను ఉద్యోగం నుంచి తొలగించడం అన్యాయం అని వాదించింది. స్పెయిన్‌లోని అలికాంటే సామాజిక న్యాయస్థానం మాత్రం కంపెనీకి అనుకూలంగా నిలబడింది. అనేక మౌఖిక మరియు లిఖితపూర్వక హెచ్చరికలు ఉన్నప్పటికీ, త్వరగా రావడం ఎందుకు కొనసాగించారని న్యాయమూర్తులు మహిళను ప్రశ్నించారు.
ఇక, ఈ ఉద్యోగి ఆఫీస్‌కి త్వరగా రావడమే కాకుండా, దాదాపు 19 సార్లు, కంపెనీ ప్రాంగణానికి చేరుకోకముందే యాప్ ద్వారా లాగిన్ చేయడానికి ప్రయత్నించిన సంఘటనలు కూడా జరిగాయి. ఆ యువతి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ద్రోహం చేసిందని కంపెనీ అధిపతి కూడా ఆరోపించారు. ఇక, కోర్టు కూడా యువతిని తొలగించడంలో తప్పు లేదని స్పష్టం చేసింది. యువతి సమయపాలన పాటించడం తప్పు కాదు. కానీ, పని నియమాలను, బాస్ ఇచ్చిన హెచ్చరికలను ఉల్లంఘించడమే తప్పు అని కోర్టు పేర్కొంది.


































