లక్షల మంది డ్రైవర్ల కడుపు నింపుతున్న కారు..మైలేజీలో దీనిని మించిందే లేదు..అమ్మకాల్లో ఇది తోపు

భారతదేశంలో ఎక్కువ మంది కొనుగోలు చేసే మల్టీ పర్పస్ వాహనాల (MPV) జాబితాలో మారుతి సుజుకి ఎర్టిగా మొదటి స్థానంలో ఉంది. ఈ కారుకు ఇంతటి విశ్వసనీయత దక్కడానికి కారణం…


ఇది ఇచ్చే సౌకర్యం, సరసమైన ధర, అద్భుతమైన మైలేజీ, ప్రాక్టికాలిటీ. నగరంలో చిన్న ప్రయాణాల నుంచి సుదూర హైవే ప్రయాణాల వరకు ఎర్టిగా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

ముఖ్యంగా భారతీయ కుటుంబాలకు కావాల్సిన అన్ని మంచి ఫీచర్లు ఇందులో ఉండటం వల్ల, ఇది టయోటా ఇన్నోవా వంటి పెద్ద కార్లను కూడా అధిగమించి, దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న 7-సీటర్ కారుగా నిలిచింది. 2025 నవంబర్ అమ్మకాల లెక్కల్లోనూ ఎర్టిగా అగ్రస్థానం చెక్కుచెదరలేదు.

గాడివాడి వెబ్‌సైట్ నివేదిక ప్రకారం.. 2025 నవంబర్‌లో మారుతి సుజుకి సంస్థ మొత్తం 16,197 యూనిట్ల ఎర్టిగా కార్లను విక్రయించింది. 2024 నవంబర్‌లో అమ్మకాలు 15,150 యూనిట్లు మాత్రమే ఉండేవి. అంటే, ఒక ఏడాది కాలంలో ఎర్టిగా అమ్మకాలు 7 శాతం వార్షిక వృద్ధిని సాధించాయి.

ఇది అమ్మకాలలో దాని స్థిరమైన డిమాండ్‌ను చూపిస్తుంది. ఈ భారీ అమ్మకాలతో 2025 నవంబర్‌లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితాలో ఎర్టిగా ఆరవ స్థానం దక్కించుకుంది.

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న కియా కారెన్స్, టయోటా ఇన్నోవా క్రిస్టా వంటి ఎమ్‌పీవీలతో పోలిస్తే, ఎర్టిగా చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉంది. మారుతి ఎమ్‌పీవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.8.80 లక్షలు. ఇక అత్యధిక ఫీచర్లు ఉన్న టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ.12.94 లక్షల వరకు ఉంది. ఈ ఆకర్షణీయమైన ధర, ఎక్కువ మంది కొనుగోలుదారులను ఫ్యామిలీ సెగ్మెంట్‌లో ఈ కారు వైపు మళ్లేలా చేస్తోంది.

మైలేజ్ విషయంలో ఎర్టిగా తన విభాగంలోనే అగ్రస్థానంలో ఉంది. ఎర్టిగాలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 102 బీహెచ్‌పీ పవర్, 137 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

పెట్రోల్ మ్యాన్యువల్ మోడల్ ఏకంగా లీటరుకు 20.51 కి.మీ మైలేజ్ ఇస్తుంది. పెట్రోల్ ఆటోమేటిక్ మోడల్ లీటరుకు 20.30 కి.మీ మైలేజ్ అందిస్తుంది.

ఎర్టిగా సీఎన్‌జీ మోడల్ చాలా మందికి మొదటి ఆప్షన్. సీఎన్‌జీలో నడిచినప్పుడు మైలేజ్ గణనీయంగా పెరిగి కిలోకు 26.11 కి.మీ వరకు ఇస్తుంది. అయితే, సీఎన్‌జీ వేరియంట్ కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో మాత్రమే లభిస్తుంది.

ఎర్టిగా తన ధర పరిధిలో మంచి ఫీచర్లను అందిస్తుంది. ఇందులో 17.78 సెంటీమీటర్ల (7 అంగుళాలు) స్మార్ట్‌ప్లే ప్రో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది, ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్ చేస్తుంది. అలాగే సుజుకి కనెక్ట్ టెక్నాలజీ, ఆటోమేటిక్ హెడ్‌లైట్లు, క్రూయిజ్ కంట్రోల్ వంటి హైటెక్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

సేఫ్టీ విషయంలో ఇందులో ఈబీడీతో కూడిన ఏబీఎస్ (ABS with EBD), బ్రేక్ అసిస్ట్, హిల్ హోల్డ్ టెక్నాలజీ (ఎత్తు ప్రదేశాలలో సహాయం), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెనుక పార్కింగ్ సెన్సార్‌లు, రివర్స్ కెమెరా వంటి ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి.

ఈ అంశాలన్నీ అధిక విలువ, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, మంచి రీసేల్ వ్యాల్యూ, విశాలమైన సీటింగ్, సీఎన్‌జీ ఆప్షన్ – కలిసి ఎర్టిగాను కుటుంబాలకు, టాక్సీ అవసరాలకు అత్యంత ఉత్తమమైన, నమ్మకమైన ఆప్షన్‎గా నిలబెడుతున్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.