అండర్-19 ఆసియాకప్ 2025ను టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఘనంగా ఆరంభించాడు. ఈ టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా యూఏఈతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో సూర్యవంశీ భారీ సెంచరీతో చెలరేగాడు.
ఆతిథ్య జట్టు బౌలర్లకు వైభవ్ చుక్కలు చూపించాడు.
తొలుత కాస్త ఆచితూచి ఆడిన సూర్యవంశీ.. క్రీజులో సెటిల్ అయ్యాక ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తనదైన స్టైల్లో బౌండరీల వర్షం కురిపించాడు. అతడిని ఆపడం ప్రత్యర్ధి బౌలర్ల తరం కాలేదు. ఈ క్రమంలో కేవలం 56 బంతుల్లోనే తన రెండో యూత్ వన్డే సెంచరీ మార్క్‌ను వైభవ్ అందుకున్నాడు.
సెంచరీ పూర్తి అయిన తర్వాత కూడా తన జోరును కొనసాగించాడు. అతడి దూకుడు చూస్తే సునాయసంగా డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకుంటాడని అంతాభావించారు. స్పిన్నర్ ఉద్దీష్ సూరి బౌలింగ్‌లో అనవసరంగా రివర్స్ స్కూపు షాట్‌కు ప్రయత్నించి క్లీన్ బౌల్డయ్యాడు. ఓవరాల్‌గా 95 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 14 సిక్సర్లు, 9 ఫోర్లతో 171 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ఏడాది అతడికి అన్ని ఫార్మాట్లలో కలిపి ఇది ఆరో సెంచరీ కావడం విశేషం.
ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్ దిశగా భారత్ సాగుతోంది. 44 ఓవర్లు ముగిసే సరికి భారత యువ జట్టు 4 వికెట్లు కోల్పోయి 353 పరుగులు చేసింది. విధ్వంసంకర సెంచరీతో మెరిసిన వైభవ్.. ఆరోన్ జార్జ్ తో కలిసి 212 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కెప్టెన్ అయూష్ మాత్రే(4) సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యాడు.
































