ధనుర్మాసం ప్రారంభం…
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించినప్పుడు ‘ధనుర్మాసం’ మొదలవుతుంది. ఈ రాశికి అధిపతి గురువు. సూర్యుడు ఈ రాశిలో ఉన్నప్పుడు, సూర్య భగవానుడి శక్తి, ప్రభావం కాస్త తగ్గుతుందని, అందుకే ఈ సమయంలో కొత్త పనులు మొదలుపెట్టడం వల్ల అడ్డంకులు రావచ్చని పండితులు చెబుతారు.
ఈ ఏడాది ధనుర్మాసం 2025, డిసెంబర్ 16న తెల్లవారుజామున 4:27 గంటలకు ప్రారంభమవుతుంది. తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే వరకు, అంటే 2026, జనవరి 14 మధ్యాహ్నం 3:13 గంటల వరకు ఈ సమయం కొనసాగుతుంది. సంక్రాంతి పండుగతో మళ్లీ శుభ ఘడియలు మొదలవుతాయి. అయితే ఇంటి ప్రశాంతత, ఆర్థిక అభివృద్ధి కోసం ధనుర్మాసం పూర్తయ్యే వరకూ 3 రకాల పనులను వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అవేంటంటే..
1. గృహ ప్రవేశాలు, నిర్మాణాలు వద్దు….
ఈ నెల రోజుల్లో గృహ ప్రవేశాలు (Housewarming) అస్సలు చేయకూడదు. అలాగే కొత్త ఇంటి నిర్మాణం మొదలుపెట్టడం, ఇల్లు రినోవేషన్ లేదా పెద్ద రిపేర్లు చేయించడం వంటి పనులు పెట్టుకోవద్దు. ఈ సమయంలో చేసే పనులు కుటుంబంలో అశాంతిని కలిగిస్తాయని నమ్మకం. అంతేకాదు, ఇంట్లో కొత్తగా దేవుడి విగ్రహాలను ప్రతిష్టించడం కూడా ఈ సమయంలో మంచిది కాదు.
2. కొత్త బిజినెస్, పెట్టుబడులకు బ్రేక్ వేయాలి…
మీరు ఏదైనా కొత్త వ్యాపారం (Business) స్టార్ట్ చేయాలనుకున్నా, లేదా భారీగా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా సంక్రాంతి వరకు ఆగడమే మంచిది. ఖర్మాస్ సమయంలో కొత్త వెంచర్లు మొదలుపెడితే అనుకోని అడ్డంకులు ఎదురై, ఆర్థిక ఇబ్బందులు లేదా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార ఒప్పందాల కోసం చేసే ప్రయాణాలు, అలాగే ఉపనయనం వంటి కార్యక్రమాలు కూడా ఈ సమయంలో చేయకూడదు.
3. పెళ్లిళ్లు, బంగారం కొనుగోళ్లు నిషిద్ధం…
జీవితంలో ముఖ్యమైన వేడుకలైన పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు (Engagement), నామకరణం (బారసాల) వంటి శుభకార్యాలన్నీ వాయిదా వేసుకోవాలి. సూర్యుడి ప్రభావం తక్కువగా ఉండటం వల్ల ఈ వేడుకలకు విఘ్నాలు కలగవచ్చు. అలాగే కొత్త వాహనాలు, ఆస్తి కొనుగోళ్లు, బంగారం లేదా వెండి వంటి విలువైన వస్తువులు కొనడానికి ఇది సరైన సమయం కాదు. వీటిని కొనడం వల్ల ఆ వస్తువులతో పాటు ప్రతికూల శక్తి ఇంటికి వస్తుందని భావిస్తారు.
మరి ఈ సమయంలో ఏం చేయాలి?
కొత్త పనులకు ఇది మంచి సమయం కాకపోయినా, దైవారాధనకు మాత్రం ఇది అద్భుతమైన సమయం. ముఖ్యంగా సూర్య భగవానుడిని పూజించడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి. రోజూ సూర్యుడి ద్వాదశ (12) నామాలను జపించడం వల్ల దోషాలు పోయి, పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది.
పఠించాల్సిన 12 సూర్య నామాలు ఓం ఆదిత్యాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం రవయే నమః, ఓం పూష్ణే నమః, ఓం దినేశాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం ప్రభాకరాయ నమః, ఓం మిత్రాయ నమః, ఓం ఉషకరాయ నమః, ఓం భానవే నమః, ఓం దినమనయే నమః, ఓం మార్తాండాయ నమః. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తూ, దైవచింతనతో గడిపితే ధనుర్మాసం కూడా మీకు శుభప్రదంగానే మారుతుంది.


































