: తెలుగు రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మాజీ MP కుసుమ కృష్ణమూర్తి(Kusuma Krishna Murthy) కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణవార్త తెలిసిన రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. 1940 సెప్టెంబర్ 11న ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అయినవిల్లి మండలం విలస గ్రామంలో కుసుమ కృష్ణమూర్తి జన్మించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు.
కాంగ్రెస్‌లో వివిధ పదవుల్లో పనిచేశారు. ఆ తర్వాత అమలాపురం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీచేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మూడుసార్లు విజయం సాధించారు.. ఉత్తమ ఎంపీగా పేరు కూడా తెచ్చుకున్నారు.
1990లో పెట్రోలియం అండ్ కెమికల్స్ మంత్రిత్వ శాఖలో పనిచేశారు. 1980-82 నుండి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమంపై సంయుక్త సెలెక్ట్ కమిటీ కన్వీనర్‌గా పనిచేశారు. కుసుమ కృష్ణమూర్తి ‘దళిత వేదం’ పేరుతో బుక్ కూడా రాశారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీతో ఎంతో అనుబంధం ఉంది.. అయితే కుసుమ కృష్ణమూర్తి చాలా ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
































