ఫిట్‌నెస్ నుంచి ఆరోగ్య ప్రయోజనాల కోసం చాలామంది చియా సీడ్స్‌ను తమ ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. ఆరోగ్యకరమైన ప్రోటీన్ బార్‌ల నుంచి ఫ్రూట్ జ్యూస్, డెజర్ట్‌లలో కూడా చియా సీడ్స్ ఉండేలా చూసుకుంటున్నారు.
ముఖ్యంగా యువతలో దీని క్రేజ్ చాలా ఎక్కువ. పోషకాహార పరంగా చూస్తే ఇవి చాలా శక్తివంతమైనవి. కానీ వాటిలో ఓ డార్క్ సీక్రెట్ కూడా ఉంది. దాని గురించి ఎక్కువమందికి తెలియదు. అదేంటంటే చియా సీడ్స్ తీసుకునే విధానం. వాటిని తప్పుగా తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలుగుతాయని ఎక్కువ మందికి తెలియదు. అందుకే వాటిని ఎలా తీసుకోవాలో.. తప్పుగా ఎలా తీసుకోకూడదో చూసేద్దాం.
చియా సీడ్స్
నల్లగా, చిన్నగా ఉండే ఈ గింజలు Salvia hispanica L అనే మొక్క నుంచి వస్తాయి. మధ్య అమెరికాలో వీటిని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. 2019 అధ్యయనం ప్రకారం.. అజ్టెక్, మాయా నాగరికతలకు చెందిన ప్రజలు వాటిని వైద్య, సౌందర్య సాధానాలలో భాగంగా తీసుకునేవారట.
చియా సీడ్స్ పోషకాలు
ఈ చిన్న గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్, చాలా ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, అనేక ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి పాలీఫెనాల్స్, కాఫీక్ యాసిడ్, రోజ్‌మెరినిక్ యాసిడ్, మైరిసెటిన్, క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లకు కూడా గొప్ప మూలం. USDA ప్రకారం.. 2 టేబుల్ స్పూన్లు (28 గ్రాములు) చియా సీడ్స్‌లో 138 క్యాలరీలు, 4.7 గ్రాముల ప్రోటీన్, 8.7 గ్రాములు (5 గ్రాముల ఒమేగా-3తో సహా) హెల్తీ ఫ్యాట్, 12.3 గ్రాముల కార్బ్స్ (10.6 గ్రాముల ఫైబర్‌తో సహా), 18 శాతం DV కాల్షియం, 23 శాతం DV మెగ్నీషియం, 27 శాతం DV భాస్వరం, విటమిన్ B1- 15 శాతం DV, విటమిన్ B3 16 శాతం DV ఉంటాయి.
చియా సీడ్స్ హెల్త్ బెనిఫిట్స్
2023లో Frontiers in Plant Scienceలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. చియా సీడ్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి, క్యాన్సర్‌తో పోరాడటానికి కూడా సామర్థ్యాన్ని చూపుతాయి. ఫైబర్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది టైప్-2 మధుమేహం, జీర్ణ సంబంధిత సమస్యలకు కూడా సహాయపడుతుంది.
చియా సీడ్స్ వల్ల కలిగే నష్టాలు
హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్-ట్రెండ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి చియా సీడ్స్ వల్ల కలిగే నష్టాల గురించి ఓ వీడియోలో హెచ్చరించారు. “చియా సీడ్స్ ఆరోగ్యకరమైనవి. కానీ వాటిని తప్పుగా తింటే తీవ్రమైన సమస్యలను కలిగిస్తాయి.” చియా సీడ్స్ నానబెట్టకుండా తింటే.. ఆ తర్వాత నీరు తాగడం వల్ల ఈ గింజలు గొంతులో లేదా అన్నవాహికలో ఉబ్బి ఇరుక్కుపోవచ్చని ఆయన వివరించారు. ఇది ఎండోస్కోపీ ద్వారా తొలగించాల్సిన పరిస్థితికి కూడా దారి తీస్తుందని తెలిపారు. ఇది అరుదుగా జరుగుతుంది కానీ మింగడంలో ఇబ్బంది లేదా ఇతర జీర్ణశయాంతర సమస్యలు ఉన్నవారిలో ప్రమాదం పెరుగుతుంది.
డాక్టర్ కునాల్ సూద్ కూడా ఒక కేసును కూడా ప్రస్తావించారు. 39 ఏళ్ల ఓ వ్యక్తి ఒక స్పూన్ పొడి చియా సీడ్స్‌ను.. నీటితో కలిపి మింగాడట. ఆ గింజలు గొంతులో వ్యాపించి.. శ్వాస తీసుకునే మార్గం మూసుకుపోయిందట. అందుకే చియాసీడ్స్ ఎప్పుడూ నానబెట్టి తర్వాత వాటిని తాగడం లేదా ఇతర స్వీట్ తయారీలో, సలాడ్స్ చేసుకోవడంలో ఉపయోగించుకోవచ్చని చెప్తున్నారు.
చియా సీడ్స్ తినడానికి సరైన మార్గం
డాక్టర్ సేథి ప్రకారం.. చియా సీడ్స్‌ను ఎల్లప్పుడూ సరైన పద్ధతిలో నానబెట్టి తినాలి. కనీసం 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టి తీసుకోవాలంటున్నారు. రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే తీసుకోవడం మరీ మంచిదని చెప్తున్నారు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.


































