ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. భూయజమానుల సమస్యలను పరిష్కరించే దిశగా కొన్ని మార్పులు తీసుకొచ్చింది.
ఒకవేళ రైతు ఆధార్ నంబరు వెబ్‌ల్యాండ్‌లో తప్పుగా నమోదైతే సవరణ చేసుకోవడం సులభం. ఇకపై వెబ్‌ల్యాండ్‌లో సవరణ కోసం జేసీ (Joint Collector) దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ సవరణ చేసే బాధ్యతను తహసీల్దార్లకు అప్పగించనుంది ప్రభుత్వం. తహసీల్దార్లే భూకేటాయింపు, సేకరణ, కోర్టు ఉత్తర్వుల అమలు వంటి బాధ్యతలు చూసుకుంటారు. ఆర్డీవోలకు రీ సర్వే పూర్తయిన తర్వాత గ్రామాల్లో మ్యుటేషన్ల సవరణ, ఎల్పీఎం నంబర్లలో సమస్యల్ని సరిదిద్దే బాధ్యతలను అప్పగించారు. కాకపోతే జేసీలకు ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చే అధికారం మాత్రం కొనసాగించారు.
ఈ మేరకు త్వరలోనే మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది. తహసీల్దార్లకు సంబంధించి ప్రతి భూములకు సంబంధించిన అంశాలు ఆర్డీవో, జేసీ, కలెక్టర్, సీసీఎల్ఏ కార్యాలయాలకు మెసేజ్ రూపంలో వెళ్తుంది. ఉన్నతాధికారులు ఈ సమాచారాన్ని పరిశీలించి నిర్ధారించుకుంటారు. రెవెన్యూ సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు కార్యదర్శుల స్థాయి పర్యవేక్షణ ఉంటుంది. వివిధ రెవెన్యూ సేవలకు ఇకపై గ్రామ/వార్డు సచివాలయాలు, మీసేవ కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది భూ సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయంటున్నారు.
ఈ అధికారాల బదిలీతో భూమికి సంబంధించిన అనేక పనులు వేగంగా, సులభంగా పూర్తవుతాయి. కోర్టు ఆదేశాల మేరకు భూమి రికార్డుల్లో మార్పులు చేయాల్సి వస్తే, గతంలో జేసీ స్థాయి వరకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు తహసీల్దార్, ఆర్డీవోలే ఆ పని చేయగలరు. అలాగే, భూమి కేటాయింపులు, భూసేకరణ ప్రక్రియలు కూడా వేగవంతం అవుతాయి. ఆధార్‌లోని భూమి వివరాలు తప్పుగా ఉంటే, వాటిని సరిచేయడానికి కూడా ఇప్పుడు ఈ అధికారులకు అధికారం ఉంది. రీసర్వే జరిగిన గ్రామాల్లో భూమి రికార్డుల్లో ఏవైనా తప్పులుంటే, వాటిని మ్యుటేషన్ ద్వారా సరిచేయవచ్చు. ల్యాండ్ పార్సెల్ మ్యాప్ (LPM) అనేది భూమి యొక్క ఖచ్చితమైన కొలతలు, ఆకారం, విస్తీర్ణాన్ని చూపించే పటం.
ఈ LPMలలోని వివరాలతో రికార్డుల్లోని విస్తీర్ణాన్ని సరిచేయడం, తప్పుగా నమోదైన ఖాతా నంబర్లను సరిదిద్దడం వంటి పనులు కూడా ఇప్పుడు తహసీల్దార్, ఆర్డీవోల పరిధిలోకి వస్తాయి. ఇప్పటికే ఉన్న LPMలలో కొత్త పట్టాదారుల పేర్లను చేర్చడం, మ్యాప్‌లో లేని సర్వే నంబర్లను జోడించడం, వివాద రిజిస్టర్లో చేర్పులు, తొలగింపులు వంటివి కూడా ఈ అధికారాల కిందకు వస్తాయి. ఒక గ్రామంలో ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలుంటే, వాటిని తొలగించి ఒకే ఖాతాగా మార్చాలని సూచించారు. మరణించిన వారి పేర్లతో ఉన్న ఖాతాలను తొలగించి, వారి చట్టబద్ధ వారసుల పేర్లను చేర్చడం కూడా తప్పనిసరి. ఈ మార్పుల వల్ల భూమి రికార్డులు మరింత పారదర్శకంగా, కచ్చితంగా ఉంటాయి.
ఈ కొత్త విధానం ద్వారా భూముల యాజమాన్య మార్పు ప్రక్రియ (మ్యుటేషన్) మరింత సులభతరం అవుతుంది. గ్రామ సచివాలయాలు, మీ సేవా కేంద్రాలు ప్రజల నుండి నేరుగా దరఖాస్తులను స్వీకరిస్తాయి. కోర్టు ఆదేశాలు వచ్చిన వెంటనే, తప్పిపోయిన సర్వే నంబర్లను గుర్తించి, భూమి రికార్డులలో సరిచేస్తారు. ఒకే భూమికి రెండుసార్లు మ్యుటేషన్ జరగకుండా డూప్లికేట్లను తొలగిస్తారు. వివాదంలో ఉన్న భూములను వివాద రిజిస్టర్ నుండి తీసివేయడానికి వచ్చిన అభ్యర్థనలను కూడా పరిశీలిస్తారు. పట్టా భూముల్లో, జీరో ఖాతాలుగా ఉన్న భూములకు కూడా మ్యుటేషన్లు, లావాదేవీలు చేయడానికి అనుమతిస్తారు.
ఎసైన్డ్ భూముల (ప్రభుత్వం కేటాయించిన భూములు) మ్యుటేషన్లు కూడా చేస్తారు. పాత పత్రాల విషయంలో, 2000 సంవత్సరానికి ముందు ఉన్న పత్రాలను రిజిస్ట్రార్ కార్యాలయాలు స్కాన్ చేసి, వాటిని కూడా మ్యుటేషన్ ప్రక్రియలో చేరుస్తారు. ఈ సంస్కరణలు సక్రమంగా అమలు అవుతున్నాయో లేదో తెలుసుకోవడానికి, జిల్లాల వారీగా కలెక్టర్లతో వారానికోసారి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. పనితీరును మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు తీసుకుంటారు. కొన్ని ముఖ్యమైన మ్యుటేషన్ కేసులను సీసీఎల్ఏ బృందం స్వయంగా పరిశీలించి, తదుపరి చర్యలను సూచిస్తుంది. ఏ గ్రామ లేదా వార్డు సచివాలయం సరిగా పనిచేయడం లేదో, ఆర్టీజీఎస్ వ్యవస్థ ద్వారా గుర్తిస్తారు. అలాంటి కేంద్రాలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిఫారసు చేస్తారు. ఈ చర్యలన్నీ భూమి రికార్డులను పారదర్శకంగా, వేగంగా మార్చడానికి ఉద్దేశించినవి.



































