ప్రకృతి వైపరీత్యాలు బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తోన్నాయి. తుపాన్లు, భారీ వర్షాలు.. అంతకుమించి బలమైన ఈదురుగాలులు వణకిస్తోన్నాయి. ఆ దేశ దక్షిణ ప్రాంతాన్ని ముంచెత్తుతున్నాయి.
బ్రెజిల్ లోని రియో గ్రాండే డో సుల్ స్టేట్ లో వీటి తీవ్రత అంచనాలకు మించిన స్థాయిలో ఉంటోంది. అతి తీవ్రమైన ఉష్ణోగ్రత, శీతల వాయువుల కలయికతో ఈ తుఫాను సంభవించినట్లు ఆ దేశ వాతావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మధ్యాహ్నం నుండి రియో గ్రాండే డో సుల్ అంతటా దట్టమైన మేఘాలు, తీవ్రమైన ఈదురుగాలులు అలముకున్నాయి. రియో గ్రాండే డో సుల్ రాజధాని గుయిబా సిటీలో సోమవారం నాడు భారీ తుఫాను సంభవించింది. బలమైన ఈదురు గాలుల వీచాయి. దాదాపుగా 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదుగాలులు ఆ నగరాన్ని ఉక్కిరిబిక్కిరికి గురి చేశాయి. దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే.. సిటీలోని హవాన్ మెగాస్టోర్ వెలుపల ప్రతిష్ఠించిన 79 అడుగుల ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కుప్పకూలింది.
ఈదురుగాలుల ధాటికి నెమ్మదిగా ముందుకు వంగుతూ.. ఖాళీ పార్కింగ్ స్థలంలో నేలకూలింది. దీనికి సంబంధించిన దృశ్యాలు వీడియోల్లో రికార్డయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బ్రెజిల్ పౌర రక్షణ సంస్థ డిఫెసా సివిల్ ప్రకారం.. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచాయి. మెట్రోపాలిటన్ రీజియన్ మొత్తం కూడా తీవ్ర వాతావరణ హెచ్చరికలు జారీ అయ్యాయి. తీర ప్రాంత రాష్ట్రం కావడం వల్ల వీటి తీవ్రత మరింత అధికంగా ఉంటోంది.
స్టాట్యూ ఆఫ్ లిబర్టీని 2020లో స్థాపించారు. 11 మీటర్ల ఎత్తు ఉన్న కాంక్రీట్ పునాదిపై ఇది ప్రతిష్ఠితమైంది. అది నేల కూలినప్పటికీ పునాది చెక్కుచెదరలేదు. ఈ విగ్రహం కూలిపోయే సమయంలో దాని సమీపంలో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పినట్టయింది. హవాన్ మెగా స్టోర్ సిబ్బంది తక్షణమే వాహనాలన్నింటినీ కూడా అక్కడి నుండి తరలించడంతో ఎటువంటి గాయాలు గానీ ఆస్తి నష్టం సంభవించలేదు.
బలమైన గాలులు, ప్రమాదకర నిర్మాణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని డిఫెసా సివిల్ స్థానికులను హెచ్చరించింది. సెల్ బ్రాడ్‌కాస్ట్ సిస్టమ్ ద్వారా మొబైల్ ఫోన్‌లకు అత్యవసర హెచ్చరికలను పంపింది. టియో హ్యూగో సిటీలో కూడా భారీ వర్షాలు బెంబెలెత్తించాయి. వడగళ్లతో వర్షం కురిసిందిక్కడ. లాజెడో టౌన్ లో భారీ వర్షాల వల్ల వరదలు సంభవించాయి.



































