సూర్యుడు ధనస్సు రాశిలో సంచరించే నెల రోజుల కాలాన్ని ధనుర్మాసం అని అంటారు. ఇది శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం. గోదాదేవి విష్ణువ్రతం చేపట్టి, స్వామిని కీర్తించింది ధనుర్మాసంలోనే.
ఈ నెలలో దేవాలయాల్లో ఆండాళమ్మ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం మొదలైనవి నిర్వహిస్తారు.
నేటి నుంచి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. ఈ పుణ్య కాలంలో శ్రీవ్రతం ఆచరిస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. విష్ణువును మధుసూధనుడిగా పూజించి గోదాదేవి కీర్తనలు ఆలపిస్తారు. ఫలితంగా మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా పెళ్లికాని ఆడపిల్లలు కృష్ణుడికి తులసి మాల సమర్పిస్తే నచ్చిన వరుడితో వివాహం జరుగుతుందని సూచిస్తున్నారు.
శ్రీవ్రతం
ముందుగా విష్ణువు విగ్రహం లేదా చిత్రపటాన్ని శుభ్రం చేసుకోవాలి. విగ్రహాన్ని ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకించాలి. చిత్రపటానికైతే గంధం, కుంకుమ పెట్టాలి. ఆవు నెయ్యితో దీపారాధన, పంచోపచార పూజ, పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి. మొదటి 15 రోజులు బియ్యం, పెసరపప్పుతో, మిగతా 15 రోజులు దద్దోజనంతో నైవేద్యం పెట్టాలి. రోజుకొక పాశురాన్ని ఆలపించాలి. ఈ తేలికైన వ్రతాన్ని నిష్టగా ఆచరించి గోదాదేవి విష్ణువును ప్రసన్నం చేసుకుంది.
‘ఓం శ్రీ గోదాదేవి సహిత రంగనాథ స్వామినే నమః’, ‘ఓం శ్రీ రంగ నిలయామై నమః’ ఈ పవిత్ర ధనుర్మాసంలో ప్రతి రోజూ ఈ రెండు మంత్రాలను పఠించాలని పండితులు సూచిస్తున్నారు. శ్రీవ్రతం ఆచరించే వారితో పాటు, పూజ చేయని వారు కూడా పఠించవచ్చని చెబుతున్నారు. పూజా మందిరంలో కొలువైన విష్ణుమూర్తి ఏ రూపాన్నైనా చూస్తూ పఠిస్తే.. సిరిసంపదలు పెరుగుతాయని అంటున్నారు. ఇంట్లో మంచి జరుగుతుందని సూచిస్తున్నారు.



































