దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్ అయిన YONO (You Only Need One)ని సరికొత్త హంగులతో, మెరుగైన ఫీచర్లతో SBI YONO 2.0 గా అప్‌గ్రేడ్ చేసింది.
ఇది కేవలం మొబైల్ యాప్ మాత్రమే కాదు, నెట్ బ్యాంకింగ్‌ను కూడా ఏకీకృతం చేసిన ఒక సమగ్ర డిజిటల్ అనుభవం. ఈ కొత్త వెర్షన్ మీకు ఎలాంటి సౌకర్యాలు అందిస్తుంది, KYC ప్రక్రియలో వచ్చిన మార్పులు ఏంటి? ఎలా రిజిస్టర్ చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.
YONO 2.0 అంటే ఏమిటి? ఎందుకంత ప్రత్యేకం?
SBI YONO యాప్ లాంచ్ అయినప్పటి నుండి కోట్లాది మంది కస్టమర్లకు సేవలు అందిస్తోంది. ఇప్పుడు వచ్చిన YONO 2.0.. పాత వెర్షన్‌కు అప్డేటెడ్ వెర్షన్. ఈ యాప్ లో మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ రెండింటినీ ఒకే చోట చేసుకోవచ్చు. ఇందులోని ముఖ్యమైన ఫీచర్లు ఏంటంటే..
- యూనిఫైడ్ బ్యాంకింగ్: మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ సేవలు ఒకే ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తాయి.
- మల్టిపుల్ అకౌంట్స్ లింక్ : మీరు SBI లోనే కాక, ఇతర బ్యాంకుల్లో ఉన్న ఖాతాలను కూడా ఈ SBI YONO యాప్‌కి లింక్ చేసి.. ఒకే చోట నుంచి లావాదేవీలు చేయవచ్చు. ఇక వేర్వేరు బ్యాంక్ యాప్‌లను వాడాల్సిన అవసరం లేదు.
- మెరుగైన భద్రత: లాగిన్ కోసం ఫేస్ ఐడీ (iOS యూజర్లకు), బయోమెట్రిక్ (ఆండ్రాయిడ్ యూజర్లకు) వంటి అనేక సెక్యూరిటీ ఆప్షన్లు ఉన్నాయి.
- వేగవంతమైన UPI చెల్లింపులు: యూపీఐ లావాదేవీలు మరింత సులభంగా, తక్కువ క్లిక్‌లతో పూర్తయ్యేలా సిస్టమ్‌ను మెరుగుపరిచారు.
- తక్కువ మెమరీ ఫోన్లలోనూ పనితీరు: ఇంటర్నెట్ కనెక్టివిటీ తక్కువగా ఉన్న ప్రాంతాలలో, అలాగే తక్కువ స్టోరేజ్ ఉన్న ఫోన్లలో కూడా సజావుగా పనిచేసేలా రూపొందించబడింది.
KYC లో విప్లవాత్మక మార్పులు
KYC అంటే “Know Your Customer”.. బ్యాంకులో ఖాతా తెరిచేటప్పుడు లేదా సేవలు పొందేటప్పుడు మీ గుర్తింపును, చిరునామాను ధృవీకరించే ప్రక్రియ. రీ-KYC అనేది అకౌంట్ వివరాలను అప్డేట్ చేయడానికి ఎప్పటికప్పుడు చేసే ధృవీకరణ. RBI నిబంధనల ప్రకారం ఇది తప్పనిసరి.
YONO 2.0 లో వచ్చిన అతిపెద్ద మార్పు ఈ KYC ప్రక్రియే. ఇప్పుడు ఒక సేవ కోసం మీరు KYC చేస్తే.. ఇతర సేవలు లేదా ఉత్పత్తులకు మళ్లీ మళ్లీ ధృవీకరణ అవసరం లేదు. ఇది కస్టమర్లకు గొప్ప ఉపశమనం. కొత్త సేవింగ్స్ అకౌంట్ తెరవడానికి బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. వీడియో కాల్ ద్వారా KYC పూర్తి చేసే సదుపాయం కూడా అందుబాటులో ఉంది.
SBI YONO 2.0 లో రిజిస్టర్ అయ్యే విధానం
మీరు ఇప్పటికే SBI కస్టమర్ అయితే.. SBI YONO 2.0 లో నమోదు చేసుకోవడం చాలా సులభం.
1. ఇప్పటికే ఇంటర్నెట్ బ్యాంకింగ్ (INB) ఉంటే..
మీరు మునుపటి నుంచీ SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ (నెట్ బ్యాంకింగ్) వాడుతున్నట్లయితే..
- యాప్‌ను డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి.
- “Existing SBI Customer” ఆప్షన్ ఎంచుకోండి.
- మీ పాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి, కొత్త MPIN (6-అంకెల పిన్) సెట్ చేసుకోండి.
2. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేకపోతే..
మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేకపోతే.. మీ ATM కార్డ్ సహాయంతో రిజిస్టర్ చేసుకోవచ్చు:
- యాప్‌లో “New to YONO?” ఎంపికను ఎంచుకోండి.
- ‘Register with ATM Card Details’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- మీ ఖాతా నంబర్, మొబైల్ నంబర్ నమోదు చేయండి. OTP ఎంటర్ చేయండి.
- మీ ATM కార్డ్ వివరాలను (నంబర్, పిన్) ఉపయోగించి కొత్త ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ను సృష్టించండి.
- తరువాత SBI YONO యాప్ లాగిన్ కోసం 6-అంకెల MPIN ను సెట్ చేసుకోండి.
3. ATM కార్డ్ కూడా లేకపోతే..
మీకు ATM కార్డ్ లేకపోతే.. మీరు యాప్‌లో ‘Register with account details’ ఆప్షన్ ద్వారా ఒక రిఫరెన్స్ నంబర్‌ను (Reference Number) జనరేట్ చేసి.. ఆ నంబర్‌తో ఒకసారి బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లవలసి ఉంటుంది.


































