సూపర్‌స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏడు పదుల వయసు దాటినా కూడా, ఇప్పటికీ కుర్రహీరోల మాదిరిగానే స్టైలిష్‌గా, అంతే ఫిట్‌గా, చురుకుగా డ్యాన్స్‌లు చేస్తుంటారు.
ఇంత వయసులో కూడా ఆయన ఇంత స్ట్రాంగ్ పర్సనాలిటీని మెయింటైన్ చేయడానికి కారణం కేవలం మంచి ఆహార నియమాలు, క్రమశిక్షణ మాత్రమే. రజనీకాంత్ పాటిస్తున్న ఆహార నియమాల రహస్యం గురించి చెన్నైకి చెందిన బారియాట్రిక్ సర్జన్ డాక్టర్ ప్రీతి మృణాళిని వివరించారు.
ఆయన ఫిట్‌నెస్‌కు మూలకారణం ఆయన దూరంగా ఉండే ‘ఐదు తెల్లటి ఆహారాలు’ అని తెలిపారు. రజనీకాంత్ స్వయంగా తాను తెల్లటి ఆహారాలకు దూరంగా ఉంటానని చెప్పిన వీడియోను పంచుకుంటూ, ఆ ఐదు తెల్లటి పదార్థాలను ఎందుకు తినకూడదో వివరించారు.
ఈ ఐదు తెల్లటి పదార్థాలు అధికంగా తీసుకుంటే శరీరంలో వాపు, ఇన్సులిన్ స్పైక్‌లు, ఆమ్లత్వం, గట్ సమస్యలకు దారితీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందులో మొదటిది, ప్రాసెస్ చేసిన తెల్లటి చక్కెర. ఇది పొట్టలో కొవ్వు పెరగడానికి, ఇన్సులిన్ నిరోధకతకు, ఆకలి కోరికలు పెరగడానికి దారితీస్తుంది. రెండోది, తెల్ల ఉప్పు. దీనిని పరిమితంగా తీసుకోకపోతే, అది పొట్ట ఉబ్బరం, అధిక రక్తపోటు వంటి సమస్యలకు దారితీస్తుంది. మూడోది, తెల్ల బియ్యం. దీనిని అధికంగా తీసుకుంటే బరువు వేగంగా పెరిగిపోయేందుకు దారితీస్తుంది. దీనికి బదులుగా కూరగాయలతో కలిపి మితమైన పరిమాణంలో తీసుకోవడం ఉత్తమం.
నాల్గవది, మైదా. బియ్యంలో కొద్దిగా ఫైబర్ ఉంటుంది, కానీ మైదాలో పూర్తిగా ఫైబర్ సున్నాగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల బరువు పెరగడం ఖాయం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఐదవది, పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులు. ఇవి కాల్షియం, ప్రోటీన్లకు మంచి మూలమే అయినప్పటికీ, 40 ఏళ్లు దాటిన తర్వాత జీవక్రియ మందగించడం మొదలవుతుంది. అందువల్ల, వీటిని ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది. అధికంగా తీసుకుంటే పొట్ట ఉబ్బరం, అధిక బరువు సమస్యలు దరిచేరుతాయి.
రజనీకాంత్ కేవలం ఆహార నియమాలే కాకుండా, మంచి పోషకవంతమైన ఆహారంతో పాటు రోజువారీ వ్యాయామాలు, ధ్యానం వంటివి కూడా చేస్తారని డాక్టర్ మృణాళిని వివరించారు. క్రమశిక్షణతో కూడిన ఈ జీవనశైలి వల్లే ఆయన ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని అనుభవిస్తూ, ఇప్పటికీ చురుకుగా నటిస్తూ ఉండగలుగుతున్నారు. మీరు కూడా సూపర్ స్టార్ లాగా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఐదు తెల్లటి ఆహారాలను మీ ఆహారంలో నుంచి క్రమంగా తగ్గించడం మంచిది.


































