అందాన్ని కాపాడుకునేందుకు సెలబ్రిటీలు పడే పాట్లు అంతా ఇంతా కాదు. కడుపు మాడ్చుకుంటారు, క్రీములు వాడతారు, జిమ్‌కెళ్తారు. అందం, శరీర సౌష్టవం కోసం ఏదైనా చేస్తారు.
కానీ ఇండస్ట్రీలో అడుగుపెట్టే సమయానికే జుట్టు రాలడం మొదలైతే ఇంకేమైనా ఉందా?
అందులోనూ అబ్బాయిలు బట్టతలతో ఆడిషన్‌కు వెళ్తే ఎవరైనా తీసుకుంటారా? అక్షయ్ ఖన్నాకు కూడా ఇదే భయం. కానీ భయపడుతూ కూర్చుంటే ఏదీ మారదని అర్థమై ధైర్యంగా ముందడుగు వేశాడు. లుక్ కన్నా టాలెంట్ ముఖ్యమని నిరూపించాడు. ఈ ఏడాది ఛావా, ధురంధర్ సినిమాలతో సెన్సేషన్‌గా మారిన ఈ నటుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..
19 ఏళ్లకే జుట్టు రాలడం
దివంగత నటుడు, రాజకీయ నాయకుడు వినోద్ ఖన్నా కుమారుడే అక్షయ్ ఖన్నా. స్కూల్, కాలేజీ డేస్‌లో చదువులో కన్నా ఆటల్లోనే ఎక్కువ రాణించేవాడు. కానీ చిన్నతనంలోనే హెయిర్ లాస్ సమస్యతో బాధపడ్డాడు. 19 ఏళ్లకే ఉన్న జుట్టంతా ఊడిపోతుంటే భరించలేకపోయాడు. తలపై ఎన్ని వెంట్రుకలు ఉంటే అన్ని ఆఫర్స్ వస్తాయనుకునేవాడు.
తండ్రి సినిమాతో ఎంట్రీ
కానీ, జుట్టు రాలడాన్ని తగ్గించలేమన్న నిజాన్ని అర్థం చేసుకున్నాక తన టాలెంటే అవకాశాలు తెచ్చిపెడుతుందని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేశాడు. తండ్రి హీరోగా నటించి, నిర్మించిన హిమాలయ పుత్ర (1997) మూవీతో తొలిసారి వెండితెరపై అడుగుపెట్టాడు. అయితే అక్షయ్ (Akshaye Khanna)కు మంచి బ్రేక్ ఇచ్చింది మాత్రం తన రెండో మూవీ ‘బోర్డర్’. ఈ చిత్రం తర్వాత అక్షయ్ వెనుదిరిగి చూసుకోలేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా తనదైన మార్క్ సృష్టించాడు.
వైరల్
దిల్ చహ్తా హై, హమ్‌రాజ్, దీవాంగే, రేస్, తీస్ మార్ ఖాన్, ఇత్తేఫఖ్, సెక్షన్ 375, దృశ్యం 2 ఇలా హిందీలో సినిమాలు చేసుకుంటూ పోయాడు. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ఛావాతో తిరిగొచ్చాడు. ఔరంగజేబుగా అద్భుతంగా నటించి మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ధురంధర్ చిత్రంలో తన యాక్టింగ్, డ్యాన్స్ క్లిప్‌తో మరోసారి వార్తల్లోకెక్కాడు. అయితే అక్షయ్‌కు అందరిలా పార్టీలు చేసుకుంటూ ఎప్పుడై లైమ్‌లైట్‌లో ఉండే అలవాటు లేదు.
50 ఏళ్లు దాటినా సింగిల్‌గానే..
వచ్చామా? సినిమాలు చేసుకున్నామా? అయిపోయిందా? అంతే! అన్నట్లుగా ఉంటాడు. 50 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయిన ఈ హీరో గతంలో హీరోయిన్ కరిష్మా కపూర్‌తో ప్రేమలో పడ్డాడు. కానీ ఆ ప్రేమకథ పెళ్లిదాకా రాకముందే ఆగిపోయింది. 28 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న అక్షయ్ ఆస్తి రూ.167 కోట్లు ఉంటుందని అంచనా!

































