టోల్ గేట్‌కు గుడ్ బై.. 80 kmph వేగంతో వెళ్లినా ఆటోమేటిక్‌గా డబ్బులు కట్..సామాన్యులకు రూ.1,500 కోట్ల ఇంధనం ఆదా

జాతీయ రహదారుల మీద ప్రయాణించే వారికి ఇది నిజంగా శుభవార్త. దేశంలో టోల్ ప్లాజాల వద్ద ప్రయాణికులు ఎదుర్కొంటున్న సుదీర్ఘ నిరీక్షణ సమస్యకు 2026 చివరి నాటికి పూర్తిగా తెరపడనుంది.


కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో చేసిన కీలక ప్రకటన ప్రకారం.. అత్యాధునిక మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) టోల్ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత హైవే నిర్వహణను 2026 చివరి నాటికి దేశవ్యాప్తంగా పూర్తి చేస్తారు. ఈ కొత్త టెక్నాలజీ అమలైన తర్వాత, టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఎదురుచూడాల్సిన సమయం జీరో మినిట్స్‎కు చేరుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు.ఇది ప్రయాణ అనుభవాన్ని సమూలంగా మార్చనుంది.

నూతనంగా రాబోయే ఈ మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) టోల్ సిస్టమ్ పూర్తిగా AI, శాటిలైట్ ఆధారంగా పనిచేయనుంది. మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) టోల్ సిస్టమ్ అమల్లోకి వచ్చిన తర్వాత, ప్రస్తుతమున్న ఫాస్ట్‌ట్యాగ్ (FastTag) స్థానంలో, వాహనాలు గంటకు గరిష్టంగా 80 కి.మీ. వేగంతో టోల్ ప్లాజాలను దాటవచ్చు. ఎక్కడా ఆగాల్సిన అవసరం ఉండదు. ఈ వ్యవస్థ AI టెక్నాలజీతో అనుసంధానించబడిన శాటిలైట్ ద్వారా నంబర్ ప్లేట్ గుర్తింపు సాంకేతికతను ఉపయోగిస్తుంది.

వాహనం వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా టోల్ వసూలు అవుతుంది. “టోల్ వద్ద నిరీక్షణ సమయాన్ని జీరో నిమిషాలకు తీసుకురావడమే మా లక్ష్యం. ఈ అడ్వాన్సుడ్ టెక్నాలజీతో ప్రయాణ సమయం తప్పకుండా తగ్గుతుంది” అని మంత్రి చెప్పారు. గతంలో టోల్ చెల్లించడానికి 3 నుంచి 10 నిమిషాలు పట్టేదని, ఫాస్ట్‌ట్యాగ్ వచ్చాక అది 60 సెకన్లకు తగ్గిందని, ఇప్పుడు MLFF తో ఆ సమయం పూర్తిగా తగ్గుతుందని ఆయన తెలిపారు.

ఈ విప్లవాత్మక మార్పు వలన ప్రజలకు ఆర్థికంగా కూడా ప్రయోజనం కలగనుంది. టోల్ వద్ద వాహనాలు ఆగకపోవడం వలన ప్రజలకు రూ.1,500 కోట్లు విలువైన ఇంధనం ఆదా అవడమే కాకుండా, ప్రభుత్వానికి అదనంగా రూ.6,000 కోట్లు ఆదాయం పెరుగుతుందని గడ్కరీ వెల్లడించారు.

ఇప్పటికే ఫాస్ట్‌ట్యాగ్ కారణంగా ప్రభుత్వ ఆదాయం కనీసం రూ.5,000 కోట్లు పెరిగిందని, MLFF 100% పూర్తయితే, టోల్ దొంగతనం (Toll Theft) పూర్తిగా ఆగిపోయి, ప్రభుత్వ ఆదాయం మరింత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవస్థను పారదర్శకంగా, అవినీతి రహితంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ మొత్తం ప్రక్రియ 2026 నాటికి 100 శాతం పూర్తవుతుందని ఆయన సభకు హామీ ఇచ్చారు.

కొత్త టెక్నాలజీ ద్వారా ప్రజలకు ఎంతగానో సహాయపడుతుందని, ప్రయాణ సమయం కూడా తగ్గుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత కేవలం జాతీయ రహదారులకు (National Highways) మాత్రమే పరిమితమని, రాష్ట్ర రహదారులు లేదా నగర రోడ్ల బాధ్యత కేంద్రానికి ఉండదని ఆయన స్పష్టం చేశారు.

అయినప్పటికీ, సోషల్ మీడియాలో రాష్ట్ర లేదా నగర రోడ్లపై సమస్యలు వచ్చినప్పుడు కూడా, అవి జాతీయ రహదారులపై జరిగినట్లుగా చూపబడుతున్నాయని ఆయన తెలిపారు. ప్రజల జీవితాలను సులభతరం చేసేందుకు ఈ వ్యవస్థను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.