1. అందమైన హెయిర్ బన్…
పండ్ల వ్యాపారులు దిగుమతి చేసిన జామ, ఆపిల్ పండ్లను ఒక్కోదానిని విడివిడిగా వలలలో ప్యాక్ చేస్తారు. ఇవి సాధారణంగా తెలుపు రంగులో మెత్తగా ఉంటాయి. వీటిని మీ జుట్టు అలంకరణకు వాడుకోవచ్చు.
ముందుగా ఆ వలకు మీకు నచ్చిన లేత గులాబీ రంగు వేసి పూర్తిగా ఆరబెట్టండి.
తర్వాత ఆ నెట్ పైన చిన్న పూసలను వరుసగా అతికించండి.
ఇప్పుడు మీ జుట్టును కొప్పు (బన్) లాగా చుట్టి, దానిపై ఈ అలంకరించిన వలను ఉంచండి.
ఇది మీ కేశాలంకరణకు కొత్త మెరుపును, ఆకర్షణను ఇస్తుంది.
2. బాత్రూమ్ సువాసన కోసం…
పండ్ల మెష్‌ను బాత్రూమ్ లేదా రూమ్ ఫ్రెషనర్‌గా మార్చుకోవచ్చు.
నారింజ, నిమ్మ లేదా దబ్బపండు తొక్కలను సేకరించి ఈ వలలో వేయండి.
దీనిని మీ గదిలో లేదా బాత్రూంలో ఒక మూలకు వేలాడదీయండి.
వలలో గాలి తగిలే రంధ్రాలు ఉండటం వల్ల తొక్కలకు బూజు పట్టదు, కీటకాలు చేరవు.
ఆ తొక్కల నుంచి వచ్చే సహజమైన సువాసన గది అంతా నెమ్మదిగా వ్యాపిస్తుంది.
3. పిల్లల క్రాఫ్ట్ పనుల కోసం…
పిల్లలు ఏదైనా కొత్తగా చేయడానికి ఇష్టపడతారు. ఈ వలను వారి డ్రాయింగ్ ప్రాజెక్టులలో వాడవచ్చు.
ఉదాహరణకు, మీ బిడ్డకు ‘సింహం-ఎలుక’ కథ అంటే ఇష్టమైతే, ఆ కథలోని దృశ్యాన్ని సృష్టించడానికి ఈ నెట్ ఉపయోగపడుతుంది.
కాగితంపై సింహం బొమ్మ గీసి, వేటగాడు వేసిన వలలో ఆ సింహం చిక్కుకున్నట్లుగా ఈ మెష్‌ను బొమ్మపై అతికించవచ్చు. ఇది చిత్రానికి ఒక ప్రత్యేకమైన లుక్‌ని ఇస్తుంది.
పారేసే వస్తువులతో ఇలాంటి ప్రయోగాలు చేయడం వల్ల పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా, మన ఇంటికి ఒక కొత్త అందం వస్తుంది.


































