రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం డెడ్ లైన్ అందించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.01 కోట్ల రేషన్ కార్డులు ఉండగా, లబ్ధిదారుల సంఖ్య 3.25 కోట్లకు చేరింది. ఆ లోపు ఈకేవైసీ కంప్లీట్ చేయాలని సూచిస్తోంది. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.
రేషన్‌కార్డు దారులందరికీ ఈ-కేవైసీ తప్పనిసరి అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను పూర్తి చేయని కార్డులకు నూతన సంవత్సరం నుంచి సన్నబియ్యం కోటా నిలిపివేయనున్నట్లు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారుల రద్దీ పెరుగుతోంది. రేషన్ కార్డుల్లో నమోదైన కుటుంబ సభ్యులంతా సమీపంలోని రేషన్ దుకాణాలకు వెళ్లి ఈ-పాస్ యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్రలు వేసి ఈ-కేవైసీ పూర్తి చేయాలి. ఐదేళ్ల లోపు పిల్లలకు ఈ ప్రక్రియ నుంచి మినహాయింపు ఇచ్చింది. రెండు సంవత్సరాలుగా ఈ-కేవైసీ కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటికీ పెద్ద సంఖ్యలో కార్డుదారులు అప్డేట్ చేసుకోలేదని అధికారులు తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు గడువు మాత్రమే ఉండటంతో పౌరసరఫరాల శాఖ అప్రమత్తమైంది. గడువులోపు ఈ-కేవైసీ చేయించుకోని వారికి రేషన్ బియ్యం పంపిణీ ఉండదని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రేషన్ డీలర్లు దుకాణాల వద్ద అందుబాటులో ఉండాలని, షాపుల ముందు సమాచారం తెలియజేసే ప్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 1.01 కోట్ల రేషన్ కార్డులు ఉండగా, లబ్ధిదారుల సంఖ్య 3.25 కోట్లకు చేరింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11.27 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది. వీటి ద్వారా 34 లక్షల మంది కొత్త లబ్ధిదారులు వ్యవస్థలోకి వచ్చారు. గత ప్రభుత్వ కాలంలో మంజూరైన కార్డులకు సంబంధించి ఈ-కేవైసీ దాదాపు 80 శాతం పూర్తయింది. అయితే కొత్త రేషన్ కార్డుల్లో కేవలం 40 శాతం మాత్రమే ఈ-కేవైసీ పూర్తైంది. ఇంకా 60 శాతం మంది లబ్ధిదారులు వేలిముద్రలు వేయాల్సి ఉంది. గడువు తక్కువగా ఉండటంతో డీలర్లు, లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. ఈ-కేవైసీ గడువును ఫిబ్రవరి వరకు పొడిగించాలని డిమాండ్ వినిపిస్తోంది. కొత్తగా మంజూరైన రేషన్ కార్డుదారులకు కొన్ని ప్రభుత్వ పథకాలు ఇప్పటివరకు వర్తించడం లేదన్న చర్చ కూడా కొనసాగుతోంది. ఇప్పటికే రేషన్ కార్డు ఉన్నవారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ లభిస్తున్నాయని, కొత్త కార్డుదారులకు ఇవి అందడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ-కేవైసీ పూర్తి చేయాలంటే రేషన్ కార్డులో నమోదైన సభ్యులందరూ వ్యక్తిగతంగా హాజరై బయోమెట్రిక్ వేలిముద్రలు నమోదు చేయించుకోవాల్సిందే. అవసరమైన పత్రాల జిరాక్స్‌తో పాటు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు. సాంకేతిక సమస్యల కారణంగా వేలిముద్రలు పడకపోతే మరుసటి రోజు వచ్చి పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. గడువులోపు ఈ-కేవైసీ పూర్తిచేస్తే సన్నబియ్యం పంపిణీతో పాటు గ్యాస్ సబ్సిడీ, ఉచిత విద్యుత్ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో ఉచిత రేషన్ సరుకులు, ఇతర పథకాలు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.


































