గోదారి గట్టున సినిమా తీస్తే హిట్ అనేది తెలుగు సినిమా సెంటిమెంట్.. అందుకే ఎన్నెన్నో సుందర దృశ్యాలతో కనువిందు చేసే జిల్లాలోని గోదావరి తీరం సినీ షూటింగ్‌లకు ప్రసిద్ధి పొందింది.
ప్రకృతి అందాల నడుము శోభాయమానంగా వెలిగిపోయే గోదావరి చుట్టుపక్కల ప్రాంతాల్లో నిత్యం ఏదోక సినిమా షూటింగ్ జరుగుతూనే ఉండేది. అయితే, ముఖ్యంగా గోదారి గట్టున ఉన్న నిద్ర గన్నెరు చెట్టు చాలామందికి సెంటిమెంట్‌గా ఉండేది. అయితే, గతేడాది వర్షాలకు అది కూలిపోయింది.
300 సినిమాలు
కొవ్వూరు మండలం కుమారదేవం సమీపంలో గోదావరి ఒడ్డున నిద్రగన్నేరు చెట్టుంది. ఈ చెట్టు కింద షూటింగ్ జరుపుకున్న సినిమాలెన్నో.. అందుకే దీనిని సినిమా చెట్టుగా పిలుస్తుంటారు. కృష్ణ నటించిన పాడిపంటలు, చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం, తదితర సుమారు 300 చిత్రాలు ఈ చెట్టు దగ్గర షూటింగ్ జరుపుకున్నాయని స్థానికులు చెబుతారు. జిల్లాలోని ఏలూరు, కొల్లేరు, బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, పెద్దేము, భీమవరం పరిసర ప్రాంతాలు, పాలకొల్లు, నిడదవోలు, చాగల్లుతో పాటు పలు ప్రాంతాల్లో షూటింగ్ ప్రదేశాలు ఉన్నాయి.
కూలిపోయిన చెట్టు.. దర్శకుడు వంశీ భావోద్వేగం
సితార, లేడీస్ టైలర్, డిటెక్టివ్ నారద, చెట్టు కింద ప్లీడర్, గోపి-గోపిక-గోదావరి, మంచు పల్లకీ.. ఇలా సుమారు 18 సినిమాలకు కుమారదేవం చెట్టు కింద ఏదో ఒక సన్నివేశాన్ని చిత్రీకరించానని ప్రముఖ సినీ దర్శకుడు వంశీ తెలిపారు. ఈ చెట్టు కూలిపోయిందని తెలియగానే తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం వెళ్లారు. కూలిపోయిన భారీ నిద్ర గన్నెరు వృక్షాన్ని పరిశీలించి భావోద్వేగానికి లోనయ్యారు. స్థానికులతో మాట్లాడుతూ తనకు, చెట్టుకు ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. ఈ చెట్టు మళ్లీ బతకాలన్నారు. చెట్టు బతికితే తాను మళ్లీ ఇక్కడ సినిమా తీస్తానని చెప్పారు. చెట్టు పడిపోయిన విషయం తెలిసి వేలాది మంది నుంచి తనకు వేలాది మెసేజ్‌లు వచ్చాయని, తన తల్లి చనిపోయినప్పుడు కూడా ఇన్ని మెసేజ్‌లు రాలేదన్నారు.
చిగురించిన చెట్టు
చెట్టు కూలిపోవడంతో చాలామంది బాధపడ్డారు. ఇక ఆ చెట్టు మళ్లీ చిగురించదని అందరూ భావించారు. అయితే, అక్కడి యువకులు మాత్రం ఆ చెట్టును ఎలాగైనా బతికించాలని అనుకున్నారు. అందుకోసం వారికి తోచిన పద్ధతులను అనుసరించారు. ఎట్టకేలకు ఎవరూ ఊహించలేని విధంగా ఆ చెట్టు మళ్లీ చిగురించింది. ప్రస్తుతం గోదారి గట్టుపై ఉన్న నిద్రగన్నేరు చెట్టు పూర్తిగా ఆకులతో కళకళలాడుతూ కనిపించడంతో స్థానికులు ఫోటోలు తీసి సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నారు.

































