ఆంధ్రాతీరం భారత్‌కు బంగారు గని.. దేశ భవిష్యత్ అంతా ఇక్కడే

ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాల వాడకం తగ్గి, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన వనరుల వాడకం పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం(Coastal Region) భారత్కు ముఖ్యమైన ఆస్తిగా మారింది.


కోరమండల్ తీరం ప్రస్తుతం భారత్కు బంగారు బాతు లాంటిదే. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు విస్తరించి ఉన్న తీరప్రాంత ఇసుకలో లభించే అరుదైన ఖనిజాలు ఉన్నాయి. ఇవి ఇండియా క్లీన్ ఎనర్జీ(India clean energy) టార్గెట్ సాధించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. ఆంధ్రప్రదేశ్ తీరంలో లభించే మోనజైట్, ఇల్మెనైట్, రూటిల్ వంటి ఖనిజాలు కేవలం సాధారణ ఇసుక కాదు. భౌగోళిక సర్వేల ప్రకారం, ఉత్తరాన భీమునిపట్నం, కళింగపట్నం నుండి దక్షిణాన రామాయపట్నం, దుగరాజపట్నం వరకు ఈ ఖనిజ సంపద ఒక నిరంతర కారిడార్లా విస్తరించి ఉంది. ముఖ్యంగా ఇక్కడ లభించే మోనజైట్లో 55-60% అరుదైన ఖనిజ ఆక్సైడ్లు, 8-10% థోరియం ఉన్నాయి. థోరియం అనేది భారత తదుపరి తరం అణు రియాక్టర్లకు ప్రధాన ఇంధనంగా పరిగణించబడుతోంది. – Rare Earth Elements

క్లీన్ ఎనర్జీతో లాభమేంటి..

నేడు మనం వాడుతున్న అత్యాధునిక సాంకేతికతకు ఈ ఖనిజాలే ప్రాణం. EV మోటార్లలో వాడే శక్తివంతమైన శాశ్వత అయస్కాంతాల తయారీకి నియోడైమియం వంటి మూలకాలు అవసరం. గాలి మరల జనరేటర్లలో వీటి వినియోగం తప్పనిసరి. సెమీకండక్టర్లు, మొబైల్ ఫోన్లు, రక్షణ రంగ పరికరాల తయారీలో ఇవి కీలకమైనవి. ప్రస్తుతం ఈ ఖనిజాల సరఫరాలో చైనా గుత్తాధిపత్యం వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఈ రకమైన ఖనిజాలకు నిలయంగా మారడం వల్ల చైనాపై ఆధారపడటం గణనీయంగా తగ్గుతుంది. – Rare Earth Corridor

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కారిడార్ను అభివృద్ధి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాయి.
నెల్లూరు జిల్లా గూడూరులో ప్లాంట్: ‘ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్’ నెల్లూరులో ఏడాదికి 10,000 టన్నుల సామర్థ్యం గల మోనజైట్ ప్రాసెసింగ్ ప్లాంట్ను నిర్మిస్తోంది. ఇది 2026 నాటికి కార్యరూపం దాల్చనుంది.
PLI పథకం: అరుదైన ఖనిజాల ఆధారిత అయస్కాంతాల తయారీని ప్రోత్సహించేందుకు కేంద్రం రూ.7,280 కోట్లతో ప్రత్యేక ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించింది.
పెట్టుబడుల ఆకర్షణ: గ్రీన్ హైడ్రోజన్, సోలార్ హబ్లుగా మారుతున్న విశాఖ, కాకినాడ ప్రాంతాలకు ఈ ఖనిజాల కారిడార్ వెన్నెముకగా నిలవనుంది.

సవాళ్లు

ఖనిజాల వెలికితీతలో పర్యావరణ పరిరక్షణ, తీరప్రాంత రక్షణ ఒక సవాలుగా ఉన్నప్పటికీ, అధునాతన సాంకేతికతతో ఈ సంపదను వినియోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ ‘భారతదేశ క్లీన్ ఎనర్జీ గేట్వే’గా మారుతుందనడంలో సందేహం లేదు. 2047 నాటికి భారత్ ‘వికసిత్ భారత్’గా ఎదగడంలో ఈ తీరప్రాంత ఖనిజాలే గమనాన్ని నిర్ణయించనున్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.