రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ టీజర్ శుక్రవారం (డిసెంబర్ 19) రిలీజైంది. ఈ టీజర్ తోపాటు మూవీ రిలీజ్ తేదీని కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. మూవీ భోగి ముందు రోజు థియేటర్లలోకి రానుంది.
మాస్ మహారాజా రవితేజ చాలా రోజులుగా ఓ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలుసు కదా. ఇప్పుడో ఫ్యామిలీ ఎంటర్టైనర్ భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సంక్రాంతి సినిమాగా వస్తున్న ఈ మూవీపై రవితేజ భారీ ఆశలే పెట్టుకోగా.. మూవీని జనవరి 13న రిలీజ్ చేయబోతున్నారు.
భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్
కిశోర్ తిరుమల డైరెక్ట్ చేసిన భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ టీజర్ ను శుక్రవారం (డిసెంబర్ 19) రిలీజ్ చేశారు. ఇందులో పెళ్లయిన తర్వాత విదేశానికి వెళ్లి మరో అమ్మాయితో ప్రేమలో పడటం, ఆ విషయం తన భార్యకు తెలియకుండా ఉండేందుకు తంటాలు పడే భర్తగా రవితేజ కనిపించాడు. అతని భార్య పాత్రలో డింపుల్ హయతి, ప్రేయసిగా ఆశికా రంగనాథ్ ఈ సినిమాలో నటించారు. 90 సెకన్ల ఈ మూవీ టీజర్ ఫన్నీగా సాగిపోయింది. ఇందులో ఓ సైకాలజిస్ట్ పాత్రలో మురళీధర్ గౌడ్ నవ్వించాడు. ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 13న రిలీజ్ చేయబోతున్నారు.
రవితేజకు కష్టమే..
రవితేజ వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. ఈ మధ్యే వచ్చిన మాస్ జాతర డిజాస్టర్ గా మిగిలిపోయింది. ధమాకాలాంటి ఓ పెద్ద హిట్ కోసం చూస్తున్న అతడు.. ఈసారి రూటు మార్చి ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తిలో తన మాస్ క్యారెక్టర్ ను పక్క పెట్టినట్లు కనిపిస్తోంది. ఓ ఫ్యామిలీ మ్యాన్ లా కనిపిస్తూనే ఇటు భార్య, అటు ప్రేయసి మధ్య నలిగిపోయే పాత్ర అతనిది.
అయితే ఈ టీజర్ ఫన్నీగానే ఉన్నా.. ఇది సంక్రాంతి రేసులో ఉన్న భారీ సినిమాల మధ్య రవితేజను ఎంత వరకూ నిలబెడుతుందన్నది సందేహమే. ఎందుకంటే జనవరి 9న ప్రభాస్ ది రాజా సాబ్, జనవరి 12న చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారులాంటి సినిమాలు వస్తున్న నేపథ్యంలో ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓ గట్టి కంటెంట్ ఉంటే తప్ప బాక్సాఫీస్ దగ్గర నిలదొక్కుకోవడం కష్టమే. ఈ లెక్కన సంక్రాంతికి వస్తూ రవితేజ పెద్ద సాహసమే చేస్తున్నాడని చెప్పొచ్చు.





























