రైలు పట్టాల నుంచి సౌర విద్యుత్తు

ట్రాక్‌ మధ్యలో ఫలకాల ఏర్పాటుతో కొత్త ప్రయోగం


వారణాసిలో పైలట్‌ ప్రాజెక్టు.. త్వరలో దేశవ్యాప్త విస్తరణ

దక్షిణ మధ్య రైల్వేలో ఏర్పాటుకు కసరత్తు

రూ.24 వేల కోట్ల కరెంటు బిల్లును తగ్గించుకునే యత్నం

ప్రత్యామ్నాయ విద్యుత్తు ఉత్పత్తిలో రైల్వే శాఖ కొత్త విధానాన్ని అవలంబించేందుకు సిద్ధమవుతోంది. పట్టాల మధ్యలో సౌర ఫలకాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా పెద్దఎత్తున సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా వారణాసిలోని బెనారస్‌ లోకోమోటివ్‌ వర్క్స్‌కు వెళ్లే ట్రాక్‌ మీద 70 మీటర్ల మేర సోలార్‌ ప్యానెళ్లను ఏర్పాటుచేసింది.

28 ప్యానెళ్ల ఏర్పాటుతో 15 కిలోవాట్‌ పీక్‌ సామర్థ్యంతో రోజుకు 67 యూనిట్లు ఉత్పత్తి చేస్తోంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా దీన్ని విస్తరించాలని నిర్ణయించగా.. ఈమేరకు రైల్వే బోర్డు తాజాగా దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాసింది. ట్రాక్‌ మీద సోలార్‌ ప్యానళ్ల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను గుర్తించాలని ఆదేశించింది. ఇప్పటికే కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ విధానం విజయవంతంగా అమలవుతోంది.

భూసేకరణ ఖర్చు తట్టుకోలేకనే…
వంద శాతం విద్యుత్తు రైళ్లను నడపాలని లక్ష్యంగా పెట్టుకుని ట్రాక్‌ విద్యుదీకరణ చేస్తున్న రైల్వే శాఖ, ప్రస్తుతం సాలీనా రూ.24 వేల కోట్ల విలువైన కరెంటును వాడుతోంది. డిమాండ్‌ పెరుగుతుండటంతో ప్రత్యామ్నాయ విద్యుత్తు ఉత్పత్తిపై దృష్టి సారించింది. రైల్వే స్టేషన్‌ భవనాలు, సర్వీసు భవనాలపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసి ప్రస్తుతం 898 మెగావాట్‌ విద్యుత్తు ఉత్పత్తి చేస్తోంది. కానీ ఇది సరిపోవటం లేదు.

ఉత్పత్తి పెరగాలంటే సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటుకు పెద్ద ఎత్తున ఖాళీ భూములు కావాలి. అందుకు భూసేకరణ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అందుకే పట్టాల మధ్య ఉండే ఖాళీ స్థలాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం దేశంలో 1.35 లక్షల కి.మీ. రైల్వే ట్రాక్‌ ఉంది. ట్రాక్‌ రెండు పట్టాల మధ్య ప్యానెల్స్‌ ఏర్పాటు చేస్తే, భూసేకరణ భారం లేకుండానే సౌర విద్యుత్తు ఉత్పత్తికి వీలుంటుందని తేల్చింది.

దక్షిణ మధ్య రైల్వేలో కసరత్తు..: సోలార్‌ విద్యుత్తు ఉత్పత్తిలో దక్షిణ మధ్య రైల్వే చురుకుగా ఉంది. ప్రస్తుతం జోన్‌ పరిధిలో 9.3 మెగావాట్ల సామర్థ్యంతో వ్యవస్థ ఉంది. ఇప్పుడు దాన్ని 34 మెగావాట్లకు చేర్చేందుకు టెండర్లను అవార్డు చేసింది. కాచిగూడ స్టేషన్‌ 100% సోలార్‌ పవర్‌తో పని చేస్తోంది. ఈ నేపథ్యంలో పట్టాలపై ఏరా>్పటు చేసే ప్రాజెక్టులో కూడా జోన్‌ చురుకుగా వ్యవహరిస్తుందని అధికారులు చెబుతున్నారు.

భద్రతే పెను సవాల్‌..: పట్టాలపై ఏర్పాటు చేసే సౌర ఫలకాలకు భద్రత ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. రేయింబవళ్లు వాటికి కాపలా ఏర్పాటు చేయటం కుదరదు. అలాంటప్పుడు వాటిని చోరీ చేయకుండా నిరోధించటం పెద్ద సవాలు. ఇక ఆకతాయిలు వాటిని ధ్వంసం చేసే ప్రమాదం కూడా ఉంది. దీంతో అన్ని ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేస్తారా, లేక రైల్వే సిబ్బంది నిఘా ఉన్న ప్రాంతాలకే పరిమితం చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.

జర్మనీ టాప్‌..: పట్టాల మీద ప్యానెల్స్‌ ఏర్పాటు చేసే విషయంలో జర్మనీ ముందుంది. ఇక్కడ 200 కి.మీ. నిడివిలో పట్టాలపై 20 మెగావాట్‌ సామర్థ్యంతో ఫలకాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్తు జర్మన్‌ గ్రిడ్‌కు సరఫరా చేస్తోంది. స్విట్జర్లాండ్‌లో ఈ పద్ధతిలో 18 మెగావాట్లు ఉత్పత్తి చేస్తున్నారు. యూకేలో గతేడాది, ఫ్రాన్స్‌లో ఈ సంవత్సరం మొదలుపెట్టారు. అమెరికా కూడా చేపట్టింది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, స్పెయిన్, రొమేనియా, ఇండోనేషియా, బెల్జియం దేశాల్లో ప్రయోగాత్మక పరిశీలన దశల్లో ఉన్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.