కాఫీ ఎప్పుడు, ఎలా తాగాలంటే.

చాలామంది కాఫీ తాగడం అనేదాన్ని ఒక అనారోగ్యకరమైన అలవాటుగానే భావిస్తారు. అయితే కాఫీ సేవనం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ ప్రయోజనాల్లో ఎక్కువ భాగం పాలీఫెనాల్స్‌ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్ల వల్లనే లభిస్తాయని, ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్నాయని రిజిస్టర్డ్‌ డైటీషియన్, ఫుడ్‌ ట్రైనర్స్‌ వ్యవస్థాపకురాలు లారెన్‌ స్లేటస్‌ అంటున్నారు.


ఇందులోని యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించగలవని, హిస్పానిక్‌ ఫుడ్‌ కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకురాలు సిల్వియా క్లింగర్‌ సైతం చెబుతున్నారు. శరీరంలోని అనేక విభిన్న అవయవాలకు మద్దతు ఇస్తుంది. కాఫీ అందించే ప్రధాన ప్రయోజనాలు.. ఓ ఆంగ్ల మీడియా వేదికగా వీరు చెబుతున్న ప్రకారం…

-కాఫీ (Coffee) స్వల్పకాలిక ఏకాగ్రతకు సహాయపడటం తో పాటు దీర్ఘకాలంలో ఇది న్యూరోప్రొటెక్టివ్‌గా కూడా ఉంటుంది. చురుకుదనం, జ్ఞాపకశక్తి సహా మెదడు పనితీరును మెరుగుపరచడంతో పాటు,డిప్రెషన్, పార్కిన్సన్స్‌ అల్జీమర్స్‌ వంటి న్యూరోడిజెనరేటివ్‌ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.

– కాఫీ తీసుకోవడం గుండె జబ్బులతో పాటు స్ట్రోక్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె సమస్యల కారణంతో మరణించే ప్రమాదాన్ని కూడా నివారిస్తుంది.

– కాలేయ వ్యాధి, ముఖ్యంగా ఫ్యాటీ లివర్, సిర్రోసిస్‌ వంటివి నివారిస్తుంది. అలాగే కాలేయం, కొలొరెక్టల్‌ క్యాన్సర్‌ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

-కాఫీ తాగేవారికి టైప్‌ 2 డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

కాఫీ మితంగా.. ప్రయోజనాలు అమితంగా…
ఈ ప్రయోజనాలు లభించాలంటే మితమైన కాఫీ తీసుకోవడం అవసరం. అంటే షుమారుగా రోజుకు 400 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కెఫిన్‌ తీసుకోకూడదు. అయితే ఈ పరిమాణం అనేది వ్యక్తుల్ని బట్టి వారి శారీరక స్థాయిలను బట్టి మారవచ్చు.

– ఆరోగ్య ప్రయోజనాలను పెంచడానికి మూడు లేదా నాలుగు కప్పులు లేదా దాదాపు 300 నుంచి 400 మిల్లీగ్రాముల కాఫీ వరకూ ఓకే. దీని వల్ల హాని కంటే ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చే అవకాశం ఎక్కువ.
– చాలా మంది విశ్వసించినట్టుగా కాఫీ డీహైడ్రేట్‌ చేయదు. కెఫీన్‌ తేలికపాటి మూత్రవిసర్జన ప్రభావాన్ని కలిగి ఉండి ఎక్కువగా మూత్ర విసర్జనకు కారణమవుతుంది. అయితే కాఫీలోని నీటి శాతం ఈ ప్రభావాన్ని భర్తీ చేస్తుంది.

-‘చక్కెర, ప్రాసెస్‌ చేసిన నూనెలు తీపి పదార్థాలు లాగా కాకుండా కాఫీ, దానికదే సహజమైనది, కల్తీ లేనిది, అందువల్లే పలు ప్రయోజనాలను కలిగి ఉంది. అదనపు కొవ్వు, కేలరీలు చక్కెరను జోడించడం కాఫీని అధిక కేలరీల పానీయంగా మారుస్తాయి. తద్వారా బరువు, ఆరోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉంటుంది.

ఓట్‌ మిల్క్, సోయా మిల్క్, లాక్టోస్‌ లేని పాలు అయితే ఓకే. దాల్చిన చెక్క, వనిల్లా లేదా బాదం సారం, తియ్యని కోకో పౌడర్, స్టెవియా, మాంక్‌ఫ్రూట్‌ తక్కువ మొత్తంలో తేనె లేదా మాపుల్‌ సిరప్‌ వంటి సహజ పదార్ధాలను మేళవించవచ్చు. తక్కువ ఆమ్లత్వం, తియ్యని రుచిని కలిగి ఉండే కోల్డ్‌ బ్రూ కాఫీని ప్రయత్నించవచ్చు. బ్లాక్‌ కాఫీని తాగడం దుర్లభంగా భావించే వారికి ఇది ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం.

కాఫీ తాగడానికి సరైన సమయం..?
నిద్రకు అంతరాయం కలగకుండా ఉండటానికి, ఉదయం పూట కాఫీ తాగడం ఉత్తమం. ‘కాఫీకి ఎక్కువ అర్ధ-జీవితకాలం ఉంటుంది, అంటే’ఇది చాలా మంది అనుకున్నదానికంటే ఎక్కువ కాలం మన శరీర వ్యవస్థలో ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం తర్వాత కాఫీని నిలిపివేయాలి. ఉదయం 9:30 నుంచి 11:30 వరకు సమయం సహజ కార్టిసాల్‌ కదలికలకు అంతరాయం కలిగించకుండా శక్తిని పెంచడానికి అనువైనది.

వ్యాయామం (Exercise) చేసే ముందు కూడా కాఫీ తాగొచ్చు. ఎందుకంటే ఇది పనితీరు ఓర్పును మెరుగుపరచడంలో సహకరిస్తుంది. అయితే ఖాళీ కడుపుతో కాఫీ తాగకూడదు. ఇది కడుపులోని పొరలకు ఇబ్బంది కలిగిస్తుంది. యాసిడ్‌ రిఫ్లక్స్‌ లేదా ఉబ్బరానికి దారితీస్తుంది. ఇది కార్టిసాల్‌ స్థాయిలను కూడా పెంచుతుంది, ఈ సమస్యలను నివారించడానికి కాఫీ తాగే ముందు గుడ్లు, అవకాడో టోస్ట్, తృణధాన్యాలు వంటి అల్పాహారం తినాలి. అలాగే భోజనానికి ముందు కాఫీ తాగకూడదు. ఎందుకంటే ఇది శరీరం ఇనుమును గ్రహించనీయకుండా ఆటంకం కలిగిస్తుంది.

(గమనిక:ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం)

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.