ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హమీలను నెరవేరుస్తూ.. మెగా డీఎస్సీ, టెట్ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) రాసిన అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ శుభవార్త చెప్పింది.
అక్టోబర్ సెషన్‌కు సంబంధించిన టెట్-2025 ప్రిలిమినరీ కీని అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. డిసెంబర్ 10వ తేదీన ప్రారంభమైన ఈ ఆన్లైన్ పరీక్షలు రేపటితో (డిసెంబర్ 21) ముగియనున్న నేపథ్యంలో, ఇప్పటికే పూర్తయిన సబ్జెక్టుల వారీగా ప్రాథమిక కీ (Primary key)లను విడుదల చేశారు. అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్లను, ఆన్సర్ కీలను అధికారిక వెబ్సైట్ https://tet2dsc.apcfss.in/ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
అలాగే ప్రభుత్వం విడుదల చేసిన ప్రాథమిక కీపై అభ్యర్థులకు ఏవైనా సందేహాలు, అభ్యంతరాలు ఉంటే, వాటిని ఆన్లైన్ ద్వారా సమర్పించే అవకాశం కల్పించారు. డిసెంబర్ 24వ తేదీ లోపు తగిన ఆధారాలతో వెబ్సైట్లో అభ్యంతరాలు తెలపాల్సి ఉంటుంది. అభ్యర్థుల నుంచి వచ్చిన ఫిర్యాదులను నిపుణుల కమిటీ పరిశీలించిన అనంతరం తుది కీని విడుదల చేయనున్నారు. పరీక్షలు ముగిసిన వెంటనే కీ విడుదల కావడంతో అభ్యర్థులు తమ మార్కులను అంచనా వేసుకునే వీలు కలిగింది.

































