మీకు ఎప్పుడైనా అపరిచిత నంబర్ల నుండి కాల్ వచ్చిందా? మీరు ఫోన్ ఎత్తి ‘హలో’ అన్నా అవతలి నుండి ఎటువంటి శబ్దం రాకుండా నిశ్శబ్దంగా ఉందా? చాలామంది దీనిని నెట్‌వర్క్ సమస్య అనుకుని వదిలేస్తారు లేదా ఆ నంబర్‌కు తిరిగి ఫోన్ (Call Back) చేస్తారు.
ఒకవేళ మీరు కూడా ఇలా చేస్తున్నట్లయితే, వెంటనే జాగ్రత్త పడండి!
టెలికమ్యూనికేషన్ విభాగం (DoT) మొబైల్ వినియోగదారులను ఇలాంటి ‘సైలెంట్ కాల్స్’ (Silent Calls) గురించి తీవ్రంగా హెచ్చరించింది.
ఏమిటీ ‘సైలెంట్ కాల్’ స్కామ్? టెలికమ్యూనికేషన్ శాఖ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను షేర్ చేస్తూ.. అపరిచిత నంబర్ల నుండి వచ్చే నిశ్శబ్ద కాల్స్ కేవలం నెట్‌వర్క్ లోపం కాదని, ఇది స్కామర్ల ముందస్తు ప్రణాళిక అని వివరించింది.
సైబర్ నేరగాళ్లు మీ నంబర్ యాక్టివ్‌గా ఉందో లేదో తెలుసుకోవడానికి ఇలాంటి కాల్స్ చేస్తారు. మీరు ఫోన్ ఎత్తినప్పుడు, మీరు ఎంత సమయంలో స్పందిస్తున్నారు, మీ వాయిస్ ఎలా ఉంది, మీ వెనుక వాతావరణం (Background noise) ఎలా ఉంది అనే విషయాలను వారు నోట్ చేసుకుంటారు. తద్వారా మీ ప్రొఫైల్‌ను సిద్ధం చేసి, వారి ‘టార్గెట్ లిస్ట్’లో మీ నంబర్‌ను చేరుస్తారు.
ఫోన్ ఎత్తిన తర్వాత ఏం జరుగుతుంది? మీ నంబర్ యాక్టివ్‌గా ఉందని స్కామర్లకు నిర్ధారణ అయిన తర్వాత అసలు ఆట మొదలవుతుంది. కొన్ని రోజుల తర్వాత మీకు రకరకాల నంబర్ల నుండి కాల్స్, మెసేజ్‌లు వస్తాయి. మీ బ్యాంక్ అకౌంట్ లేదా క్రెడిట్ కార్డ్ బ్లాక్ అయ్యిందని భయపెట్టడం, తాము పోలీసులమని లేదా బ్యాంక్ అధికారులమని చెప్పి మిమ్మల్ని మోసం చేయడం ప్రారంభిస్తారు.
మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి? ఈ ముప్పు నుండి తప్పించుకోవడానికి ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది:
- కాల్ బ్యాక్ చేయకండి: అపరిచిత నంబర్ నుండి కాల్ వచ్చి నిశ్శబ్దంగా ఉంటే, తిరిగి ఆ నంబర్‌కు ఫోన్ చేయవద్దు. ఇది చాలా ప్రమాదకరం.
- చక్షు (Chakshu) పోర్టల్: ఇటువంటి అనుమానాస్పద నంబర్లను వదిలేయకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సంచార్ సాథి’ (Sanchar Saathi) పోర్టల్‌లో లేదా ‘చక్షు’ (Chakshu) ద్వారా ఫిర్యాదు చేయండి.
- సైబర్ క్రైమ్ రిపోర్ట్: ఒకవేళ ఎవరైనా ఓటీపీ (OTP), పాస్‌వర్డ్ అడిగితే వెంటనే cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయండి.


































