చెంఘిజ్ ఖాన్: ప్రపంచాన్ని గెలుస్తూ భారత్ వరకు వచ్చిన ఈయన ఎందుకు వెనక్కి తిరిగి వెళ్లిపోయారు?

సుమారు 800 ఏళ్ల కిందట మంగోల్ సంచారజాతికి చెందిన ఓ వ్యక్తి, నల్ల సముద్రం నుంచి పసిఫిక్ మహా సముద్రం వరకు ఒక సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించారు.


ఆయన పేరు టెముజిన్. తర్వాత చెంఘిజ్ ఖాన్‌గా ఆయన ప్రపంచవ్యాప్తంగా పేరు పొందారు.

1162లో బైకాల్ సరస్సుకు తూర్పు ప్రాంతంలో ఒక ధైర్యవంతుడైన సంచారికి ఒక బాలుడు జన్మించాడు.

పుట్టినప్పుడు ఆ పిల్లాడి అరచేతిలో ఒక రక్తపు గడ్డ ఉందని, ఇది ఆ పిల్లాడు ఒక మహా విజేతగా అవతరిస్తాడని చెప్పడానికి సూచికని ప్రజలు భావించినట్లు ‘ద సీక్రెట్ హిస్టరీ ఆఫ్ మంగోల్’ పుస్తకంలో ప్రస్తావించారు.

తండ్రికి శత్రువులు విషమిచ్చి చంపడంతో చాలా చిన్నతనంలోనే ఆ పిల్లవాడు తండ్రి అండను కోల్పోయాడు.

‘దాదాపు ఆఫ్రికా ఖండం విస్తీర్ణంతో సమానమైన సామ్రాజ్యం’

పేరులో ‘ఖాన్’ ఉన్నందున చాలామంది ఆయన్ను ముస్లిం అనుకునేవారు. కానీ, ఇక్కడ ఖాన్ అంటే ఒక బిరుదు. గౌరవానికి సూచిక. ఆయన ఒక మంగోల్ వ్యక్తి. షామానిజం ధర్మాన్ని పాటించేవారు. షామానిజంలో ఆకాశాన్ని ఆరాధించే సంప్రదాయం ఉండేది.

చెంఘిజ్ ఖాన్ బాల్యమంతా పేదరికం, అవమానం, అజ్ఞానంతో గడిచింది.

అయితే, 50 ఏళ్ల వయస్సులో ఆయన విజయాల పరంపర, ఆయన్ను ప్రపంచంలోని మహాయోధుల సరసన నిలబెట్టింది.

ఆయన నేతృత్వంలో మంగోల్ రాజవంశం ఉద్భవించింది. ఈ రాజవంశం చైనా, మధ్య ఆసియా, ఇరాన్, తూర్పు యూరప్, రష్యాలోని ఒక పెద్ద భూభాగాన్ని పాలించింది.

చెంఘిజ్ ఖాన్ సైన్యాలు ఆస్ట్రియా, ఫిన్‌లాండ్, క్రొయేషియా, హంగరీ, పోలాండ్, వియత్నాం, బర్మా, జపాన్, ఇండోనేసియా దాకా వెళ్లాయి.

”చెంఘిజ్ ఖాన్ సామ్రాజ్యం కోటీ 20 లక్షల చదరపు మైళ్ల మేర విస్తరించింది. ఇది దాదాపు ఆఫ్రికా ఖండం విస్తీర్ణానికి సమానం. ఉత్తర అమెరికా ఖండం విస్తీర్ణం కంటే ఎక్కువ. దీనితో పోలిస్తే రోమన్ సామ్రాజ్యం చాలా చిన్నది” అని ‘ఇపాక్ డిర్ మంగోలన్’ అనే పుస్తకంలో ఎఫ్‌ఈ క్రౌజ్ రాశారు.

అలెగ్జాండర్ ది గ్రేట్ (సికందర్ మహాన్) వద్ద తన తండ్రి ఫిలిప్ అందించిన భారీ యుద్ధ సామగ్రి ఉండేది.

జూలియస్ సీజర్‌కు 300 ఏళ్ల పురాతన రోమన్ సైనిక ఆధిపత్య చరిత్ర ఉంది.

ఫ్రెంచ్ విప్లవం తర్వాత లభించిన ప్రజా మద్దతుతో నెపోలియన్ అధికారాన్ని చలాయించగలిగారు.

వీరికి భిన్నంగా, చెంఘిజ్ ఖాన్ సొంతంగా తన విధివిధానాలను రూపొందించుకోవాల్సి వచ్చింది. అనేక రాజకీయ, సామాజిక సమస్యలతో పోరాడుతూ, చాలా కష్టపడి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని చెంఘిజ్ ఖాన్ నిర్మించుకున్నారు.

సవతి సోదరుడి హత్య

చెంఘిజ్ ఖాన్ యవ్వనంలోకి రాగానే పక్షులను వేటాడే కళను నేర్చుకోవడం ప్రారంభించారు. ఆ కాలంలో కాబోయే నాయకుడికి ఉండాల్సిన కీలకమైన లక్షణంగా దీన్ని పరిగణించేవారు. కానీ, చెంఘిజ్ ఖాన్ తన జీవితంలో ఎప్పుడూ చదవడం, రాయడం నేర్చుకోలేదు.

13 ఏళ్ల వయస్సులోనే సవతి సోదరుడైన బెహ్తర్‌ను చెంఘిజ్ ఖాన్ హత్య చేశారు.

”అంత చిన్న వయస్సులో చేసిన ఈ హత్య, చెంఘిజ్ ఖాన్‌లో పుట్టుకతోనే ఉన్న క్రూరత్వాన్ని తెలియజేస్తుంది. టీనేజీలోనే అతనికి భవిష్యత్ గురించే ఆలోచించే సామర్థ్యం అలవడింది. తన తండ్రికి బెహ్తర్ పెద్ద కొడుకు కావడం వల్ల, వారసుడిగా తనకంటే అతనికే ఎక్కువ హక్కు ఉంటుందని అర్ధం చేసుకుని, బెహ్తర్‌ను ప్రత్యర్థిగా భావించి చెంఘిజ్ ఖాన్ అతనిని హత్య చేశాడు” అని చెంఘిజ్ ఖాన్- ద మ్యాన్ హూ కాంకర్డ్ ద వరల్డ్ అనే పుస్తకంలో ఫ్రాంక్ మైక్లిన్ రాశారు.

క్రమంగా చెంఘిజ్ ఖాన్ ఒక యువ సైన్యాధిపతిగా తన స్థానాన్ని పదిలం చేసుకోవడం మొదలుపెట్టారు. ఆయన దాదాపు తన జీవితమంతా డేరాలు, యుద్ధాల్లోనే గడిపారు. దీనివల్ల పాలనపై దృష్టి పెట్టడానికి ఆయనకు సమయమే దొరకలేదు.

”చెంఘిజ్ ఖాన్ గొప్ప సామర్థ్యాలు కలిగిన వ్యక్తి. తన సైన్యాన్ని ముందుండి నడిపించాడు. ఆయన ఖొరాసాన్ వచ్చినప్పటికి వయసు 65 ఏళ్లు. పొడవుగా, దృఢంగా ఉండేవాడు. ముఖంపై చాలా తక్కువ వెంట్రుకలు ఉండేవి. అప్పటికే అవి తెల్లబడ్డాయి. అతని కళ్లు పిల్లి కళ్లలా ఉండేవి. శరీరంలో అపారమైన శక్తి ఉండేది. శత్రువుల దృష్టిలో ఆయనకంటే క్రూరమైన వ్యక్తి మరొకరు ఉండరు” అని ఇరాన్ చరిత్రకారుడు మిన్హాజ్ అల్ సిరాజ్ జుజ్వానీ రాశారు.

విషపు బాణంతో గాయపడి..

జమూగాతో జరిగిన యుద్ధంలో చెంఘిజ్ ఖాన్‌ మెడకు ఒక విషపూరితమైన బాణం తగిలింది.

”ఆ కాలంలో బాణాలకు పాము విషాన్ని పూసేవారు. ఇవి రంపపు పళ్ల ఆకారంలో ఉండేవి. శరీరంలోకి దిగిన తర్వాత విషాన్ని వేగంగా శరీరంలోకి వ్యాపించేలా చేసేవి. దీనికి చికిత్సగా గాయాన్ని కడిగి, గాయపడిన వ్యక్తికి పాలు తాగించేవారు. కానీ చెంఘిజ్ ఖాన్‌కు తీవ్రంగా గాయమైంది. బాణం తగలడం వల్ల అతని మెడలోని ఒక ప్రధాన రక్తనాళం తెగిపోయి రక్తం ధారగా కారింది. అప్పుడు కమాండర్ జెల్మే, చెంఘిజ్ ఖాన్ ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించాడు. రక్తస్రావాన్ని ఆపలేకపోయినా, చెంఘిజ్ మెడ నుంచి విషపూరితమైన రక్తాన్ని జెల్మే తన నోటితో పీల్చి బయటకు ఉమ్మివేయడం ప్రారంభించాడు” అని ఫ్రాంక్ మైక్లిన్ రాశారు.

కాసేపటికి చెంఘిజ్ ఖాన్ స్పృహలోకి వచ్చారు. చెంఘిజ్ ఖాన్ కోసం పాలు తెప్పించి అతని ప్రాణాలను జెల్మే కాపాడారు.

కానీ, చెంఘిజ్ ఖాన్ అతనిపట్ల కరుకుగా వ్యవహరిస్తూ, ‘నువ్వు ఆ విషపూరితమైన రక్తాన్ని కాస్త దూరం ఉమ్మివేయలేవా?’ అని అన్నారు.

చెంఘిజ్ ఖాన్‌లో ఎన్నో అవగుణాలు

చెంఘిజ్ ఖాన్ వ్యక్తిత్వంలో ఎన్నో చీకటి కోణాలు ఉండొచ్చు. కానీ, ఆయన రాజకీయ నైపుణ్యంపై ఎవరికీ ఎలాంటి సందేహం లేదని చాలామంది చరిత్రకారులు నమ్ముతారు.

”సైనిక వ్యూహరచనలో చెంఘిజ్ అసమాన మేధావి. కానీ యుద్ధ కమాండర్‌గా అంత ప్రభావశీలి కాదు. ప్రజల మెదడు, మానవ మనస్తత్వాన్ని చదవడంలో ఆయనకు అద్భుతమైన సామర్థ్యం ఉండేది. ఆయన ఊహాశక్తి కూడా ప్రశంసనీయం. ఎన్నో వ్యక్తిగత విషాదాల నుంచి కోలుకుని పైకి వచ్చాడు. దూరదృష్టి గలవాడు. సంయమనం కలిగినవాడు, తెలివైనవాడు. అయితే, అతనిలో క్రూరత్వం, కృతజ్ఞత లేకపోవడం, ప్రతీకారేచ్ఛ వంటి దుర్గుణాలు కూడా ఉన్నాయి” అని రష్యా చరిత్రకారుడు జార్జ్ వెర్నాడ్‌స్కీ తన పుస్తకం ‘మంగోల్స్ అండ్ రష్యా’లో రాశారు.

మర్కిట్ తెగతో జరిగిన యుద్ధంలో చెంఘిజ్ భార్య బోర్తే కిడ్నాప్ అయ్యారు.

‘ద సీక్రెట్ లైఫ్ ఆఫ్ మంగోల్స్’ పుస్తకంలో భార్య విషయంలో చెంఘిజ్ తీరు పట్ల విమర్శిస్తూ రాశారు.

చెంఘిజ్ తల్లి హోలున్ సహా ఇతర మహిళలు మర్కిట్ తెగ నుంచి తప్పించుకున్నప్పటికీ, భార్య వారి చేతికి చిక్కడానికి చెంఘిజ్ ఖానే కారణమని అందులో రాశారు. బోర్తే నడిపే గుర్రంపై ఎక్కి చెంఘిజ్ పారిపోవడమే దీనికి కారణమని పేర్కొన్నారు.

సవతి సోదరుడు బెహ్తర్‌ను చంపినప్పుడు చెంఘిజ్‌ను అసహ్యించుకుంటూ జంతువు, సైతాన్ అని ఆయన తల్లి తిట్టినట్లు పుస్తకంలో పేర్కొన్నారు.

పట్టలేనంత కోపం

చెంఘిజ్ ఖాన్ కోపంలో తరచుగా నిగ్రహాన్ని కోల్పోయేవారు. 1220లలో ట్రాన్సోక్సియానాను జయించిన తర్వాత చెంఘిజ్ ఖాన్, పశ్చిమ ఆసియాలోని ముస్లిం యువరాజులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడానికి ఒక అనువాదకుడిని, గుమస్తాను నియమించుకున్నారు.

మిన్హాజ్ సిరాజ్ జుజ్దానీ తన తబాకత్-ఎ-నస్రీ పుస్తకంలో ఇలా రాశారు.

”మోసుల్ యువరాజు, సిరియాపై దాడి చేయబోతున్నారనే వార్త చెంఘిజ్‌కు తెలిసింది. ‘ఆ సాహసం చేయొద్దు’ అంటూ మోసుల్ యువరాజుకు తన గుమాస్తాతో ఒక లేఖ రాయించారు. కానీ, ఆ గుమస్తా దౌత్యపరంగా ఆలోచించి, లేఖలో కాస్త మృదువైన భాషను ఉపయోగించారు. ఇస్లామిక్ ప్రపంచంలో ఉన్న గౌరవప్రదమైన పదాలను మోసుల్ యువరాజు కోసం లేఖలో గుమాస్తా ఉపయోగించారు. ఆ లేఖను మంగోలియా భాషలో చదివి వినిపించినప్పుడు చెంఘిజ్ ఖాన్ కోపంతో ఊగిపోయారు.

”నువ్వు దేశద్రోహివి. ఈ లేఖ చదివిన తర్వాత మోసుల్ యువరాజు మరింత గర్విష్టిగా మారుతాడు” అని అన్నారు. ఆయన చప్పట్లు కొట్టి తన సైనికుల్లో ఒకరిని పిలిచి గుమాస్తాను చంపమని ఆదేశించాడు” అని పుస్తకంలో రాశారు.

క్రూరత్వంతో పాటు దాతృత్వం

చెంఘిజ్ ఖాన్ క్రూరత్వానికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి. ఆయన కాలంలో ఒక నగరాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత యువకులు, శారీరకంగా బలంగా ఉన్నవారిని తప్ప మిగతా అందరినీ బాణాలు వేసి చంపడం సర్వసాధారణం.

చెంఘిజ్ ఖాన్‌కు తన మనవడు, మనవరాళ్లంటే చాలా ఇష్టం. బామియాన్ ముట్టడి సమయంలో తన మనవడు చనిపోగా, ఆ ప్రాంతంలోని కోళ్లు, పిల్లులు, కుక్కలతో సహా అన్నింటినీ చంపాలని చెంఘిజ్‌ ఖాన్ ఆదేశించినట్లు పాల్ రాచినివ్‌స్కీ తన పుస్తకం ‘చెంఘిజ్ ఖాన్: హిజ్ లైఫ్ అండ్ లెగసీ’లో రాశారు.

అయితే, అకస్మాత్తుగా దాతృత్వాన్ని కూడా ప్రదర్శించేవాడట చెంఘిజ్.

ఒకసారి, మండుటెండలో చెమటలలతో కష్టపడుతున్న రైతును చూసి చెంఘిజ్ ఖాన్ చలించిపోయారట. వెంటనే ఆ రైతు చెల్లించాల్సిన పన్నులన్నింటినీ రద్దు చేయడమే కాకుండా, ఆయనకు వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించారు.

క్రూరత్వాన్ని సమర్థించడం

చెంఘిజ్ ఖాన్ క్రూరుడు, ప్రతీకారేచ్ఛ కలిగినవాడు, విశ్వాసఘాతకుడు అని చరిత్రకారులంతా దాదాపు ఏకగ్రీవంగా అంగీకరించారు. కొందరు ఆయనను మానసిక రోగి అని కూడా అంటుంటారు.

కేవలం దేశద్రోహులను, నమ్మకద్రోహులను మాత్రమే చంపుతానంటూ తన చర్యను చెంఘిజ్ ఖాన్ సమర్థించుకునేవారని వారు భావిస్తారు.

”ఈ విషయంలో అతని సహచరులు అతన్ని అసాధారణ వ్యక్తిగా పరిగణించలేదు. ఎందుకంటే 21వ శతాబ్దంలో మనం నేరాలుగా భావించే విషయాలన్నీ 13వ శతాబ్దంలో చాలా మామూలు చర్యలుగా భావించేవారు. క్రైస్తవ ఆక్రమణదారులు కూడా దీనికి అతీతులు కారు. క్రూరత్వం విషయంలో 16వ శతాబ్దంలో ఇంగ్లండ్‌కు చెందిన హెన్రీ VIII కంటే చెంఘిజ్ ఖాన్ క్రూరత్వం తక్కువగా ఉంది. క్రూరత్వంలో తామర్లేన్‌, చైనీయులు కూడా చెంఘిజ్‌ ఖాన్‌ను మించిపోయారు” అని వెర్నాడ్‌స్కీ రాశారు.

‘లొంగిపోండి లేదా చనిపోండి’ అనే తన విధానం శత్రువులు వారి ప్రాణాలను కాపాడుకోవడానికి అవకాశం ఇస్తుందని చెంఘిజ్ ఖాన్ ఎప్పుడూ చెప్పుకునేవారు.

తాను ఇచ్చిన ఈ అవకాశాన్ని వారు ఉపయోగించుకోనప్పుడు మాత్రమే వారి ప్రాణాలను తీసేవాడినని అనేవారు.

భారత సరిహద్దు నుంచి తిరిగొచ్చిన చెంఘిజ్ ఖాన్

చెంఘిజ్ ఖాన్ 1211 నుంచి 1216 వరకు ఈ అయిదేళ్ల కాలాన్ని చైనాను జయించాలనే లక్ష్యంలోనే గడిపారు.

జలాలుద్దీన్‌ను వెంటాడుతూ వెంబడిస్తూ చెంఘిజ్ ఖాన్ భారతదేశ సరిహద్దును చేరుకున్నారు. చెంఘిజ్ ఖాన్, జలాలుద్దీన్ దళాల మధ్య చివరి యుద్ధం సింధు నది ఒడ్డున జరిగింది.

జలాల్ సైన్యాన్ని చెంఘిజ్ ఖాన్ మూడువైపుల నుంచి చుట్టుముట్టారు. వారి వెనుక సింధు నది ప్రవహిస్తోంది.

”మంగోలుల ఒత్తిడి పెరగ్గానే జలాలుద్దీన్ తన గుర్రంతో 180 అడుగుల లోతైన సింధు నదిలోకి దూకాడు. 250 గజాల వెడల్పు దాటి, జలాలుద్దీన్ నదికి అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. జలాలుద్దీన్ ధైర్యాన్ని చూసిన చెంఘిజ్ ఖాన్ అతన్ని వదిలేసి, అతని సహచరులను లక్ష్యంగా చేసుకున్నాడు. వారిలో చాలామందిని చంపాడు. జలాల్ కుమారులు, మగవారైన బంధువులందరికీ చెంఘిజ్ ఖాన్ మరణశిక్ష విధించాడు” అని మొహమ్మద్ నెసావీ రాశారు.

జలాలుద్దీన్ అక్కడి నుంచి దిల్లీ వైపు వెళ్లారు. కానీ మంగోల్ దాడి భయం కారణంగా దిల్లీ సుల్తాన్ ఇల్‌టుట్ మిష్ ఆయనకు అధికారిక ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించారు.

భారత్‌లో వేడితో ఇబ్బందిపడిన చెంఘిజ్ ఖాన్

జలాల్ దిల్లీ చేరుకోలేదు. కానీ చెంఘిజ్ తనను వెంబడించే ఆలోచనను విరమించుకునే వరకు జలాల్ భారత్‌లోనే ఉన్నారు.

చెంఘిజ్ ఖాన్ తన దేశమైన మంగోలియాకు తిరిగి వెళ్లాడని కచ్చితమైన సమాచారం తెలిసిన తర్వాతే జలాలుద్దీన్ పడవలో సింధు నది ముఖద్వారం నుంచి బయలుదేరి సముద్ర మార్గం ద్వారా ఇరాన్ చేరుకున్నారు.

చెంఘిజ్ ఖాన్ గత చరిత్రను గమనించినవారు జలాలుద్దీన్‌ను వెంబడించే ఆలోచనను విరమించుకోవడం, సైన్యాన్ని భారత్ లోపలికి పంపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

”భారత్‌లోని వేడిని చెంఘిజ్ ఖాన్ భరించలేరు. అందుకే చెంఘిజ్ ఖాన్ జనరల్స్ తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు” అని వింక్ తన పుస్తకం ‘స్లేవ్ కింగ్స్ అండ్ ద ఇస్లామిక్ కాంకెస్ట్’లో రాశారు.

గుర్రాలకు మేత కొరత

చెంఘిజ్ ఖాన్ ఎదుర్కొన్న మరో సమస్య గుర్రాలు. పదివేల గుర్రాలున్న మంగోల్ సైన్యానికి 250 టన్నుల మేత, 250,000 గాలన్ల నీరు అవసరమని యాత్రికుడు ఇబన్ బటూటా కూడా ప్రస్తావించారు.

సింధ్, ముల్తాన్‌లలో నీరు అందుబాటులో ఉంది. కానీ మేత లేదు.

”చెంఘిజ్ ఖాన్ సైనికుల్లో చాలామంది ఈ ప్రాంతంలో జ్వరం, వ్యాధుల బారిన పడ్డారు. భారత్‌లోని అడవులు, పర్వతాల గురించి చెంఘిజ్ ఖాన్‌కు కచ్చితమైన నిఘా సమాచారం లేదు. చెంఘిజ్ ఖాన్ మూఢనమ్మకాలున్న వ్యక్తి. ఆయన సైనికులు ఒక ఖడ్గమృగాన్ని చూశారు. ఇది ముందుకు సాగడానికి చెడు శకునంగా పరిగణించారు. ఈ కారణాలతో చెంఘిజ్ ఖాన్ తన దేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు” అని ప్రాంక్ మైక్లిన్ రాశారు.

చెంఘిజ్ ఖాన్ చివరి సందేశం

1227 జులై నాటికి చెంఘిజ్ ఖాన్ ఆరోగ్యం బాగా క్షీణించింది. ఒకరోజు ఆయన తన కొడుకులను, నమ్మకస్తులైన సైన్యాధికారులను తన దగ్గరికి పిలిపించుకున్నారు.

చెంఘిజ్ ఖాన్‌ జ్వరంతో బాధపడుతున్నట్లుగా మంగోల్ ప్రజలకు చెప్పారు. కానీ, ఆయన మంచం దగ్గర నిలబడి ఉన్నవారికి, చెంఘిజ్ ఎక్కువ కాలం బతకరనే సంగతి తెలుసు.

”మరణశయ్యపై పడుకున్న చెంఘిజ్ ఖాన్ తన కుమారులతో ‘జీవితం చాలా చిన్నది. నేను మొత్తం ప్రపంచాన్ని జయించలేకపోయాను. మీరు ఈ పనిని పూర్తి చేయాలి. ప్రపంచంలోని అతిపెద్ద సామ్రాజ్యాన్ని మీకు అప్పగిస్తున్నాను. కేవలం ఒక పని చేయడం ద్వారా మీరు ఈ రాజ్యాన్ని రక్షించవచ్చు. అదేంటంటే మీరు ఐక్యంగా ఉండండి. మీలో మీరు పోరాడితే, ఈ సామ్రాజ్యం మీ చేతుల్లో నుండి జారిపోతుంది” అని చెప్పినట్లుగా ఆర్‌డీ థాక్స్‌టన్ తన పుస్తకం ‘ద హిస్టరీ ఆఫ్ మంగోల్స్’లో రాశారు.

ఆ విషయం చెప్పిన కాసేపటి తర్వాత చెంఘిజ్ ఖాన్ ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.