కెనరా బ్యాంక్‌ కొత్త యాప్‌.. ఏఐ ఫీచర్లతో..

డిజిటల్‌ చెల్లింపులను సురక్షితంగా చేసేందుకు ఉపయోగపడేలా ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్‌ కొత్తగా ‘కెనరా ఏఐ1పే’ పేమెంట్స్‌ యాప్‌ని ప్రవేశపెట్టింది.


యూపీఐ ప్లాట్‌ఫాం ద్వారా వేగవంతంగా, సురక్షితంగా పేమెంట్స్‌ చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని బ్యాంకు తెలిపింది.

నెలవారీగా ఖర్చులను విశ్లేషించుకునేందుకు స్పెండ్‌ అనలిటిక్స్, సులువుగా క్యూఆర్‌ స్కాన్‌ చేసేందుకు విడ్జెట్‌ సదుపాయం, తక్షణ నగదు బదిలీలు.. బిల్లుల చెల్లింపులు మొదలైన వాటికి యూపీఐ ఆటోపేలాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయని పేర్కొంది. అలాగే, పిన్‌ నంబరు ఎంటర్‌ చేయాల్సిన అవసరం లేకుండా చిన్న మొత్తాలను చెల్లించేందుకు వీలుగా యూపీఐ లైట్‌ ఫీచరు సైతం ఇందులో ఉన్నట్లు వివరించింది.

ఇదే యాప్‌లో మల్టీలెవల్భద్రతా వ్యవస్థను కూడా పొందుపరిచినట్లు కెనరా బ్యాంక్‌ వెల్లడించింది. ఏఐ ఆధారిత మోసాల గుర్తింపు (Fraud Detection) ద్వారా అనుమానాస్పద లావాదేవీలను తక్షణమే గుర్తించి వినియోగదారులను అప్రమత్తం చేసే విధంగా ఈ యాప్‌ను రూపొందించారు. బయోమెట్రిక్ లాగిన్‌, డివైస్‌ బైండింగ్‌, రియల్‌టైమ్ అలర్ట్స్ వంటి సదుపాయాలతో వినియోగదారుల ఖాతా భద్రత మరింత బలోపేతం అవుతుందని బ్యాంక్‌ అధికారులు తెలిపారు.

అలాగే, ఈ యాప్‌ ద్వారా వ్యక్తిగత వినియోగదారులతో పాటు వ్యాపారులు కూడా సులభంగా చెల్లింపులు స్వీకరించవచ్చని పేర్కొన్నారు. చిన్న దుకాణాలు, స్వయం ఉపాధి వ్యాపారులు డిజిటల్ చెల్లింపుల వైపు అడుగులు వేయడానికి ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కెనరా బ్యాంక్‌ స్పష్టం చేసింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.