మంచుదుప్పటి కప్పుకున్న ఎడారి దేశం.. ఎందుకీ వింత పరిస్థితి ?

ఎడారి దేశంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. విపరీతమన వేడి, పొడి వాతావరణం, ఇసుక తిన్నెలు, కనుచూపుమేర అంతా భూభాగమే కనిపిస్తుంది.


గొంతు ఎండిపోతున్నా తాగేందుకు దరిదాపుల్లో చుక్కనీరైనా లభించదు. సౌదీ అరేబియాలో దాదాపు వాతావరణం ఇలాగే ఉంటుంది. అలాంటి కంట్రీని ఇప్పుడు మంచు దుప్పటి కప్పేసింది. గడిచిన 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతలా అక్కడి వాతావరణంలో పెనుమార్పులు సంభవించాయి. ఇటీవలే అక్కడ భారీ వర్షాలు కురవడం ఒక వింతైతే.. ఇప్పుడు విపరీతంగా మంచు కురుస్తుండటం, తెల్లవారుజాము సమయాల్లో ఉష్ణోగ్రతలు జీరోకి పడిపోతుండటం స్థానిక ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే మైనస్ 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం గమనార్హం. గతంలో ఎన్నడూ లేని విధంగా వెలుగుచూస్తోన్న ఈ వాతావరణ మార్పులు భయాందోళనకు గురి చేస్తున్నాయి. సౌదీ అరేబియాలోని ఉత్తర, మధ్య ప్రాంతంలో ఈ అసాధారణమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి.

తబుక్ ప్రావిన్సులోని పర్వతాలు ఎప్పుడూ లేనంతలా మంచుతో కప్పబడి కనిపిస్తున్నాయి. 2600 మీటర్ల ఎత్తులో ఉన్న ట్రొజెనాపై మంచుతోపాటు వర్షం కురిసింది. హెయిల్ ప్రాంతంలో చలిగాలుల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిశాయి.ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ భిన్న వాతావరణ పరిస్థితులపై సౌదీ వాతావరణ కేంద్ర స్పందించింది. మేఘాలను చల్లని గాలులు ఢీ కొనడంతో ఈ వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయని పేర్కొంది. భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించే ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. కొన్నిప్రాంతాల్లో విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు చెప్పాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.