APSRTC.. కర్ణాటక టూర్: మురుడేశ్వర్, ఉడుపి, శృంగేరి చూడొచ్చు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వరుసగా ప్రత్యేక బస్సులను ప్రవేశపెడుతోంది. పర్యాటకాభివృద్ధి సంస్థతో పోటీ పడుతోంది. ఏపీటీడీసీ తరహాలోనే ప్రయాణికుల కోసం అనేక పర్యాటక కేంద్రాలకు బస్సులను అందుబాటులోకి తీసుకొని వస్తోంది.


వాటికి ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇదివరకు ఎప్పుడూ నడిపించని కొత్త రూట్లు, ఆధ్యాత్మిక-పర్యాటక కేంద్రాలకు బస్సులను నడిపిస్తోంది ఏపీఎస్ఆర్టీసీ.

తాజాగా మరో రెండు ప్యాకేజీలను ప్రకటించింది ఏపీఎస్ఆర్టీసీ. కర్ణాటక- మైసూరు యాత్ర, కాశీ-అయోధ్య యాత్ర పేరిట ఈ పర్యాటక ప్యాకేజీలు అందుబాటులోకి రానున్నాయి. జనవరి 20వ తేదీన కర్ణాటక- మైసూరు, ఫిబ్రవరి 7న సాయంత్రం 4 గంటలకు కాశీ-అయోధ్య యాత్రకు రాజమండ్రి నుంచి బస్సులు బయలుదేరి వెళ్లనున్నాయి. వీటికోసం సూపర్ లగ్జరీ ప్రత్యేక బస్సులను వినియోగించనుంది ఏపీఎస్ఆర్టీసీ.

కర్ణాటక-మైసూరు..

మొత్తం తొమ్మిదిరోజుల పాటు సాగే యాత్ర ఇది. 14 పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనంతో ఈ టూర్ మొదలవుతుంది. రాజమండ్రి నుంచి బయలుదేరే సూపర్ లగ్జరీ బస్సు తొలుత శ్రీశైలం చేరుకుంటుంది. అక్కడ దర్శనానంతరం మహానంది, మంత్రాలయానికి చేరుకుంటుంది. అక్కడి నుండి కర్ణాటకలో ప్రవేశిస్తుంది. చారిత్రాత్మక హంపి, గోకర్ణ, మురుడేశ్వర్, కొల్లూరు, ఉడిపి, శృంగేరి, హొరనాడు, ధర్మస్థల, కుక్కే సుబ్రహ్మణ్య, శ్రీరంగపట్నం, మైసూర్ ఇందులో ఉన్నాయి.

ఈ యాత్రకు ఒక్కొక్కరు చెల్లించాల్సిన ఛార్జీ 11,500 రూపాయలు. యాత్రలో అన్ని రోజులు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారాన్ని ఏపీఎస్ఆర్టీసీ అధికారులే ఏర్పాటు చేస్తారు. భోజన సదుపాయంతో కలిపి ఈ ఛార్జీని నిర్ధారించారు. ఎక్కడైనా విశ్రాంతి గదులు తీసుకుంటే దాని కయ్యే అదనపు ఖర్చులు భక్తులే భరించాల్సి ఉంటుంది.

కాశీ- అయోధ్య యాత్ర..

మొత్తం 11 రోజుల పాటు సాగే యాత్ర ఇది. 13 పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ తో యాత్ర మొదలవుతుంది. రాజమండ్రి నుంచి బయలుదేరే బస్సు తొలుత భువనేశ్వర్ కు చేరుకుంటుంది. అనంతరం పూరి జనార్ధనుడి దర్శనం చేసుకోవచ్చు. దీని తర్వాత కోణార్క్ లోని సూర్యదేవాలయం, జాజ్ పూర్, ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమం, కాశీ, అయోధ్య, నైమిశారణ్యం, గయ, బుద్ధగయను దర్శించవచ్చు. అనంతరం తిరుగుముఖం పడుతుంది బస్సు.

మహాశివరాత్రి పర్వదినం రోజున కాశీవిశ్వేశ్వరుని దర్శించుకోవడం ఈ ప్యాకేజీ హైలైట్. తిరిగి వచ్చేటప్పుడు శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి, శ్రీకుర్మంతో పాటు అన్నవరం క్షేత్రాలను సందర్శించవచ్చు. ఈ యాత్రకు ఒక్కొక్కరు చెల్లించాల్సిన ఛార్జీ 13,000 రూపాయలు. యాత్రలో అన్ని రోజులు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారాన్ని ఏపీఎస్ఆర్టీసీ అధికారులే ఏర్పాటు చేస్తారు. భోజన సదుపాయంతో కలిపి ఈ ఛార్జీని నిర్ధారించారు. ఎక్కడైనా విశ్రాంతి గదులు తీసుకుంటే దాని కయ్యే అదనపు ఖర్చులు భక్తులే భరించాల్సి ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.