రైలు ప్రయాణికులకు షాక్: పెరిగిన టికెట్ ధరలు.. శుక్రవారం నుంచే కొత్త ఛార్జీల అమలు

సామాన్య రైలు ప్రయాణికుల జేబుకు చిల్లు పడనుంది. దేశవ్యాప్తంగా రైలు టికెట్ ధరలను పెంచుతూ రైల్వే శాఖ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. పెరిగిన ధరలు ఈ శుక్రవారం (డిసెంబర్ 26) నుంచే అమలు కానున్నాయి.


ఏడాది కాలంలో రైల్వే చార్జీలను సవరించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గత జూలైలో కూడా ఒకసారి ధరలను పెంచిన సంగతి తెలిసిందే.

రైల్వే కార్యకలాపాల నిర్వహణలో స్థిరత్వం, ప్రయాణికులకు మెరుగైన సదుపాయాల కల్పన మధ్య సమతుల్యత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఎవరిపై ఎంత భారం?

కొత్త ధరల ప్రకారం.. ప్రయాణించే దూరం, కోచ్ కేటగిరీని బట్టి చార్జీల పెంపు ఉంటుంది.

ఆర్డినరీ క్లాస్: 215 కిలోమీటర్లకు మించి ప్రయాణించే సాధారణ తరగతి ప్రయాణికులకు కిలోమీటరుకు 1 పైసా పెరగనుంది.

మెయిల్/ఎక్స్‌ప్రెస్ & ఏసీ క్లాస్‌లు: నాన్-ఏసీ మెయిల్/ఎక్స్‌ప్రెస్ కోచ్‌లు, అన్ని రకాల ఏసీ క్లాస్‌లకు (స్లీపర్, ఏసీ 3-టియర్, 2-టియర్, ఫస్ట్ క్లాస్) కిలోమీటరుకు 2 పైసలు అదనంగా వసూలు చేస్తారు.

వీరికి ఊరట..

మధ్యతరగతి, రోజువారీ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా రైల్వే శాఖ కొన్ని మినహాయింపులు ఇచ్చింది:

సబర్బన్ సర్వీసులు: లోకల్ రైళ్లలో ప్రయాణించే వారికి ధరల పెంపు వర్తించదు.

సీజన్ టికెట్లు: మంత్లీ పాస్ (సీజన్ టికెట్) తీసుకునే వారికి పాత ధరలే కొనసాగుతాయి.

స్వల్ప దూరం: 215 కిలోమీటర్ల లోపు ప్రయాణించే సాధారణ తరగతి (Ordinary Non-AC) ప్రయాణికులపై ఎలాంటి అదనపు భారం ఉండదు.

దూరాన్ని బట్టి అదనపు బాదుడు

215 కిలోమీటర్ల పైబడిన సాధారణ ప్రయాణాలకు స్లాబ్ విధానంలో ధరలను పెంచారు:

  • 216 కి.మీ – 750 కి.మీ: రూ. 5 పెరుగుదల
  • 751 కి.మీ – 1250 కి.మీ: రూ. 10 పెరుగుదల
  • 1251 కి.మీ – 1750 కి.మీ: రూ. 15 పెరుగుదల
  • 1751 కి.మీ – 2250 కి.మీ: రూ. 20 పెరుగుదల

వందే భారత్, రాజధాని సర్వీసుల్లోనూ మార్పులు

కేవలం సాధారణ రైళ్లే కాకుండా ప్రీమియం సర్వీసులైన వందే భారత్, రాజధాని, శతాబ్ది, దురంతో, తేజస్, హమ్‌సఫర్, అమృత్ భారత్, గతిమాన్, గరీబ్ రథ్, జన్ శతాబ్ది వంటి రైళ్లలో కూడా క్లాస్ వారీగా ధరలను సవరించారు.

గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం

ఈ పెరిగిన ధరలు కేవలం డిసెంబర్ 26వ తేదీన లేదా ఆ తర్వాత బుక్ చేసుకునే టికెట్లకు మాత్రమే వర్తిస్తాయి. మీరు ఒకవేళ ఈ తేదీకి ముందే టికెట్ బుక్ చేసుకుని ఉండి, మీ ప్రయాణం శుక్రవారం తర్వాత ఉన్నప్పటికీ.. మీరు అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

“ప్రయాణికుల సౌకర్యార్థం, రైల్వే వ్యవస్థ మనుగడను దృష్టిలో ఉంచుకుని ఈ సమతుల్య నిర్ణయం తీసుకున్నాం. సురక్షితమైన, సరసమైన ప్రయాణాన్ని అందించడమే మా లక్ష్యం” అని రైల్వే శాఖ తన ప్రకటనలో పేర్కొంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.