దారుణంగా ఛాంపియన్ ఆక్యుపెన్సీ.. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే?

టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ – ఊహా దంపతుల వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు రోషన్ మేకా. నిర్మల కాన్వెంట్, పెళ్లిసందD సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు రోషన్.


ఆయన నటించిన తాజా చిత్రమే ఛాంపియన్. స్వాతంత్య్రం వచ్చాక కూడా హైదరాబాద్ సంస్థానం.. భారతదేశంలో విలీనం కాలేదు. రజాకార్ల అకృత్యాలతో ప్రజలు అల్లాడిపోతూ, నిజాం నుంచి స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న రోజులవి. ఇలాంటి దశలో రజాకార్లకు ఎదురు తిరిగి వారితో పోరాడి చరిత్రలో నిలిచిపోయింది బైరాన్‌పల్లి. 1947-48 సంవత్సరాలలో బైరాన్‌పల్లిలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ ఛాంపియన్ చిత్రాన్ని తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్‌, ప్రమోషనల్ కార్యక్రమాలతో భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమా.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఛాంపియన్ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు ఛాంపియన్ మూవీ ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టిందో పరిశీలిస్తే..

ఛాంపియన్ తారాగణం

స్వప్న సినిమా, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలింస్ బ్యానర్లపై ప్రియాంక దత్, జీకే మోహన్, జెమిని కిరణ్‌లు సంయుక్తంగా ఈ ఛాంపియన్ మూవీని నిర్మించారు. ప్రదీప్ అద్వైతం ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఛాంపియన్‌లో రోషన్ సరసన అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటు కోవై సరళ, నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, కేకే మీనన్, మురళీ శర్మ, నరేష్, వెన్నెల కిషోర్, కృతి కాంజ్ సింగ్ రాథోడ్, భవానీ నీరటి, సంతోష్ ప్రతాప్, అవంతిక, హైపర్ ఆది తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఛాంపియన్ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీత దర్శకత్వం వహించగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా పనిచేశారు. మదీ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి బాధ్యతలు నిర్వర్తించారు. ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్.. ఈ సినిమాకు యాక్షన్ కొరియోగ్రఫి అందించారు.

ఛాంపియన్ బడ్జెట్ ఎంత?

నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి ఛాంపియన్ మూవీకి దాదాపు 45 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ కావడంతో ఆ రోజుల్లో తెలంగాణ సమాజం ఎలా ఉండేదో కళ్లకు కట్టినట్లు చూపించడానికి భారీ సెట్స్ వేయడంతో పాటు వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, ఇతర సాంకేతిక హంగుల కోసం ఛాంపియన్ మూవీకి భారీ బడ్జెట్ అయ్యింది. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో పాటు దాదాపు 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్‌ చక్రవర్తి నటిస్తుండటం, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, శ్రీకాంత్ వంటి అగ్రనటులు ఈ సినిమాను ప్రమోట్ చేయడంతో ఛాంపియన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఛాంపియన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

భారీ హైప్ నేపథ్యంలో రోషన్ మేకా మూవీకి మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ తదితర ఏరియాల థియేట్రికల్ రైట్స్ కలిపి ఛాంపియన్ మూవీకి 22 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు 16 కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకోవడం టాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. ఇవి కాకుండా శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, డబ్బింగ్ రైట్స్‌కు మంచి బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే అది ఎంత అనేది మాత్రం తెలియరాలేదు. ఛాంపియన్ మూవీ లాభాల్లోకి రావాలంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 23 కోట్ల రూపాయల షేర్.. 46 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. ఛాంపియన్ మూవీని తెలుగు రాష్ట్రాల్లో 650 థియేటర్‌లలో, రెస్టాఫ్ ఇండియా+ ఓవర్సీస్‌లో 1300కు పైగా స్క్రీన్స్‌లో విడుదల చేశారు.

ఛాంపియన్ తొలిరోజు కలెక్షన్స్

నార్త్ అమెరికాలో ఛాంపియన్‌ మూవీ అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 91 కేంద్రాలలో, 129 షోలకు గాను, 1216 టికెట్స్ అమ్ముడయ్యాయి. తద్వారా అడ్వాన్స్ బుకింగ్‌లో 17589 డాలర్లు (భారత కరెన్సీలో 15.80 లక్షల రూపాయలు) వసూలు చేసింది. అటు ఇండియాలోనూ అడ్వాన్స్ బుకింగ్‌లో ఛాంపియన్ మూవీకి మంచి ఆక్యూపెన్సీ సాధించినట్లుగా వార్తలు వస్తున్నాయి. తొలిరోజు సాయంత్రం 6 గంటల వరకు ఛాంపియన్‌కు 38 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 314 షోలు, విశాఖలో 94 షోలు, విజయవాడలో 64 షోలు, బెంగళూరులో 47 షోలు చొప్పున ప్రదర్శితమైనట్లు సాక్‌నిక్ నివేదించింది.

సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఇండియాలో ఛాంపియన్ మూవీకి 1.43 కోట్ల రూపాయల నికర కలెక్షన్స్ వచ్చాయి. తొలిరోజు రోషన్ మేకా మూవీ వరల్డ్ వైడ్‌గా 3 కోట్ల నుంచి 4 కోట్ల రూపాయల రేంజ్‌లో ఓపెనింగ్స్ రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అవతార్ 3, దురంధర్, అఖండ 2, శంబాల, దండోరా, వృషభ తదితర చిత్రాల నుంచి ఈ సినిమాకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. భారీ టార్గెట్ నేపథ్యంలో ఈ సినిమా ఎంత వరకు నిలబడుతుందో చూడాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.