తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (టీజీపీఆర్బీ) గురువారం మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (టీజీఎస్ఆర్టీసీ)లో ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రెయినీ (టీఎస్టీ), మెకానికల్ సూపర్వైజర్ ట్రెయినీ (ఎంఎస్టీ) పోస్టులను భర్తీ చేయనున్నారు.
ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రెయినీగా 84 ఖాళీలు, మెకానికల్ సూపర్వైజర్ ట్రెయినీగా 114 ఖాళీలు ఉన్నాయి. ఈ రెండు రకాల పోస్టులకు నెలవారి వేతనం రూ.27,080 నుంచి రూ.81,400 వరకు ఉండేలా నిర్ణయించినట్లుగా అధికారులు తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు టీజీపీఆర్బీ అధికారిక వెబ్సైట్ www.tgprb.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2025 డిసెంబర్ 30న ఉదయం 8 గంటల నుంచి 2026 జనవరి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసేకునేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
అభ్యర్థులు తమ అర్హత, నిబంధనలను ముందుగా జాగ్రత్తగా పరిశీలించుకున్న తర్వాతే దరఖాస్తులు సమర్పించుకోవాలని బోర్డు సూచించింది. అర్హత ప్రమాణాలు, ఆన్లైన్ అప్లికేషన్ విధానం, ఎంపిక ప్రక్రియ, అభ్యర్థులకు ఇచ్చిన సూచనలతో సహా పూర్తి వివరాలు నోటిఫికేషన్ రూపంలో టీజీపీఆర్బీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. కాగా.. గతంలో డ్రైవర్లు, శ్రామికుల పోస్టుల భర్తీ కోసం కూడా రెగ్యులర్ ప్రాతిపదికన నోటిఫికేషన్ వేశారని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీలో కాంట్రాక్టు, క్యాజువల్, ఔట్ సోర్సింగ్ నియామకాలకు స్వస్తి చెప్పి రెగ్యులర్ బేసిస్ లో నియామకాలు చేపడుతోందని.. దీన్ని తాము స్వాగతిస్తున్నామని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి తెలిపారు.


































