జనవరి 1 నుంచి మీ జేబుకు చిల్లు!.. మారనున్న 9 రూల్స్ ఇవే

2025వ సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. మరికొద్ది రోజుల్లోనే మనం 2026 కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. అయితే జనవరి 1వ తేదీ నుంచి కేవలం క్యాలెండర్ మాత్రమే కాదు..


మీ జేబుపై ప్రభావం చూపించే అనేక ఆర్థిక నియమాలు కూడా మారబోతున్నాయి. ఎల్పీజీ సిలిండర్ ధరల నుంచి జీతాల వరకు జనవరి 1 నుంచి మారనున్న ఆ 9 ముఖ్యమైన మార్పులు ఇవే..

1.పాన్-ఆధార్ లింకింగ్

ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేయడానికి ఇచ్చిన గడువు డిసెంబర్ 31తో ముగియనుంది. ఒకవేళ మీరు ఈ పని పూర్తి చేయకపోతే, జనవరి 1 నుంచి మీ పాన్ కార్డ్ పనిచేయకుండా పోతుంది. దీనివల్ల బ్యాంకింగ్ లావాదేవీలు, ఐటీఆర్ రీఫండ్స్ పొందడం కష్టమవుతుంది.

2. యూపీఐ, సిమ్ నిబంధనలు

డిజిటల్ మోసాలను అరికట్టడానికి యూపీఐ, డిజిటల్ పేమెంట్ నియమాలను ప్రభుత్వం కఠినతరం చేస్తోంది. సిమ్ కార్డ్ వెరిఫికేషన్ ప్రక్రియ మరింత కఠినం కానుంది. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్‌ల ద్వారా జరిగే మోసాలను తగ్గించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నారు.

3. బ్యాంక్ లోన్ల, ఎఫ్‌డీ (FD) రేట్లు

ఎస్‌బీఐ (SBI), పీఎన్‌బీ (PNB), హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) వంటి ప్రధాన బ్యాంకులు జనవరి 1 నుండి కొత్త వడ్డీ రేట్లను అమలు చేయనున్నాయి. దీనివల్ల కొత్తగా లోన్ తీసుకునే వారికి లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే వారికి లాభనష్టాలు మారవచ్చు.

4. ఎల్పీజీ (LPG) ధరలు

ప్రతి నెల ఒకటో తేదీన చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తాయి. జనవరి 1 నుంచి గృహ అవసరాలకు వాడే సిలిండర్ ధరలో మార్పు ఉండవచ్చు. గత నెలలో కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గిన నేపథ్యంలో, ఈసారి సామాన్యులకు ఎలాంటి వార్త అందుతుందో చూడాలి.

5. సీఎన్జీ-పీఎన్జీ, ఏటీఎఫ్ (ATF)

గ్యాస్ ధరలతో పాటు సీఎన్జీ, పీఎన్జీ, విమాన ఇంధనం (Jet Fuel) ధరల్లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా చమురు కంపెనీలు వీటిని సవరిస్తాయి.

6. కొత్త ఆదాయపు పన్ను చట్టం

1961 నాటి పాత పన్ను చట్టం స్థానంలో వచ్చే కొత్త ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 2025 అమలుకు సంబంధించి ప్రభుత్వం జనవరిలో కొత్త ఐటీఆర్ ఫారమ్‌లను నోటిఫై చేయనుంది. ఇది పన్ను చెల్లింపు ప్రక్రియను మరింత సరళతరం చేయనుంది.

7. వ వేతన సంఘం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది అతిపెద్ద వార్త. 7వ వేతన సంఘం గడువు డిసెంబర్ 31తో ముగియనుంది. 8వ వేతన సంఘం జనవరి 1, 2026 నుండి అమలులోకి వస్తుందని భావిస్తున్నారు. దీనివల్ల ఉద్యోగుల జీతాలు, పెన్షన్లలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది.

8. రైతులకు కొత్త నిబంధనలు

పీఎం-కిసాన్ ) పథకం ప్రయోజనం పొందాలంటే రైతులు యూనిక్ కిసాన్ ఐడీ కలిగి ఉండటం తప్పనిసరి కానుంది. అలాగే అడవి జంతువుల వల్ల పంట నష్టపోతే, 72 గంటల్లోగా రిపోర్ట్ చేస్తే బీమా వర్తించేలా నిబంధనలు మారనున్నాయి.

9. పెరగనున్న కార్ల ధరలు

కొత్త ఏడాదిలో కారు కొనాలనుకునే వారికి షాక్. టాటా మోటార్స్, హోండా, నిస్సాన్, బీఎండబ్ల్యూ వంటి కంపెనీలు జనవరి 1 నుండి వాహనాల ధరలను 3 శాతం వరకు పెంచాలని నిర్ణయించుకున్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.