ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎలాంటి సంచలనాలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇక ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా పుష్ప 2 (Pushpa 2)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 5వ తేదీ విడుదల కాగా డిసెంబర్ 4వ తేదీ ఈ సినిమా ప్రీమియర్లు ప్రసారమయ్యాయి. అయితే ఈ సినిమా విడుదల సమయంలో సంధ్యా థియేటర్ వద్ద తొక్కి సలాట జరిగిన సంగతి తెలిసిందే.
అల్లు అర్జున్ పై చార్జిషీట్ దాఖలు..
ఈ తొక్కిసలాట ఘటనలో భాగంగా రేవతి అనే మహిళ అభిమాని అక్కడికక్కడే మరణించారు. ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రగాయాలు పాలవ్వడమే కాకుండా ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితులలో ఉన్నారు. ఈ ఘటనలో భాగంగా అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయడమే కాకుండా అప్పట్లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో భాగంగా అల్లు అర్జున్ పై అభియోగాలు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ తో పాటు మరో 23 మందిపై చార్జి షీట్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ తో పాటు ఆయన మేనేజర్ వ్యక్తిగత సిబ్బందితో సహా సుమారు 8 మంది బౌన్సర్లపై చార్జ్ షీట్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది.
సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం..
ఈ కేసు విచారణలో భాగంగా కేవలం సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట ఘటన జరిగినట్టు నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటు మేనేజర్ పై కూడా అభియోగాలు నమోదు చేశారు. అయితే సంధ్య థియేటర్ వద్ద భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారనే విషయం తెలిసి సంధ్య థియేటర్ వద్దకు వెళ్లినందుకు అల్లు అర్జున్ ని కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చి అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇలా ఈ ఘటన జరిగి ఏడాది అవుతున్న ఇప్పటికీ ఈ కేసు వెంటాడుతూనే ఉంది. తాజాగా అల్లు అర్జున్ పై కూడా చార్జి షీట్ దాఖలు చేయడంతో ఈ కేసు విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియాల్సి ఉంది.
శ్రీ తేజ్ కుటుంబానికి అండగా ..
అల్లు అర్జున్ పై ఈ కేసు నమోదు కావడంతో గతంలో పోలీసులు ఆయనని అరెస్టు చేసి ఒకరోజు మొత్తం జైలులో ఉంచిన సంగతి తెలిసిందే. అనంతరం బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇక ఈ తొక్కిసలాట ఘటనలో భాగంగా తీవ్రంగా గాయపడిన చిన్నారి శ్రీ తేజ్ ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదని చెప్పాలి. ఈ చిన్నారి క్షేమం గురించి అల్లు అర్జున్ పూర్తి బాధ్యతలను తీసుకున్నారు. ఈ చిన్నారి కోసం దాదాపు 3.20 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఇటీవల వెల్లడించారు. ఇలా శ్రీతేజ్ కుటుంబానికి అల్లు కుటుంబం పూర్తిస్థాయిలో అండగా నిలిచారు.


































