కరివేపాకు మన భారతీయ వంటల్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
దాలా, సాంబార్, కూరలు, చట్నీలు ఏవైనా సరే… చివరగా కరివేపాకు వేసినప్పుడే ఆ వంటకు పూర్తి వాసన, రుచి వస్తుంది. అందుకే ఇప్పుడు చాలామంది మార్కెట్లో కొనడం కంటే ఇంట్లోనే కరివేపాకు మొక్కను పెంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. బాల్కనీ అయినా, టెర్రస్ అయినా సరే… ఇంట్లో పెంచుకుంటే వంటకు ఎప్పుడూ తాజా ఆకులు దొరుకుతాయి. అంతేకాదు, ఇంట్లో పచ్చదనం పెరుగుతుంది, దోమలు, ఈగలు కొంతవరకు దూరంగా ఉంటాయి.
అయితే చాలా మందికి ఎదురయ్యే సమస్య ఏమిటంటే, మొదట బాగానే పెరిగిన కరివేపాకు మొక్క క్రమంగా బలహీనంగా మారుతుంది. ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయి, కొత్త మొగ్గలు రావు, కొన్నిసార్లు ఆకులు ఊడిపోతాయి. ప్రతిరోజూ నీళ్లు పోస్తున్నా ఎందుకు ఇలా అవుతుందో అర్థం కాక టెన్షన్ పడతారు. నిజానికి కరివేపాకు మొక్క చాలా సున్నితమైనది. సరైన మట్టి, పోషకాలు, నీరు సమతుల్యం లేకపోతే వెంటనే ప్రభావం చూపిస్తుంది.
కరివేపాకు మొక్కకు నైట్రోజన్ ఎక్కువగా ఉండే మట్టి బాగా నచ్చుతుంది. కొద్దిగా ఆమ్లత్వం ఉన్న మట్టి అయితే ఇంకా మంచిది. మట్టి పూర్తిగా ఎండిపోవడం కూడా మంచిది కాదు, అలాగే ఎప్పుడూ తడిగా ఉండటం కూడా హానికరం. మొక్కను గాలి బాగా వచ్చే చోట, నేరుగా ఎక్కువ సూర్యరశ్మి పడని ప్రదేశంలో ఉంచాలి. రోజుకు నాలుగు నుంచి ఐదు గంటలు మృదువైన వెలుతురు ఉంటే సరిపోతుంది.
ఇంటి దగ్గరే దొరికే పులుసు మజ్జిగ లేదా పులుసు పెరుగు కరివేపాకు మొక్కకు చాలా ఉపయోగపడుతుంది. ఇవి మట్టిలోని pH స్థాయిని సమతుల్యం చేస్తాయి, మొక్కకు అవసరమైన నైట్రోజన్‌ను అందిస్తాయి. ఒక గ్లాసు నీటిలో రెండు లేదా మూడు స్పూన్లు మజ్జిగ లేదా కొద్దిగా పెరుగు కలిపి వారం రోజులకు ఒకసారి మొక్కకు పోస్తే సరిపోతుంది. కొద్ది రోజుల్లోనే ఆకులు మెరుస్తూ కనిపిస్తాయి.
ఆకులు పసుపు రంగులోకి మారి పడిపోతున్నాయంటే మెగ్నీషియం లోపం ఉండవచ్చు. అప్పుడు ఎప్సమ్ సాల్ట్ ఉపయోగించవచ్చు. ఒక లీటర్ నీటిలో ఒక చిన్న స్పూన్ ఎప్సమ్ సాల్ట్ కలిపి నెలకు రెండు సార్లు మాత్రమే మొక్కకు పోయాలి. ఎక్కువగా వేయకూడదు. అలా చేస్తే మొక్క మళ్లీ పచ్చగా మారుతుంది.
ఇంట్లో రోజూ వాడే టీ పొడి కూడా వృథా చేయాల్సిన అవసరం లేదు. వాడిన టీ పొడిని బాగా కడిగి, పాలు, చక్కెర లేకుండా ఆరబెట్టి, నెలకు ఒకసారి మట్టిలో కలిపితే మట్టికి మంచి పోషణ లభిస్తుంది. ఇది కొత్త కొమ్మలు రావడానికి సహాయపడుతుంది.
నీళ్లు పోసే విషయంలో కూడా జాగ్రత్త అవసరం. మట్టి పైభాగం ఎండిపోయినప్పుడు మాత్రమే నీళ్లు పోయాలి. ఎక్కువ నీరు పోస్తే వేర్లు పాడవుతాయి. ప్రతి 15-20 రోజులకు మట్టిని కొద్దిగా కలిపితే గాలి వేర్లకు చేరుతుంది. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే మీ కరివేపాకు మొక్క సంవత్సరం పొడవునా పచ్చగా, దట్టంగా పెరుగుతుంది. ఇంట్లోనే తాజా కరివేపాకు దొరకడం వంటకు రుచి పెడుతుంది, మనమే పెంచుకున్న ఆనందం కూడా ఇస్తుంది.


































