ఏపీలో ఓవైపు అమరావతి రాజధాని, మరోవైపు ఐటీ రాజధానిగా విశాఖను అభివృద్ది చేస్తున్న ప్రభుత్వం ముందు దీర్ఘకాలంగా పెడింగ్ లో ఉన్న మరో రెండు కీలక ప్రతిపాదనలు వచ్చాయి.
వీటి విషయంలో దూకుడుగా అడుగులు వేస్తున్న ప్రభుత్వానికి అనూహ్యంగా కేంద్రం చివరి నిమిషంలో షాకిచ్చింది. దీంతో ఈ రెండు ప్రతిపాదనల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా బ్రేక్ వేసుకోవాల్సిన పరిస్దితి ఎదురవుతోంది.
తాజాగా కూటమి సర్కార్ ముందు అమరావతిలో భాగమైన విజయవాడ నగరాన్ని గ్రేటర్ విజయవాడగా విస్తరించాలనే ప్రతిపాదన వచ్చింది. స్ధానిక ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు తెచ్చిన ఈ ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించడంతో పాటు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. దీంతో అధికారులు కూడా గ్రామాల తీర్మానాలు పంపిస్తే గ్రేటర్ లో విలీనంపై ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ ఇచ్చేస్తామని చెప్పేశారు. అంతలోనే దీనికి బ్రేక్ పడింది.
అలాగే గ్రేటర్ తిరుపతి ఏర్పాటుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పావులు కదిపింది. దీని విషయంలోనూ చివరి నిమిషంలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఈ మేరకు మున్సిపల్ మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. గ్రేటర్ తిరుపతి, గ్రేటర్ విజయవాడ చెయ్యాలని నిర్ణయించినా కొన్ని ఇబ్బందులు వచ్చాయని నారాయణ వెల్లడించారు. గ్రేటర్ విజయవాడ ,గ్రేటర్ తిరుపతి వెంటనే చేయడానికి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జనాభా సర్వేనే దీనికి కారణమన్నారు.
కేంద్రం చేపట్టిన జనాభా సర్వే పూర్తయ్యే వరకు డీ లిమిటేషన్స్ చేయొద్దనే నిబంధనలు ఉన్నాయని మంత్రి నారాయణ తెలిపారు. సర్వే పూర్తయిన తర్వాత గ్రేటర్ తిరుపతి, గ్రేటర్ విజయవాడ ప్రాసెస్ ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు. దీంతో కొత్త ఏడాదిలో గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతిగా మారుతాయని ఈ రెండు నగరాలు పెట్టుకున్న ఆశలపై నీళ్ళు చల్లినట్లయింది. ఇప్పుడు కేంద్రం జనగణన పూర్తి చేసిన తర్వాతే ఈ రెండు నగరాల విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది.


































