ఏందయ్యా ప్రభాస్ అలా అనేశావ్.. కొందరికి నిద్ర పట్టదే

 ‘ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండాల’నేది పెద్దల మాట. నేటి రోజుల్లో చద్దిమూటలాంటి మాటను పాటించడం అరుదే. రంగం ఏదైనా ఎదగాలి, ఒదిగి ఉండాలి, మూలాలు మరువకూడదు.


కానీ, నేడు రోజుకో మాట, పూటకో బాట, క్షణానికో ఆలోచన. ఎంత వేగంగా ఎంతెత్తుకి చేరుకుంటాం.. ఎంతగా చెలరేగిపోదామనే ఎక్కువ శాతం. కెరీర్ మొదట్లో ఓ మాట.. కెరీర్ మధ్యలోనూ ఇంకో మాట.. కెరీర్ పీక్స్ లో ఇంకేదో మాట. ఇదే నడుస్తోంది. కానీ, ‘రాజాసాబ్’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్లో పాన్ ఇండియా స్టార్ గా వెలిగిపోతున్న ప్రభాస్ భిన్నంగా కనిపించాడు. ‘మెగాస్టార్ చిరంజీవి’ని ఉద్దేశించి ‘సీనియర్ సీనియరే.. సీనియర్ల నుంచి నేర్చుకున్నదే మేము.. సీనియర్ల తర్వాతే మేము.. వంద శాతం’ అని తానేంటో చెప్పాడు.

ఇది చాలా గొప్ప విషయం. తన సినిమా విడుదలవుతోంది. మిగిలిన ఫ్యాన్స్ ను ఆకట్టుకోవాలని చెప్పినట్టు ఏమాత్రం అనిపించదు ప్రభాస్ వినయంతో చెప్పిన మాటలు చూస్తే. అంత అవసరం కూడా లేదాయనకు. వరుసగా 5 సినిమాలు తొలిరోజే 100కోట్లు కలెక్షన్లు సాధించిన ఏకైక ఇండియన్ హీరోగా హవా చూపిస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఎవరి మెప్పో పొందేందుకు ఇలాంటి మాటలు మాట్లాడడు. సహజంగానే చాలా సిగ్గరి. మాటల్లో పొదుపు. బయట కంటే సినిమాల్లోనే కనిపించేది ఎక్కువ. తక్కువ మాటల్లో చెప్పి ఎక్కువ ఇంపాక్ట్ చూపించాడు. తమిళ సినీ ఫ్యాన్స్ కూడా చిరంజీవికి ప్రభాస్ ఇస్తున్న గౌరవం తమ హీరోలు చూసి నేర్చుకోవాలంటూ పోస్టులు చేస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు.

చిరంజీవికి ప్రభాస్ ఇచ్చిన గౌరవం చాలామందికి కనువిప్పు. చిరంజీవి అండ, ఆశీర్వాదంతో సినిమాలు చేసిన హీరోలు చూసి నేర్చుకోవాల్సిందే. ఒక సినిమా హిట్టవగానే తామే ఇండస్ట్రీకి దిక్కన్నట్టు చూసే నేటి జనరేషన్ కు ప్రభాస్ పాఠమే చెప్పాడు. ఒకప్పుడు చిరంజీవి సినిమా రిలీజ్ అంటే తమ సినిమా విడుదలకు వేరే తేదీలు చూసుకున్న ఇండస్ట్రీ ఇది. తెలుగు సినిమాను కమర్షియల్ గా భారతీయ సినిమాలో నిలబెట్టిందీ చిరంజీవే. అలాంటి హీరో గురించి ప్రభాస్ కాబట్టే అలా చెప్పాడు. మరొకరైతే.. సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ ఆడాలని సింపుల్ గా తేల్చేసేవాళ్లు. కానీ, ప్రభాస్ తన స్పీచ్ తో ఎందరో మనసుల్ని గెలుచుకున్నాడు.. మరెందరో మనసుల్ని, ఆలోచనల్ని కదిపేసి నిద్రలేకుండా చేశాడు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.