భారతీయ రోడ్ల మీద ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు కేవలం స్పోర్ట్స్ బైక్‌లు లేదా సాధారణ ప్యాసింజర్ బైక్‌లకే ప్రాధాన్యత ఉండేది. కానీ 2025 నాటికి సీన్ పూర్తిగా మారిపోయింది.
పాతకాలపు లుక్ (Retro), మోడ్రన్ టెక్నాలజీ కలగలిసిన నియో రెట్రో బైక్‌లకు యువత బ్రహ్మరథం పడుతోంది.
ఈ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350, యమహా XSR 155 వంటి దిగ్గజాలు మార్కెట్లో రాజ్యమేలుతున్నా, ఇప్పుడు అందరి చూపు టివిఎస్ రోనిన్ 225 (TVS Ronin 225) వైపు మళ్లింది. ఒకప్పుడు తక్కువ అంచనా వేసిన ఈ బైక్, ఇప్పుడు విక్రయాల్లో సునామీ సృష్టిస్తోంది.
టీవీఎస్ రోనిన్ సాధించిన ఈ విజయం ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో చర్చనీయాంశంగా మారింది. నవంబర్ 2025 సేల్స్ రిపోర్ట్ చూస్తే, రోనిన్ ఏకంగా 7,653 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది.సరిగ్గా ఏడాది క్రితం అంటే నవంబర్ 2024లో ఈ బైక్ కేవలం 3,200 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది.
అంటే కేవలం ఒకే ఒక్క ఏడాదిలో 139.16 శాతం అద్భుతమైన వృద్ధిని సాధించింది. మార్కెట్లోకి ఎన్ని కొత్త కాంపిటీటర్లు వచ్చినా, రోనిన్ తన ప్రత్యేకతను చాటుకుంటూ కస్టమర్లను బుట్టలో వేసుకుంటోంది.
రోనిన్ సక్సెస్ వెనుక కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. ఇది కేవలం ఒక క్రూయిజర్ కాదు, కేవలం ఒక స్పోర్ట్స్ బైక్ కాదు. ఇది ఒక క్రాసోవర్. సిటీలోని ట్రాఫిక్‌లో సులభంగా దూసుకెళ్లాలన్నా, వీకెండ్‌లో హైవేల మీద లాంగ్ డ్రైవ్ వెళ్లాలన్నా రోనిన్ పర్ఫెక్ట్ అని రైడర్లు చెబుతున్నారు. దీని వెడల్పైన టైర్లు, సౌకర్యవంతమైన సీటింగ్ పొజిషన్ ఏ రకమైన రోడ్డు మీదైనా సాఫీగా సాగిపోయేలా చేస్తాయి.
తన కస్టమర్లకు మరింత కిక్కు ఇవ్వడానికి టీవీఎస్ ఇటీవల అగోండా ఎడిషన్(Agonda Edition) పేరుతో ఒక లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను లాంచ్ చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.31 లక్షలు. గోవాలోని ఫేమస్ అగోండా బీచ్ స్ఫూర్తితో వచ్చిన ఈ బైక్ లుక్ అదిరిపోయింది.
బాడీ అంతా స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉండి, దాని మీద నీలం, ఎరుపు గ్రాఫిక్స్ చాలా స్పోర్టీగా కనిపిస్తాయి. దీనికి తోడు నలుపు రంగు అలాయ్ వీల్స్‌పై ఎరుపు రంగు లైనింగ్ ఉండటంతో రోడ్డు మీద ఈ బైక్ వెళ్తుంటే ఎవరైనా తిరిగి చూడాల్సిందే.
టీవీఎస్ రోనిన్ కేవలం లుక్ మాత్రమే కాదు, లోపల కూడా గట్టి సత్తా ఉన్న బైక్. ఇందులో 225.9 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 20.4 bhp పవర్, 19.93 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు స్లిప్పర్ అసిస్ట్ క్లచ్ ఫీచర్ ఉండటం వల్ల ట్రాఫిక్‌లో పదే పదే గేర్లు మార్చడం అస్సలు భారం అనిపించదు.
ఇందులో గోల్డెన్ యూఎస్‌డీ ఫోర్కులు బైక్ లుక్‌ను మార్చేయడమే కాకుండా, కుదుపులను చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేస్తాయి. టీ ఆకారంలో ఉండే హెడ్‌లైట్ రోనిన్ కి ఒక సిగ్నేచర్ లుక్‌ను ఇస్తుంది. బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్ట్ చేసుకుని టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ అలర్ట్స్ పొందవచ్చు. డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఉండటం వల్ల వేగంగా వెళ్తున్నప్పుడు సడన్ బ్రేక్ వేసినా బైక్ స్కిడ్ అవ్వదు.
చివరగా చెప్పాలంటే తక్కువ ధరలో మంచి పవర్, స్టైల్, టెక్నాలజీ కావాలనుకునే వారికి టీవీఎస్ రోనిన్ ఇప్పుడు బెస్ట్ ఆప్షన్‌గా మారింది. ముఖ్యంగా బడ్జెట్ ధరలో ఒక ప్రీమియం రెట్రో బైక్ సొంతం చేసుకోవాలనుకునే మధ్యతరగతి యువతకు ఇది వరంగా మారింది. అందుకే హంటర్ లాంటి దిగ్గజాల మధ్య కూడా రోనిన్ తన జెండాను రెపరెపలాడిస్తోంది.


































