ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు మంత్రి సీతక్క శుభవార్త వినిపించారు. సుదీర్ఘ కాలంగా ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని ప్రకటించారు.
సొంత హక్కుల కోసం ఉపాధ్యాయులు పోరాడుతూనే.. ప్రతి ఒక్కరికి చదువు అందుబాటులో ఉండాలని సూచించారు. టీచర్ల పోరాటాలు న్యాయమైనవని ధనసరి అనసూయ ప్రకటించారు.
టీఎస్‌యూటీఎఫ్ సమావేశంలో సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై స్పందించి కీలక ప్రకటనలు చేశారు. ‘ప్రభుత్వ విద్య బలోపేతం కావాలి అని మీరు పోరాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను ఒక్కొక్కటిగా తీరుస్తోంది. ఉపాధ్యాయ భర్తీలను చేపట్టి మీ పని భారాన్ని తగ్గించింది. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు, బదిలీలను చేపట్టింది’ అని సీతక్క గుర్తుచేశారు. ఇక వేతన సవరణ సంఘం (పీఆర్సీ), పెండింగ్ బకాయిలు ఉన్నాయనే విషయం తెలుసు. మీ సమస్యలు.. మీ ఆవేదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా’ అని హామీ ఇచ్చారు. ‘కారుణ్య నియామకాలు, పాఠశాల సమయ సవరణ, రిటైర్మెంట్ బెనిఫిట్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం’ అని సీతక్క హామీ ఇచ్చారు.
‘ఉపాధ్యాయుల సేవలపై స్పందిస్తూ.. పిల్లల నడవడికను తీర్చిదిద్దేవీ పాఠశాలలే. పిల్లల భవిష్యత్తును ఆదర్శవంతంగా.. స్ఫూర్తిదాయకంగా తీర్చిదిద్దాలి. లక్షల మంది మేధావులను తీర్చిదిద్దేది టీచర్లే. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది. ఆ తరగతి గదుల బాధ్యతను టీచర్లు నిర్వర్తిస్తున్నారు . నాణ్యమైన విద్య సామాన్యులకు అందుబాటులో ఉండాలి’ అని సీతక్క తెలిపారు. ప్రభుత్వ విద్య బలపేతంలో టీచర్ల భాగస్వామ్యం.. సహకారం ఎంతో ముఖ్యమైనదని గుర్తుచేశారు.
‘ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఉపాధిని హక్కుగా పొందకుండా కేంద్ర భిక్షగా భావిస్తుంది. అందుకే ఉపాధి హామీ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తెచ్చారు. ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి తీసుకురావడంలో ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత టీచర్ల మీద ఉంది’ అని సీతక్క సూచించారు. సామాన్యుల పక్షాన పోరాటం చేయాల్సిన బాధ్యత కూడా టీచర్ల మీద ఉందని చెప్పారు. ప్రభుత్వ టీచర్లకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు.
‘సమాజ జ్ఞానాన్ని, శ్రమను గౌరవించడం ప్రజల కోసం జీవించాలనే సిద్ధాంతాన్ని, విలువలను మన జీవితంలో పాటిస్తూ లక్షలాది మంది విద్యార్థులను టీచర్లు తీర్చిదిద్దాలి. ప్రైవేట్ విద్యా సంస్థలకు తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలలను ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలి’ అని సీతక్క సూచించారు. ‘టీచర్ల చేతిలో దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ప్రభుత్వం మీకు పూర్తిస్థాయిలో సహకరిస్తుంది. కేరళ తరహాలో అక్షరాస్యతలో తెలంగాణ ముందంజలో ఉంచేలా కలిసి కృషి చేద్దాం’ అని పిలుపునిచ్చారు. ‘అందరి జీవితాలను తీర్చిదిద్ది ఆదర్శవంతులుగా తీర్చిదిద్దే వ్యవస్థ విద్యా వ్యవస్థ. అలాంటి పవిత్ర వ్యవస్థలో టీచర్లు ఉన్నారు. విద్యతోనే విముక్తి సాధ్యమవుతుంది’ అని సీతక్క వివరించారు.


































